
వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలోని హిందూ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఇండియానా రాష్ట్రం జాన్సన్ కౌంటీలోని అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ ఆలయంపై ఖలిస్థాన్ వేర్పాటు వాదులు దాడికి పాల్పడినట్లు ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ ‘ఎక్స్’లో పేర్కొంది. ఖలిస్థానీకి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా దేవాలయంపై పలు ద్వేషపూరిత నినాదాలు రాశారని వెల్లడించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇటువంటి ద్వేషపూరిత విధ్వంసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.
ఈ ఏడాదిలో అమెరికాలోని హిందూ దేవాలయాలపై ఇది నాలుగో దాడిగా నిర్వాహకులు పేర్కొన్నారు. మళ్లీ ఇటువంటి దాడులు జరగకుండా ఆలయం వద్ద భద్రత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఘటన వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. యూఎస్‌లోని హిందూ దేవాలయాలకు తగిన భద్రత కల్పించాలని స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేసింది. మార్చిలో ఇదే విధంగా దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ప్రసిద్ధ హిందూ దేవాలయంపై దాడి జరిగినట్లు పేర్కొంది.




