
ఒక్కడే… హిందువుగా పేరు మార్చుకొని, ముద్రా రుణాలు ఇప్పిస్తానంటూ 500 మందిని బురిడీ కొట్టించాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ కి చెందిన షేక్ జానీ అనే ముస్లిం హరినాథ రావుగా పేరు మార్చుకున్నాడు. కొంత కాలం హైదరాబాద్ లో పలు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేశాడు. కోవిడ్ సమయంలో ఉద్యోగం పోవడంతో సోషల్ మీడియా ద్వారా ముద్ర రుణాల గురించి బాగా అవగాహన పెంచుకున్నాడు.
తర్వాత ఓ సిమ్ ను కొనుగోలు చేసి, పలు ప్రాంతాలు తిరిగేవాడు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ లనే టార్గెట్ చేస్తూ.. వారి దుకాణాలపై వుండే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసేవాడు. తాను ముద్ర రుణాల ఏజెంట్ నని, పరిచయం చేసుకొని, రుణాలు కావాలంటే తనను సంప్రదించాలని సూచించేవాడు. అంతేకాకుండా లక్ష రూపాయలకు 2 వేలు కమీషన్ కావాలని కూడా చెప్పేవాడు. అలాగే ఓ విశ్రాంత సైనిక ఉద్యోగికి బ్యాంకు రుణం ఇప్పిస్తానని గుర్తింపు కార్డులు కూడా తీసుకున్నాడు.
ఇలా ప్రతి రోజూ చాలా మందికి ఫోన్లు చేస్తూ… కమిషన్ డబ్బులు తన ఖాతాలో జమ చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఇలా దాదాపు నెలకు 3 లక్షల వరకూ సంపాదించేవాడు. ఈ డబ్బుతోనే రెండు ప్లాట్లు, బుల్లెట్ బండి, ఓ కారు కూడా కొనుగోలు చేశాడు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అయితే.. ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే షేక్ జానీని పోలీసులు అరెస్ట్ చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.





