
బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని ధర్మవరం భీమలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి తవ్వకాలు జరిపారు. సామాన్యశకం 8వ శతాబ్దానికి పూర్వం నాటి దేవాలయంగా భావిస్తున్న ధర్మవరం సమీపంలోని భీమలింగేశ్వరస్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం ఇప్పటికే 10 సార్లుకుపైగా తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో కూడా తవ్వకాలు జరిగాయి. ఆరేడు సంవత్సరాల క్రితం దేవాలయం లోపల శివలింగం ఉన్న ప్రాంతంలో కూడా తవ్వకాలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తవ్వ కాలు చేపట్టారు.
దేవాలయం ముందు భాగం లోని నాపరాళ్లను తొలగించి తవ్వకాలు చేసినట్లు భావిస్తున్నారు. బయట పడ్డ బండ రాళ్లను సమీపంలో పడవేశారు. అనంతరం మరలా నాపరాళ్ళు యదావిధిగా పరిచి సిమెంట్ పూత పూసారు. ఉదయం దేవాలయానికి వెళ్లిన భక్తులు తవ్వకాలు జరిగిన విషయాన్ని గమనించి దేవాదాయ శాఖ అధికారులకు తెలియజేశారు. అద్దంకి గ్రూపు దేవస్థానాల ఈవో శైలేంద్రకుమార్, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతి పురాతన దేవాలయం కావడంతో గుప్త నిధులు ఉన్నాయన్న ఆలోచనతో తరచూ తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు
పంచపాండవులు ధర్మవరం సమీపంలో 5 శివలింగాలను ప్రతిష్టించి దేవాలయాల నిర్మాణం చేపట్టారు. భీముడు ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో భీమ లింగేశ్వరస్వామి దేవాలయంగా పిలుస్తున్నారు. భీమలింగేశ్వరస్వామి దేవాలయంలో శివలింగం నేలపైన మూడు అడుగుల ఎత్తు ఉండగా, భూమి లోపల మరో అడుగులు ఉన్నట్లు భక్తులు చెబుతున్నారు




