ArticlesNews

దేశ విభజన గాయాలు : ఆఢ్వాణీ స్మృతులు

251views

అర్ధరాత్రి స్వతంత్రం అనుకుంటూ గొప్పగా కబుర్లు చెప్పుకుంటాం తప్పిస్తే, అంతకంటె ఒకరోజు ముందే మన దేశం నుంచి ఒక భాగం విడిపోయిందనీ, అదొక ప్రత్యేక దేశంగా ఏర్పడిందనీ గుర్తు చేసుకోవడం గొప్ప విషాదం. అహింసా యుద్ధంలో ఘన విజయం సాధించామని చెప్పుకుంటాం కానీ దేశ విభజన లక్షల మంది ప్రజల ధన మాన ప్రాణాలను తీసేసిన చరిత్ర మనకు తెలిసింది చాలా తక్కువ. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని పండుగ చేసుకోవడం అలవాటైపోయింది. కానీ ఆగస్టు 14నే రక్తపాతం జరిగిపోయిందని తలచుకోము. తమ అధికార స్వార్థం కోసం దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ హయాంలో దేశ విభజన గాయాలు ఏనాడూ చరిత్రగా బైటకు రాలేదు. జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ బాధామయ గాధలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరాన్ని విస్మయపరుస్తున్నాయి.

ప్రముఖ నేత, మాజీ ఉపప్రధానమంత్రి లాల్ కృష్ణ ఆఢ్వాణీ అవిభక్త భారతదేశంలో సింధ్ ప్రాంతంలోని కరాచీ నగరంలో జన్మించారు. ఆయన 20వ యేట దేశ విభజన జరిగింది. సింధ్ ప్రాంతం పాకిస్తాన్‌లోకి వెళ్ళడంతో ఆఢ్వాణీ కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. దేశ విభజన సమయంలో జరిగిన హింసాకాండకు ఆయన ప్రత్యక్ష సాక్షి. పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో హిందువుల మీద జరిగిన అత్యాచారాలను ఆయన కళ్ళారా చూసారు. వాటిని తన జీవిత చరిత్ర “My Country My Life”లో (తెలుగులో : ‘నా దేశం నా జీవితం’) అక్షరబద్ధం చేసారు. వాటిలోని కొన్ని ఘట్టాలను పరికిద్దాం.

********************************

‘‘ఆ రోజు నేను నా మోటార్ సైకిల్‌ మీద ఒక హిందూ కాలనీ నుండి మరొక కాలనీకి తిరుగుతూ ఉన్నాను. ఆ ప్రజల ముఖాల్లో దిగులు, భయం, ఆందోళన, కోపం, అన్నింటికంటే ముఖ్యంగా అనిశ్చితి స్పష్టంగా కనిపించాయి. వారి హృదయాలను కలచివేసే భావోద్వేగాలు, ‘తర్వాత ఏమి చేయాలి?’ అనే ప్రశ్నా అందరి మనస్సులలోనూ మెదులుతూ ఉన్నాయి. ఎందుకంటే, ఆ రోజు సాధారణమైన రోజు కాదు. పొరుగున ఉన్న పంజాబ్ ప్రొవిన్స్‌లో రక్తపాతం చోటు చేసుకుందనీ, దాని వల్ల హిందువులూ ముస్లిములూ వ్యతిరేక దిశల్లో సామూహికంగా వలసలు వెళ్ళారంటూ వార్తలు వస్తున్నాయి. తరువాత కొద్ది నెలలకే కరాచీలోనూ అవే దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ పిల్లలు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో కలిసి, తమ పాఠశాలలూ, ఇళ్ళూ, ఆటస్థలాలను శాశ్వతంగా వదిలి వెళుతున్నారు. భయాందోళనలకు గురైన హిందూ కుటుంబాలు కొత్తగా ఏర్పడిన సరిహద్దుకు అవతల ఉన్న కొత్త పట్టణాల్లో ఆశ్రయం పొందేందుకు గుంపులుగా పారిపోయాయి. దారిలో, వేలాది మంది చంపబడ్డారు మరియు పదుల కొద్దీ వేల మంది తమ ఆత్మీయులకు దూరమయ్యారు. కొన్నాళ్ళకే కరాచీ సహా సింధ్ ప్రొవిన్స్‌ అంతటా హిందూ జనాభా అనేది దాదాపు లేకుండా పోయింది.

సింధీలు అమితంగా గౌరవించే ఆధ్యాత్మిక గురువు సాధు టి.ఎల్. వాస్వానీ ఆనాటి పరిణామాలను అనంతర కాలంలో గుర్తుచేసుకున్నారు. ‘‘‘తుఫాను లాంటి ఈ మారణహోమంలో, తమ అలసిపోయిన శరీరాలకు విశ్రాంతి ఇవ్వడానికి, సామాన్యమైన భోజనం చేయడానికి ఒక సాధారణ నివాసం ఎక్కడ దొరుకుతుందో ఎవరికీ తెలియదు. వారు తమ స్నేహితులు, ఆత్మీయులతో మళ్ళీ కలుసుకోగలుగుతారో లేదో ఎవరికీ తెలియదు. ఇది మానవత్వాన్ని సమూలంగా నిర్మూలించడమే. ఆ భయంకరమైన నిర్మూలనలో, నేనూ నా ఇద్దరు సోదరీమణులూ మా తల్లిదండ్రుల నుంచి నిర్దాక్షిణ్యంగా వేరు చేయబడ్డాము. వారు సింధ్‌లోనే ఉండిపోయారు, మేము మాత్రం భద్రత కోసం హిందూస్థాన్‌ వెళ్ళిపోవలసి వచ్చింది. మా చిన్నారి జీవితాలను కుదిపివేసిన ఆ దారుణ విషాదాలలో మేము పూర్తిగా నిస్సత్తువగా మిగిలిపోయాము’’.

సింధ్ నుండి వలస వచ్చిన వారందరూ ఆ విషాదకరమైన రోజు వరకూ భారతీయులే. ఇకపై వారు బొంబాయి, కళ్యాణ్, ఢిల్లీ, ఇండోర్, జైపూర్, కలకత్తా, కాండ్లాలో వారి కొత్త నివాసాలుగా మారిన శరణార్థుల కాలనీలలో వారు భారతీయులుగానే కొనసాగారు. కానీ వారి మాతృభూమి, సొంత గడ్డ రాత్రికి రాత్రే విదేశంగా మారిపోయింది. వారి ప్రియమైన కరాచీ నగరం దానికి రాజధానిగా మారింది.

ఆ రోజు 1947 ఆగస్టు 14. సమైక్య భారతదేశం నుండి పాకిస్తాన్‌ను ప్రత్యేక ముస్లిం దేశంగా విభజించిన రోజు అది. కొన్ని సంవత్సరాలుగా, నేను ఒక దుష్ట పదబంధాన్ని వింటున్నాను – ‘రెండు దేశాల సిద్ధాంతం’. నా యువ మనస్సు దానిని సహజంగానే తిరస్కరించింది. “హిందువులు, ముస్లింల మతాలు వేరు అయినంత మాత్రాన వారికి రెండు వేర్వేరు దేశాలు దేనికి?’ ఆ విషయం నాకు అర్థం కాలేదు, ముఖ్యంగా సింధ్ ప్రాంత సామాజిక నిర్మాణాన్నీ, సాంస్కృతిక వాతావరణాన్నీ చూసినప్పుడు, దానిలో నుండి హిందువులు, ముస్లిములను పరస్పరం వేరు చేయలేము. అదేవిధంగా సింధ్‌ ప్రాంతాన్ని భారతదేశం నుండి వేరు చేయలేము. పాకిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పడదు అని నేను నమ్మాను. సింధ్‌లోని చాలామంది హిందువులు కూడా అలాగే భావించారు. “మేము వేల సంవత్సరాలుగా భారతదేశంలో భాగంగా ఉన్నాము, ఎప్పుడూ అలాగే ఉంటాము. మతం ఆధారంగా భారతదేశాన్ని ఎప్పటికీ విభజించలేము” అని విశ్వసించారు.

అయినప్పటికీ, దేశ విభజన జరిగిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేవలం కల్పనగా అనిపించిన విభజన, నిజంగా జరిగిపోయింది. కరాచీలోని చాలా ప్రాంతాల్లో ఆనందోత్సాహాలు లేవు. కొన్ని చోట్ల బాణాసంచా కాల్చారు, రాత్రంతా వేడుకలు చేసుకున్నారు. మరుసటి రోజు భారతదేశానికి స్వతంత్రం ప్రకటించారు. అప్పుడు కూడా నగరంలోని మా ప్రాంతంలో ఎలాంటి సంబరాలూ లేవు. దానికి బదులుగా, ఆవేదన అలముకుంది. భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాల్లోనూ బ్రిటిష్ జెండాను శాశ్వతంగా దించేసారు. కానీ, దాని స్థానంలో రెండు వేర్వేరు జెండాలను ఎగురవేశారు – ఢిల్లీలో త్రివర్ణ పతాకం. కరాచీలో చంద్రవంక, నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండా. “నాది ఎంతటి శాపగ్రస్తమైన విధి అని నేను తరువాతి రోజుల్లో ఆలోచిస్తున్నట్లు నాకు గుర్తుంది. ‘ఆగస్టు 15న నేను భారతదేశ స్వాతంత్ర్యాన్ని జరుపుకోలేదు; అంతకు ముందు ఐదేళ్ళ పాటు, నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)లో స్వయంసేవక్ అయినప్పటి నుండి, దేశ స్వతంత్రం తప్ప మరేమీ అక్కర్లేదని కలలు కన్నాను. అలాంటిది దేశ స్వతంత్రాన్ని జరుపుకోలేకపోయాను అనే ఆ విచారకరమైన ఆలోచన నన్ను చాలా యేళ్ళ పాటు బాధపెట్టింది.

సింధ్ ప్రాంతం కాంగ్రెస్‌తో ఎందుకు విభేదించింది:
నేను ఆర్ఎస్ఎస్‌లో 1942 జూన్‌లో చేరాను. అప్పటి నుంచీ, సమైక్య భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలనే సంఘ్ లక్ష్యమే నా వ్యక్తిగత లక్ష్యం అయింది. నేను దాని జాతీయవాద సిద్ధాంతానికి ఆకర్షితుడయ్యాను, ఆ ఆదర్శానికి సంఘ్ ఇచ్చే ప్రాధాన్యత నాకు ప్రేరణ కలిగించింది.

నా జీవితాన్ని మార్చేసే కార్యక్రమం సింధ్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌లో జరిగింది. అక్కడ రెండు సంవత్సరాల కళాశాల విద్యాభ్యాసం తర్వాత నేను కరాచీకి తిరిగి వచ్చి RSS ప్రచారక్ అయ్యాను, సింధ్‌లోని పది జిల్లాల్లో పనిచేస్తున్న డెబ్బై ఐదు పూర్తికాల నిర్వాహకులు మరియు ప్రచారకులలో ఒకణ్ణి అయ్యాను. నిజానికి ఆ సమయంలో మొత్తం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సంఘ ప్రచారక్‌లు ఉన్నది సింధ్ ప్రావిన్స్‌లోనే. సింధ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు 1939లో మొదలయ్యాయి. అయినా చాలా తక్కువ సమయంలోనే ప్రావిన్స్‌లోని అన్ని పట్టణ కేంద్రాలలో ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రజాదరణ కలిగి ఉండేది, చాలా శక్తివంతంగా ఉండేది. ఆ రోజుల్లో సింధ్ ప్రోవిన్స్‌లో కరాచీ, హైదరాబాద్‌ సహా దాదాపు ప్రతీ నగరంలోనూ హిందువులే మెజారిటీగా ఉన్నారు. వాళ్ళు బాగా ధనవంతులు, విద్యావంతులు. న్యాయశాస్త్రం, వైద్యం, ప్రభుత్వ సర్వీసుల్లో ముందంజలో ఉండేవారు.

ఆర్ఎస్ఎస్‌లో నా బాధ్యతలు వేగంగా పెరిగాయి. జనవరి 1947లో నన్ను కరాచీ నగర కార్యదర్శిగా నియమించారు. అప్పట్లో ఒక్కసారిగా వేలాది మంది యువకులు సంఘం వైపు ఆకర్షితులయ్యారు. అలా మొదలైన సంఘ శాఖల పనితీరును పర్యవేక్షించడం, కరాచీ హిందూ సమాజంలోని ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతూ ఉండడం నేను చేయవలసిన ప్రధానమైన పనులు. నా కుటుంబం కరాచీలోనే నివసిస్తున్నా, నేను తోటి కార్యకర్తలతో కలిసి సంఘ్ ప్రధాన కార్యాలయంలోనే ఉండేవాణ్ణి.

ఒక విషయం చెబితే ఇవాళ్టి కాలంలో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ రోజుల్లో సింధ్‌లో ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎలాంటి వైర భావనలూ లేవు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందాలనే ఉద్దేశ్యంతోనే సంఘ్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుండేవని హిందువులు భావించే వారు. వాస్తవానికి, కాంగ్రెస్ శాంతియుత పోరాట పద్ధతి శక్తివంతమైన బ్రిటిష్ వారిని భారతదేశం విడిచి వెళ్ళమని ఒత్తిడి చేయలేదని లేదా దేశపు సమైక్యతను నిర్ధారించలేదనీ మా సీనియర్లు నాలాంటి యువ స్వయంసేవకులకు వివరించేవారు. ఆ విషయాన్ని నేను నమ్మాను. అయితే, వ్యూహానికి సంబంధించిన ఆ అభిప్రాయ భేదం వల్ల మాత్రం నేను ఏనాడూ కాంగ్రెస్‌ను శత్రువుగానో లేక ప్రత్యర్ధిగానో భావించలేదు. సింధ్‌ ప్రాంతంలోని హిందువులు అందరూ కాంగ్రెస్‌కు పూర్తిగా అండగా ఉండేవారు. అంతేకాదు, తమ పిల్లలను ఆర్ఎస్ఎస్‌లో చేరమని ప్రోత్సహించిన అనేక కాంగ్రెస్ కుటుంబాలు నాకు తెలుసు. దానికి అత్యుత్తమ ఉదాహరణ దివంగత కె ఆర్ మల్కానీ. ఆయన ఆరు దశాబ్దాలకు పైగా నా సన్నిహిత స్నేహితుడు, సహచరుడు. ఆయన అన్నయ్య, విస్తృత ప్రజాదరణ కలిగిన కాంగ్రెస్ నాయకుడు ప్రొఫెసర్ ఎన్ ఆర్ మల్కానీ తన తమ్ముడికి ‘ఆర్ఎస్ఎస్‌లో చేరండి. అది యువకులకు దేశభక్తినీ, క్రమశిక్షణనూ నేర్పే మంచి సంస్థ’ అని సలహా ఇచ్చారు.

సింధీ హిందువులకు కాంగ్రెస్‌కూ మధ్య బంధం ఇబ్బందికరంగా మారిందనడానికి తొలి సంకేతాలు విభజన కారుమబ్బులు దేశాన్ని కమ్ముకుంటున్నప్పుడు బైటపడ్డాయి. కాంగ్రెస్ నాయకులు మాటలు మారుస్తూ వచ్చారు. తొలుత వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ విభజనకు అంగీకరించబోమని వాగ్దానం చేసారు. కాలం గడిచే కొద్దీ వారి మాటా మారింది. సింధ్ ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌లో భాగం కాబోదని హామీ ఇచ్చారు. ఆ మాటా వారు నిలబెట్టుకోలేదు. కొన్నాళ్ళకు, విభజన తర్వాత పాకిస్తాన్‌లో కూడా హిందువులు క్షేమంగా సురక్షితంగా ఉంటారని నమ్మబలికారు. ఆ ఆశలకు గాంధీజీ మాటలు ఊపిర్లు పోసాయి. దేశ విభజన తర్వాత పశ్చిమ పంజాబ్, సింధ్, బలోచిస్తాన్, నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్‌ ప్రాంతాలలోని హిందువులు, సిఖ్ఖులూ తమ తమ ఇళ్ళను విడిచిపెట్టి భారతదేశానికి రాకూడదని చెప్పారు. అలాగే తూర్పు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాలలోని ముస్లిములు పాకిస్తాన్‌కు వలస వెళ్ళకూడదని చెప్పారు. కానీ దురదృష్టం. దేశ విభజన కోసం ఇచ్చిన పిలుపు సృష్టించిన విద్వేషం, హింసాకాండలను మహాత్మా గాంధీ ఇచ్చిన హామీలు నియంత్రించలేకపోయాయి.

బ్రిటిష్ వారు భారత్ వదిలిపెట్టి వెళ్ళే రోజు దగ్గర పడేకొద్దీ హిందువులు తమను కాంగ్రెస్ మోసం చేసిందని గ్రహించారు, ఎంతగానో భయపడిపోయారు. ఇక వారికి తమ ఆశల కోసం ఊతంగా నిలబడగల సంస్థ ఒక్కటే కనిపించింది. అదే ఆర్ఎస్ఎస్. ఆ సంస్థ వ్యవస్థీకృత బలం వారికి ధైర్యాన్నిచ్చింది. దేశ విభజన తర్వాత కూడా హిందువులు తమ సొంత ప్రొవిన్స్‌లో సుర్షితంగా నివసించవచ్చుననే ధీమా కలిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే… దేశ విభజనను ఆపగలిగేంత శక్తి ఆర్ఎస్ఎస్‌కు 1947లో లేదు.

కరాచీలో గురూజీ గోళ్వాల్కర్:
దేశ విభజనకు కేవలం పది రోజుల ముందు, అంటే ఆగస్టు 5న శ్రీ గురూజీ కరాచీలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. అదే కరాచీలో చిట్టచివరి బహిరంగ సభ, అప్పటివరకూ జరిగిన అన్ని సమావేశాల కంటె ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొన్న సభ. కరాచీ చరిత్రలోనే అతిపెద్దదైన హిందువుల సమీకరణ జరిగింది. ఆ రోజు సమావేశానికి ముందు సంఘసేవకులు నిర్వహించిన పథ సంచలనానికి నేను ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాను. సింధ్ ప్రాంతంలోని ఆర్ఎస్ఎస్ చరిత్రలో అతి పెద్ద పథ సంచలనం (మార్చ్‌ఫాస్ట్) అదే. దాదాపు 10వేల మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. వారు ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా, నల్ల టోపీ ధరించి ఒకే స్వరంతో మిలటరీ బ్యాండ్‌ను పోలిన దుస్తుల్లో దేశభక్తి గీతాలు ఆలపించారు. ఏర్పడబోయే పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా ఉండబోతోందో చూస్తామన్న పాక్షిక ధిక్కార ధోరణి, సింధ్ ప్రాంతంలోని హిందూ జనాభాకు ‘మీకు మేమున్నాము’ అనే హామీ ఇచ్చినట్లుగా ఆ ర్యాలీ సాగింది. ఆ ర్యాలీ సభాస్థలానికి చేరుకునేటప్పటికి లక్ష మందికి పైగా అక్కడ చేరారు. వారందరి మనసుల్లో ఒకే ఒక భావన, గురూజీని పలకరించాలి అన్నదే ఆ భావన. ఆనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాధు వాస్వానీ మాట్లాడుతూ కష్ట కాలంలో తమకు అండగా నిలిచిన ఆర్ఎస్ఎస్‌కు సింధీ ప్రాంతపు హిందూ సమాజం ఎప్పటికీ ‌ఋణపడిపోయి ఉంటుందంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

సింధ్‌లో హిందువుల ఆఖరి మహాసభలో గురూజీ ప్రసంగం:
తన ప్రసంగంలో గురూజీ ఇలా చెప్పారు. ‘‘మన మాతృభూమి మీద పెద్ద భారం పడింది. భారతదేశపు విభజన అనేది మహా పాపం. దానికి కారణమైన వారిని రాబోయే తరాలు ఎవ్వరూ క్షమించరు. విభజన అనేది అత్యంత అసహజమైన చర్య. బ్రిటిష్ వారి విభజించి పాలించే విధానం ముగిసింది. ముస్లింలీగ్ భయపెట్టడం ద్వారా, హింసకు పాల్పడడం ద్వారా పాకిస్తాన్‌ సాధించుకుంది. ముస్లింలీగ్‌కు కాంగ్రెస్ నాయకత్వం లొంగిపోయింది. ముస్లిములు ఇస్లాంను అనుసరిస్తారనే ఒకే ఒక కారణం చేత వారిది ప్రత్యేక దేశం అనే తప్పుడు భావనలోకి తప్పుదోవ పట్టించబడ్డారు. నిజానికి హిందువుల లాగే వాళ్ళు కూడా ఒకే జాతికి చెందిన వారు అని తెలుసుకోవాలి. వారి పూర్వీకులు హిందువులే. వారి సంస్కృతీ నాగరికతా భారతీయమైనవే తప్ప అరబిక్ కాదు. దురదృష్టవశాత్తు, ఇస్లాం పుట్టుకకు ముందుదేదీ వారిది కాదని వారు నమ్మేలా చేసారు. పవిత్రమైన సింధు నది ప్రవహించే సింధ్ ప్రాంతాన్ని భారతదేశం నుంచి విభజించివేస్తారన్నది ఊహించడానికే శక్యం కాని విషయం. ఏది ఏమైనా, ప్రతీ కష్టమూ మన స్ఫూర్తికి ఒక పరీక్ష. హిందువులు తమను తాము రక్షించుకోవాలి. అయితే ఆత్మ రక్షణకు శక్తి కావాలి. ఆ శక్తి ఐకమత్యం నుంచి వస్తుంది. సింధ్ ప్రాంతంలోని హిందువుల రక్షణ కోసం మన స్వయంసేవకులు తాము చేయగలిగినంత పని చేస్తారు. వారు తమ ప్రాణాలు త్యజించడానికి సైతం ముందు వరుసలో ఉంటారు. తమ సౌఖ్యం, రక్షణ గురించి ఆలోచించడంలో స్వయంసేవకులు చిట్టచివర ఉంటారు. ఈ దురదృష్టాన్ని అధిగమించే శక్తి ఇవ్వాలని మహాశక్తివంతుడైన ఆ భగవంతుణ్ణి వేడుకుందాం.’’

పిచ్చెక్కించే అనిశ్చితి, ఉద్రిక్త పరిస్థితుల మధ్య భయం భయంగా గడుపుతున్న సింధ్ ప్రాంత హిందువుల్లో శ్రీ గురూజీ మాటలు ధైర్యాన్ని నింపాయి.

విభజన – సింధ్ ప్రాంత హిందువులకు రెండంచుల విషాదం:
దేశ విభజన జరిగే వరకూ సింధ్ ప్రాంతం సాధారణంగా శాంతియుతంగా ఉన్న ప్రదేశమే. అయితే 1947 ఉత్తరార్థంలో, పొరుగునే ఉన్న పంజాబ్‌లో అత్యంత భయంకరమైన మతహింస చెలరేగింది. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లతో పాటు తూర్పు ప్రాంతాల్లో కూడా మతహింస ప్రజ్వరిల్లింది. భయంకరమైన ఊచకోతల వార్తలు, పంజాబ్ నుంచి తూర్పుకు హిందువుల సామూహిక వలసలు, భారత్‌కు వెళ్ళే రైళ్ళలో ప్రయాణికులు శవాలుగా మారిన తీరు… ఇవన్నీ సింధ్ ప్రాంతంలో కూడా భయాందోళనలను రేకెత్తించాయి. విభజన తేదీని ఖరారు చేయడానికి కొన్ని నెలల ముందు నుంచే ధనిక కుటుంబాలు వలస వెళ్ళడం మొదలైంది. జులై, ఆగస్టు నెలలు ఎంతో ఉద్రిక్తంగా గడిచాయి. అయితే సెప్టెంబర్ నెలలో మాత్రం వలసలు వెల్లువెత్తాయి. ఆ సమయానికి ఉత్తర ప్రదేశ్, బిహార్ తదితర భారతదేశపు ప్రాంతాల నుంచి కరాచీకి వచ్చిన ముస్లిం ముహాజిర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లోని మేమంతా, సింధ్ ప్రాంత ప్రజలు తమ మాతృభూమిని వదిలిపెట్టి వెళ్ళకుండా ఆపడానికి నిరంతరాయంగా కష్టపడ్డాం. మా ప్రయత్నాలు కొంతవరకూ ఫలించాయి. అయితే కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్‌లోని మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలు రక్తపాతానికే దారి తీసాయి. అవి హిందువులకు అత్యంత భయంకరమైన సందేశాన్ని ఇచ్చాయి. ‘సింధ్‌ను వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఏమాత్రం ఆలస్యం చేయవద్దు’. సెప్టెంబర్ తొలినాళ్ళలో ఒకరోజు నేను నా మోటార్ సైకిల్ మీద కరాచీ ప్రధాన రైల్వేస్టేషన్ దగ్గర ఒక రహదారి మీద ప్రయాణిస్తున్నాను. ఆ సమయంలో నేను ఒక వ్యక్తి శవాన్ని చూసాను. అతన్ని పొడిచి చంపేసారు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి మరో శవం కనిపించింది. ఆ తర్వాత ఇంకొకటి. అది అత్యంత అసాధారణమైన దృశ్యం. రహదారుల మీద శవాలు పడి ఉండడాన్ని నేను చూడడం అదే మొదటిసారి. ఆ సంఘటన నన్ను అమితంగా కలచివేసింది.

ఆ తర్వాత, అంటే డిసెంబర్ 1947లో నాకు తెలిసింది ఏంటంటే.. నేను కరాచీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ ప్రాంతంలోని హిందువులను లక్ష్యంగా చేసుకుని మతహింస ప్రజ్వరిల్లింది. అది కరాచీలో కూడా హిందువులను భయాందోళనలకు గురి చేసింది. హిందువుల ఇళ్ళు, దుకాణాలకు రాత్రి పూట గుర్తులు పెట్టుకునేవారు. ఉదయం అల్లరి మూకలు వచ్చి ఆ ఇళ్ళు దుకాణాలను లూటీ చేసేవి, వాటిని బలవంతంగా ఆక్రమించేవారు. ఆ దుశ్చర్యలను ప్రభుత్వం ఉపేక్షించింది. 1948 జనవరి 6 సింధ్ ప్రాంత చరిత్రలో అత్యంత భయంకరమైన దినంగా మిగిలిపోయింది. ఆ రోజు కరాచీలో జరిగిన హింసను వర్ణించడానికి మాటలు లేవు. ఒక మతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో దాడులు జరిగాయి. ఆర్యపథ్ సింధీ సభ దగ్గర ఒక భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఒక గుడి, ఒక బడి ఉన్నాయి. బైటి నుంచి కరాచీ వచ్చే సింధీలు సాధారణంగా అక్కడ రాత్రి బస చేసేవారు. అక్కడి నుంచీ మరునాడు బొంబాయికి ఓడ ఎక్కేవారు. ఒకానొక రాత్రి ఆ సభ మీద దాడి చేసారు. సుమారు మూడువందల మంది హిందువులు, సిఖ్ఖులను ఊచకోత కోసారు. దేశ విభజన సమయంలో జరిగిన హింసాకాండలో సింధ్ ప్రాంతంలో హత్య చేయబడిన హిందువుల సంఖ్యను నమోదు చేయలేదు. కానీ కొన్ని వేలమందిని ఊచకోత కోసారని మాత్రం తెలుసు.

ఆ తర్వాత, సాధారణంగా శాంతియుతంగా, ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడే హిందువులు ఇకపై సింధ్‌లో తాము జీవించడానికి ఇంక ఎంతమాత్రం అవకశం లేదని పూర్తిగా అర్ధం చేసుకున్నారు. మూడంటే మూడే నెలల వ్యవధిలో సింధీ హిందూ జనాభాలో 90శాతం కంటె ఎక్కువ మంది ప్రజలు, అంటే సుమారుగా 12.5 లక్షల మంది హిందువులు తమ పురిటి గడ్డను వదిలిపెట్టేసారు. చరిత్ర తాలూకు క్రూర హస్తం వారిని అకస్మాత్తుగా తమ రక్షణ స్థావరం లాంటి సింధ్ ప్రాంతం నుంచి చీల్చివేసింది. వేల యేళ్ళుగా తమ నివాస స్థానమైన సింధ్ వారికి పరాయి భూమి అయిపోయింది. భారతీయ నాగరికతకు ఊయల అయిన సింధ్, భారతదేశానికి కానిది అయిపోయింది. హిందువులు ముస్లిములు అన్నదమ్ముల్లా కలిసి బతికిన నేల… వారిద్దరూ కలసి తమకుంటూ ఓ ప్రత్యేకమైన సంస్కృతిని అభివృద్ధి చేసుకున్న భూమి… స్థానిక హిందూ ముస్లిం సాధుసంతులు, సామాన్య హిందూ ముస్లింలూ కలసి ద్రోహులైన ముస్లిం పాలకులను అడ్డుకున్న గడ్డ… ఇక వారిది కాకుండా పోయింది. ఉన్నట్టుండి, మా పూర్వీకుల స్వస్థలం మాకు పరాయి దేశంలో భాగమైపోయింది.

సింధ్ ప్రాంతం నుంచి భారత్‌కు వలస పోయిన వారిలో అత్యధికులు బొంబాయి శివార్లలో స్థిరపడ్డారు. వారు తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలన్న దృఢ సంకల్పాన్ని తప్ప తమతో మరేమీ తెచ్చుకోలేదు. భారతదేశపు జాతి నిర్మాణానికి వారు చేసిన సేవ గొప్పది. దేశ విభజన అనేది సింధీ హిందువులకు రెండు అంచుల విషాదంగా నిలిచిపోయింది. వారి బాధాతప్త అనుభవాలను నా భార్య వదిన అయిన లతా జగ్తియానీ ‘సింధీ రిఫ్లెక్షన్స్’ అనే తన రచనలో నమోదు చేసారు. అది హృదయాలను కదిలించివేసే, అదే సమయంలో అమితమైన స్ఫూర్తిని కలుగజేసే కథ. భారతదేశానికి అమిత భక్తిశ్రద్ధలతో సేవలు చేసిన హిందూ శరణార్థుల గాధ ఆ రచన.

********************************

ముస్లిం, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని వందల యేళ్ళ పాటు పీల్చి పిప్పి చేసారు. అయినా వారు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. తెల్లదొరలు దేశాన్ని విడిచిపెట్టక తప్పని పరిస్థితి తలెత్తినప్పుడు వారు ఈ దేశాన్ని రావణ కాష్టంలా మార్చాలని కుట్ర పన్నారు. ముస్లిములకు ప్రత్యేక దేశం పేరుతో భారతదేశాన్ని ముక్కలు చేసారు. అది కూడా అత్యంత దారుణంగా, ఎలాంటి ప్రణాళికా లేకుండా, భారతదేశం గురించి ఏమాత్రం తెలియని ఒక మూర్ఖుడు మ్యాప్ మీద అడ్డదిడ్డంగా గీసిన గీతల ఆధారంగా దేశాన్ని విభజించేసారు. ఆ పాపం కారణంగా హిందూ సంస్కృతి తీవ్రమైన అఘాతానికి గురి అయింది. హిందూ దేశం నేటికీ పాకిస్తానీ దుర్మార్గుల దాడులకు గురి అవుతూనే ఉంది.