
ప్రాచీన భక్తిశాస్త్ర గ్రంథాల్లో ‘నారద భక్తిసూత్రం’ ఉత్కృష్టమైనది. ఇందులో నారదుడు భక్తి సాధన గురించి విస్తారంగా చెబుతాడు. ‘ఈశ్వరుడి పట్ల చూపించే పరమ ప్రేమే భక్తి. ఆయన స్తుతి ప్రత్యక్షంగా ఉన్నట్లే, పరోక్షంలోనూ ఉంటుంది. సిద్ధత్వం సాధించటం అంటే ప్రాపంచిక వికారాలకు తావులేని స్థితికి చేరడం. మనిషికి ఏ వస్తువు దక్కితే ఇక మరి దేనినీ కోరడో, దేనికోసం శోకించడో, ఎవరినీ ద్వేషించడో, ఇంకే వస్తువు దొరికినా అంతటి ఆనందం కలగదో, మరో దానికి పాకులాడడో… అదే భక్తి’ అంటాడు నారదుడు.
భక్తిని సాధించినవాడు లౌకిక విషయాలను పట్టించుకోడు. అతడి హృదయం ఈశ్వరుడికే అంకితం. కేవలం పూజాదులే భక్తి ప్రకటనకు మార్గం కాదు. అసలైన భక్తి అన్ని గుణాలకు అతీతమైనది. భక్తి అంతిమ లక్ష్యాన్ని అత్యంత స్పష్టంగా వివరించే క్రమంలో సూక్ష్మాంశాల ప్రస్తావననూ విడిచిపెట్టడు నారదుడు. గుణాలను అనుసరించి సత్వరజో తమో రూపాలుగా, వ్యక్తుల తీరును అనుసరించి ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి రూపాలుగా భక్తి ప్రకాశిస్తుందని ఆయన చెబుతాడు. అర్థాన్ని అర్థించేవాడు ఈశ్వరుణ్ని భోగసుఖాల కోసమే ప్రార్థిస్తాడు. జిజ్ఞాసువు జ్ఞానం కోసం ఆశ్రయిస్తే, ఆర్తుడు గజేంద్రుడిలాగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాడు. సత్వగుణం కలిగిన భక్తుడు ఏకాంతధ్యానం చేస్తాడు. దోమతెర చాటున నిద్రిస్తున్నా దైవధ్యానంలోనే రాత్రంతా గడుపుతాడు.
లౌకికుడికి అన్నవస్త్రాదుల పట్ల మోజుండదు. భక్తులలోని భేదాలనూ నారదుడు వివరిస్తాడు. రాజసిక భక్తుడి బాహ్య స్వరూపం తిలక ధారణ, రుద్రాక్ష మాలాది అలంకారాలలో ఆడంబరంగా ఉంటుంది. దేవాలయం అంటే అతడికి తన ఇంటి పూజగది మాత్రమే. దైవనామస్మరణతోనే పాపాలు పరిహారమై పోతాయని తామసిక భక్తుడి విశ్వాసం. పొందాలనుకునే వస్తువును ‘ఇష్టం’ అంటాం. ఈ ఇష్టప్రాప్తికి నారదుడు నిర్దేశించిన మార్గాలు భక్తి, కర్మ, జ్ఞాన, యోగాలు. వీటి మధ్య ఎక్కువ తక్కువల తారతమ్యం లేదు. దేశ, కాల, పాత్రలను అనుసరించి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఈ కర్మ, జ్ఞాన, యోగాలకన్నా భక్తే శ్రేష్ఠమని నారదుడు భావిస్తాడు.
సమస్త సాధనల అంతిమ ఫలితం భక్తి. ఇతర సాధనలలోలాగా ఇందులో అహంకారానికి తావుండదు. ఈశ్వరుడు కోరేది వినయం. భక్తి సాధకుడిలో ఈ భావం విప్పారుతుంది. ఆహార పదార్థాలను చూసినంత మాత్రాన ఆకలి తీరనట్లే భక్తిభావం లేని సాధనల వల్ల మోక్షం ప్రాప్తించదు. భక్తి సాధన వల్ల సాధకుడు పరమానందం అనుభవించగలడు. అందువల్ల మోక్షం పొందాలనుకునేవారికి భక్తే శరణ్యం. మహాత్ముల కృప, అవిరామ భగవదారాధన, సుఖదుఃఖాలు, లాభనష్టాల పట్ల నిరాపేక్ష, నిశ్చింత హృదయంతో చేసే ఈశ్వరుడి భజనలు స్వచ్ఛమైన భక్తిసాధనకు ముఖ్య ఉపాయాలు. భక్తిశాస్త్రాలను మననం చేసుకుంటూ కూడా భగవంతుడితో భక్తుడు అనుసంధానం కావచ్చునని నారదుడు ఉద్బోధిస్తాడు.





