News

భారత్‌ను దూరం చేసుకోవద్దు.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

289views

భారత్‌ లాంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని భారత సంతతికి చెందిన రిపబ్లికన్‌ నాయకురాలు నిక్కీ హేలీ పేర్కొన్నారు. భారత్‌ తమకు మంచి భాగస్వామి కాదంటూ, దానిపై సుంకాల భారాన్నీ గణనీయంగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిక్కీ హేలీ ఇరుదేశాల సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయకూడదు కానీ, చైనా చేయొచ్చా అని ఆమె ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారని ట్రంప్‌ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈసందర్భంగా చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ.. భారత్‌ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారు.

దక్షిణ కరోలినా మాజీ గవర్నర్‌ అయిన హేలీ.. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్నారు. 2024లో అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీ చేసిన ఆమె.. ఆ తర్వాత ట్రంప్‌నకు మద్దతు తెలిపారు.

ఇదిలాఉండగా.. నిన్న, మొన్నటివరకు భారత్‌ను తమ మిత్రదేశంగా పేర్కొన్న ట్రంప్‌, తాజాగా మాట మార్చేశారు. ఆ దేశం తమకు మంచి భాగస్వామి కాదని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నారనే కారణంతో 25శాతం సుంకంతో పాటు పెనాల్టీలు విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ టారిఫ్‌లను గణనీయంగా పెంచుతానంటూ హెచ్చరికలకు దిగారు. మాస్కో నుంచి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల వారు యుద్ధం చేయడానికి సహకరించినట్లవుతుందని, అందుకే తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో రష్యా భారత్‌కు మద్దతుగా నిలిచింది. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీలుగా వాణిజ్య, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే హక్కు సార్వభౌమ దేశాలకు ఉంటుందని స్పష్టం చేసింది.