
( జులై 27 – జననీ జనకుల దినోత్సవం )
పెద్దల పెంపకాన్ని బట్టే పిల్లల నడవడిక ఉంటుందన్నది నానుడి. ధర్మబద్ధమైన తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచి ఉత్తమ సంతానంగా కీర్తి గడించటం కంటే గొప్ప సంగతి ఇంకేముంటుంది?! పురాణేతిహాసాల్లో అలాంటి ఉదాహరణలనేకం. అందుకు విరుద్ధంగా పెద్దల మాటను పెడచెవిన పెట్టి దారి తప్పిన ఉదంతాలూ ఉన్నాయి. కొందరిని చూసి ఎలా ఉండాలో, ఇంకొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం.
వాక్కు-అర్థం పరస్పరం మిళితమైపోయినట్లుగా జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు అనుసంధానమై ఉంటారు. అన్యోన్య దాంపత్యానికి ప్రతీక ఆ ఆదిదంపతులు. భౌతికంగా భిన్న ధ్రువాల్లా కనిపించినా ఆంతరంగికంగా ఏకతత్వంతో అలరారే అద్వైతస్వరూపులు శివ పార్వతులు. మాతా పితరులు ఎలా ఉండాలో లోకానికి తెలియజేసిన ఆదర్శ దంపతులు. తాము ధర్మాన్ని అనుసరించి, సంతానాన్ని అదేమార్గంలో నడిపించారు. ఒకరిని విఘ్ననాయకునిగా మరొకరిని సేనానాయకునిగా తీర్చిదిద్దిన మార్గదర్శకులు ఉమామహేశ్వరులు.
సంసార సౌధానికి- తల్లి, తండ్రి, పిల్లలు, ధర్మం.. ఈ నాలుగూ మూల స్తంభాలని పేర్కొంది మహాభారతంలోని శకుంతలోపాఖ్యానం. వీటిలో ఏ ఒక్కటి గాడి తప్పినా, కుంటుపడినా.. ఇక కుటుంబ సౌధ అస్తిత్వం ప్రశ్నార్థకమే అవుతుంది. తాము ధర్మమార్గంలో నడుస్తూ, సంతానాన్ని కూడా అలాగే నడిపించినవారు కొందరు. తాము అనుసరించినా, పిల్లల్ని నడపలేకపోయినవారు మరికొందరు. తామూ, తమవారూ కూడా ధర్మమార్గంలో నడవనివారు ఇంకొందరు. తాము ధర్మాన్ని తప్పడమే గాక ఆ మార్గంలో నడుస్తున్న పిల్లల్ని అడ్డగించినవారు మరికొందరు.
స్వార్థంతోనో వ్యామోహంతోనో బాధ్యతారాహిత్యంతోనో తాము అధర్మ మార్గంలో నడవటమే గాక తమ సంతానాన్నీ ఆ మార్గంలోనే నడిపి వంశ నాశనం చేసుకున్న తండ్రులు రావణాసుర, ధృతరాష్ట్రులు. వరగర్వంతో ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, పర స్త్రీల పట్ల వ్యామోహంతో తాను పతనమయ్యాడు. తన పుత్రుల పతనానికీ కారణమయ్యాడు రావణాసురుడు.
ఆ వంశాల పరంపరలో..
సూర్యవంశ, చంద్రవంశ రాజులు తాము ధర్మమార్గాన్ని అనుసరించారు. తమ సంతానాన్ని కూడా ఆ మార్గంలో నడిపించారు. ఆదర్శ తల్లిదండ్రులై వంశాలను తరింపజేశారు. ఉదాహరణకు దశరథ మహరాజు తదితరులది ధర్మబద్ధమైన జీవన విధానం. తాము సన్మార్గంలో నడుస్తూ తమ సంతానాన్ని కూడా అలా నడిపించినవారు కౌసల్యా దశరథులు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ప్రాణసమానుడైన రాముణ్ణి అరణ్యాలకు పంపాల్సిన అనివార్య పరిస్థితి. అలాంటి సంకట స్థితిలో దశరథుడు ప్రాణాల్ని సైతం విడిచాడే కానీ ధర్మాన్ని అతిక్రమించలేదు. తండ్రి మాటను ఆచరించేందుకు రాముడు వనవాసానికి బయల్దేరాడు. భర్తని అనుసరించిన సుమిత్ర తనలాగే పుత్రుడు కూడా ధర్మమార్గంలో నడవాలనుకుంది. అందుకే రాముడికి సేవకుడిగా లక్ష్మణుని పంపింది.
శిశుపాలుని తల్లిదండ్రులు ఆదర్శమూర్తులైనా అతడు మాత్రం దుర్మార్గుడు, దైవవిరోధిగా కొనసాగి తల్లిదండ్రులకు వేదన మిగిల్చాడు. కంసుడు కూడా మాతాపితలు చూపిన ధర్మమార్గాన్ని వీడి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. తనకు అర్హత లేని పదవిని అధిష్టించి తనది కాని రాజ్యాన్ని అనుభవించి కూడా అర్హులైన తమ్ముడి బిడ్డల పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు ధృతరాష్ట్రుడు.
భారతంలో ధర్మరాజు తర్వాత అంతగా ధర్మబోధ విన్నది ధృతరాష్ట్రుడే. కృష్ణుడు, వ్యాసుడు, విదురుడు, సనక సనందనాదుల ద్వారా ధార్మికతను పొందాడతడు. కానీ ఆ ధర్మసూత్రాలేవీ ఆచరణలో పెట్టలేదు. స్వార్థం, లోభం, పదవీకాంక్షలతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న దుర్యోధనాదుల్ని నిలువరించలేదు. అధర్మాన్ని ప్రోత్సహించి వంశనాశనం చేసుకున్న పుత్ర వ్యామోహి ధృతరాష్ట్రుడు. హితవు చెప్పేందుకు ప్రయత్నించి, విఫలమై అసహాయురాలిగా నిలిచిన తల్లి గాంధారి.
అధర్ముడైన హిరణ్యకశిపుడు సన్మార్గంలో నడుస్తున్న పుత్రుణ్ణి అడ్డగించాడు. విష్ణుమూర్తిని ఆరాధిస్తున్న ప్రహ్లాదుణ్ణి హతమార్చాలని ప్రయత్నించి చావును కొనితెచ్చుకున్నాడు. తన దుర్మార్గాలకు సహకరించలేదని సంతానాన్నే శాపగ్రస్తుల్ని చేసిన దుష్ట జనని నాగుల తల్లి కద్రువ.
ఆ తల్లులే ఆదర్శం
అయోధ్యలోనైనా అరణ్యంలోనైనా భర్త సాన్నిధ్యమే స్వర్గ సమానంగా భావించింది సీతమ్మ. లోకకంటకుడైన రావణసంహారంలో తన వంతు పాత్రను పోషించింది. అలా ఆమెని తీర్చిదిద్దిన జననీజనకులు సునయనా జనకులు. కుంతీదేవి జీవితంలోని ప్రతి అడుగు కష్టమయంగానే సాగినప్పటికీ ఎన్నడూ ధర్మం తప్పలేదు, బిడ్డల్ని పెడదారి పట్టన్విలేదు. అందుకే ఆమె మహాత్మురాలు. తన సంతానమైన నరకాసురుడు ధర్మం తప్పినప్పుడు అతణ్ణి సంహరించి లోకరక్షణ గావించిన తల్లి భూదేవి.
మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు దైవం కంటే ఉన్నత స్థానాన్ని అందించింది మన సంప్రదాయం. కుటుంబ సౌఖ్యం కోసం, లోక కల్యాణార్థం తమ బిడ్డల్ని అద్భుతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులందరూ పుణ్యమూర్తులే.





