
ప్రకృతి పులకింపజేస్తుంది, మైమరపింపజేస్తుంది. రుతుగీతాలతో, వసంత సోయగాలతో కనులకూ, వీనులకూ విందును కలిగించి అలరిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు ‘అందమైన ప్రకృతి జనజీవనానికి వరం’. మన పాంచభౌతిక శరీరం ప్రకృతిలో భాగమే. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆయుర్వేదం, ఇతర భారతీయ శాస్త్రాలు అన్నీ ప్రకృతికి అపార ప్రాధాన్యమిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం ఇప్పటికీ ఉంది.
ప్రకృతిని కేవలం వనరుల సమాహారంగా కాక దైవిక శక్తిగా భావించేవారు పూర్వీకులు. అందుకే వేదాలలో ప్రకృతిని అనేక రూపాల్లో దేవతగా అభివర్ణించారు. అగ్ని, వాయువు, సూర్యుడు, వరుణుడు, భూదేవి- వీరందరూ మానవాళికి జీవనాధారమైన ప్రకృతి మూలమైన దేవతలే. చెట్లు, నీటివనరులు, ఖనిజాలు- ఇవన్నీ భూమాత ఒడిలోని సంపదలే. ప్రకృతి ద్వారానే పరమాత్మను దర్శించగలమని శివపురాణం చెబుతుంది. మార్కండేయ పురాణం శక్తిని ప్రకృతిగా పేర్కొంది. ఆయుర్వేదం ప్రకృతి ఆధారిత వైద్యం. త్రిదోష సిద్ధాంతాలైన వాత, పిత్త, కఫ- ప్రకృతి సమతుల్యతపై ఆధారపడి ఉంటాయి. భారతీయ రుషులు ప్రకృతిని శరీరంలాగా, భూమిని తల్లిలాగా, గాలి- నీటిని ప్రాణాలతో సమానంగా భావించారు. ప్రకృతిని నిశితంగా పరిశీలించడం ద్వారానే విజ్ఞానశాస్త్ర అభివృద్ధిని సాధించగలిగాం. ప్రకృతిని కాపాడటం అంటే మన ధర్మాన్ని నిలబెట్టుకోవడమే.
కృతయుగంలో ధర్మపుర గ్రామంలో సుమతి అనే పేద రైతు ఉండేవాడు. అతడు దైవభక్తి, ప్రకృతిపట్ల అమితమైన ప్రేమ కలవాడు. ప్రతి చెట్టును, మొక్కను తన కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా దివ్యమైన వెలుగుతో వనదేవత ప్రత్యక్షమైంది. ‘నువ్వు ప్రకృతి పట్ల చూపిస్తున్న నిస్వార్థ ప్రేమ నన్ను ఎంతగానో సంతోషపరిచింది’ అని రైతుతో అంది. సుమతి ఆనందంతో, ‘నా తోటి రైతులు కూడా సుఖంగా ఉండాలి. భూమి తల్లికి ఎలాంటి కష్టం రాకూడదు’ అని వేడుకున్నాడు. వనదేవత రైతు నిస్వార్థానికి ముగ్ధురాలైంది. ‘నీ కోరిక నెరవేరుతుంది. ఈ సంవత్సరం నుంచి నీ పొలంలోనే కాదు, ఈ ప్రాంతమంతటా పంటలు సమృద్ధిగా పండుతాయి. అయితే, ఒక షరతు. ప్రతి ఒక్కరూ భూమిని, ప్రకృతిని తమ తల్లిలా భావించాలి. అప్పుడే ఈ సంపద శాశ్వతంగా ఉంటుంది’ అని చెప్పింది. వనదేవత వరంతో గ్రామం సుభిక్షంగా మారింది. గ్రామదేవతల పూజలన్నీ ప్రకృతి ఒడిలోనే జరగడం కనిపించే దైవాన్ని ఆరాధించడంలో భాగమే.
వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ, మన పురాణాలు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని బోధించాయి. ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, మనకు అది అంతకు మించిన ప్రతిఫలాన్ని ఇస్తుంది.





