
మాలేగావ్ 2008 పేలుళ్ల కేసుకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ కుట్ర ఎంత ఘోరంగా వుందో వెల్లడించారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారిపోయింది. ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్‌ను అరెస్టు చేయమని తనను ఆదేశించారని, అందుకు నిరాకరించడంతో తనను ఎంతగానో వేధించారని 2008 మాలేగావ్ పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లో భాగమైన ఒక మాజీ ముస్లిం పోలీసు అధికారి చెప్పుకొచ్చారు.
“కాషాయ ఉగ్రవాదం ఉందని నిర్ధారించడమే ఈ ఆదేశం వెనుక ఉద్దేశ్యం” అని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ మెహిబూబ్ ముజావర్ ఆరోపించారు. కోర్టు తీర్పు ఏటీఎస్ చేసిన “నకిలీ పనులను” తొలగించిందని ఆయన సోలాపూర్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా, ఏటీఎస్ ఈ కేసును మొదట దర్యాప్తు చేసినప్పటికీ, తరువాత దానిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. “ఈ తీర్పు నకిలీ అధికారి చేసిన నకిలీ దర్యాప్తును బహిర్గతం చేసింది” అని ముజావర్ ఒక సీనియర్ అధికారిని పేర్కొంటూ మండిపడ్డారు.
2008 సెప్టెంబర్ 29న మాలేగావ్‌లో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, 101 మంది గాయపడ్డారని, ఆ ఘటనను దర్యాప్తు చేసిన ఏటీఎస్ బృందంలో ఆయన కూడా ఉన్నారని, మోహన్ భగవత్‌ను “వెళ్లి పట్టుకోవాలని” తనను అడిగారని ముజావర్ వెల్లడించారు. “ఏటీఎస్ అప్పుడు ఏ దర్యాప్తు చేసిందో, ఎందుకు చేసిందో నేను చెప్పలేను….కానీ రామ్ కల్సంగ్రా, సందీప్ డాంగే, దిలీప్ పాటిదార్, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వంటి వ్యక్తుల గురించి నాకు కొన్ని రహస్య ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలన్నీ వారిని అనుసరించే విధంగా లేవు” అని ఆయన తెలిపారు. వాస్తవానికి, అవి “భయంకరమైనవి” కావడంతో పాటు తనకు వాస్తవికత తెలుసు కాబట్టి తాను వాటిని అమలు చేయలేదని ముజావర్ స్పష్టం చేశారు.
“మోహన్ భగవత్ లాంటి మహోన్నత వ్యక్తిని పట్టుకోవడం నా సామర్థ్యానికి మించినది. నేను ఆ ఆదేశాలను పాటించకపోవడంతో, నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. అది నా 40 సంవత్సరాల కెరీర్‌ను నాశనం చేసింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వాదనలకు మద్దతుగా తన వద్ద డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని ఆ మాజీ పోలీసు అధికారి చెప్పారు. “కాషాయ ఉగ్రవాదం లేదు. ప్రతిదీ నకిలీది” అని ఆయన ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.





