ArticlesNews

స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం జాషువా కవిత్వం

382views

( జూలై 24 – గుర్రం జాషువా వర్ధంతి )

తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వ్యక్తి…కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వ్యక్తి మన మహాకవి గుర్రం జాషువా. నవయుగ చక్రవర్తి, కవి కోకిల, కవి విశారద, మధుర శ్రీనాథ వంటి బిరుదులతో అలరారిన జాషువా అచ్చమైన జాతీయ భావాలు కలిగిన గొప్ప దేశభక్తుడు. ఆయన అచ్చమైన జాతీయవాదిగా ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అందిపుచ్చుకొని విశ్వనరుడుగా ఎదిగాడు. సమాజపు అసమానతలు తొలగి మానవులంతా సమానం అనే భావనను పాదుకొల్పడం , విశ్వ మానవ కల్యాణం..ఇవే ఆయన సాహిత్య తాత్విక భూమికలు. ప్రాచీన పద్యపు ఇంపును, తెలుగు భాష ఆధునిక సొంపును అక్షరక్షరంలో ఒంటబట్టించుకున్న కవి గుర్రం జాషువా.

ఆధునిక తెలుగు కవులలో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడి అయిన భావకవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు. పదలాలిత్యంతో పాఠకుందరినీ ఆకట్టుకున్న కళా ప్రపూర్ణులు వారు. తన రచనా శక్తితో సామాజిక రుగ్మతలపై పోరాడి సమాజంలో చైతన్యాన్ని రగిలించి, విశ్వజననీయమైన రచనలతో తన సాహిత్యం ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా. అసమ సమాజం బాకులు గుమ్మినప్పుడు, అంటరానితనం విషాజ్ఞులు చిమ్మినప్పుడు, దుర్భర దారిద్ర్యం వెన్నాడినప్పుడు, దురంత వేదన గుండెల్లో తుకతుక ఉడికినప్పుడు జాషువా గుర్తుకొస్తాడన్న సినారే మాటలు అక్షర సత్యాలు. అంతమాత్రాన జాషువా ఈ సంస్కృతిని, ఈ దేశాన్ని ఏనాడు తులనాడ లేదు. ఈ దేశంలో ఉన్న వివక్షను తన రాతల ద్వారా ఏకిపారేశాడే కానీ మన దేశం పై, మన సంస్కృతి పై, మన ధర్మం పై ద్వేషాన్ని నింపలేదు.

జాషువా తన ఆవేదనను తన ఆక్రోశాన్ని వెల్లడించాడే తప్ప ఈ దేశ సంస్కృతి మీద అక్కసు వెళ్ళగక్కలేదు. తన రచనల ద్వారా సమాజంలో అశాంతిని నింపలేదు. వేర్పాటువాదాన్ని, విభజన సిద్ధాంతాన్ని ప్రోత్సహించలేదు. పైపైచ్చు ద్విగుణీకృతమైన జాతీయ భావజాలాన్ని తన గుండెల నిండా నింపుకొని తన మొదటి కావ్యంలోనే మొట్టమొదటి ఖండికలో ‘మాతలకు మాత మా భరతమాత…సకల సంపత్సమేత’ అని దేశమాతను కీర్తించిన గొప్ప దేశభక్తుడు జాషువా. నేడు ఈ దేశాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూ భారత్‌ను మాత అనడం ఏమిటంటూ హేళన చేస్తున్న ముష్కర మూకలకు జాషువా పద్యమే సమాధానం చెబుతుంది. విభజనవాదుల నోళ్లకు తాళం వేసే విధంగా అమ్మ భారతిని అద్భుతంగా, మరింకెవరు గుర్తించలేనంత గొప్పగా భరతమాతను పేర్కొనడం జాషువా దేశభక్తికి నిదర్శనం.

జాషువా కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఆలోచనాత్మకమైనదే. అది ఒక్కొక్కసారి అగ్నిని రగిలిస్తే మరొక్కసారి కరుణాంబుధులను కురిపిస్తుంది. ఒకసారి సమాజంలోని అసమానతపై ఎక్కు పెట్టిన విల్లు అవుతుంది మరొకసారి దేశమాతను కీర్తించే మంత్రమై సాగుతుంది. వారి కవిత్వం మానవజాతి శ్రేయస్సు కోసం వాడిన ఇంద్రుని వజ్రాయుధం. జాషువా కవిత్వం విశ్వ కల్యాణమే పరమావధిగా సాగి జాతీయ భావజాల చైతన్య స్రవంతిగా మారి నిరంతరం ఈనాటికీ ప్రతి దేశభక్తుని గుండెను తడుతూనే ఉంది. తన కాలపు కుల, వర్గ వాస్తవికతనూ, అసమానతలనూ, అంధ విశ్వాసాలనూ, పేదరికాన్నీ, దోపిడీని, స్త్రీల పీడననీ శక్తివంతమైన కవితగా జాషువా మలిచాడు. ప్రకృతి మీదా, పిల్లల మీదా, ప్రేమ, కరుణల వంటి విలువల మీదా, కళల మీదా, మానవ అశాశ్వతం మీదా, మరణం మీదా…ఇలా విభిన్న అంశాల మీద వైవిధ్యపూరితమైన కవిత్వం రాశాడు.

ఆవు అనే ఖండికలో జాషువా, ‘నిన్ను వధించెడు మనుష్య వ్యాఘ్రముల్ క్రూరముల్’ అంటూ ఆవును వధించే వారిని క్రూర జంతువులైన పులులతో పోల్చాడు. మన సంస్కృతిలో భాగమైన ఆవుపైన ఆయనకు ఎంత భక్తి ఉందో మనం ఊహించుకోవచ్చు. జాషువా ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైన కవి కాదు. ఒక జాతీయ కవీశ్వరుడు. దేశ ప్రజల బాధలే తన బాధలుగా భావించి సర్వ మానవ సౌభ్రాతృత్వం మానవత్వపు పరిమళాలు ఈ నేల పై పరిఢవిల్లాలని కోరుకున్నాడు.

జాషువా కవిత్వం అంతా వేదన చెందిన జీవుని ఆవేదననే..అంతరంగ ఆవిష్కరణనే…సమ సమాజ నిర్మాణానికి ముఖ్యంగా బడుగువర్గాల అభ్యున్నతికి, పేదరిక నిర్మూలనకు తన అక్షర ఆయుధంతో పోరాడి, అలసి 1971 జూలై 24న తన 75వ ఏట పరమపదించారు. వారి ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలను నెరవేర్చుతూ ప్రతి ఒక్కరూ విశ్వనరుడిగా ఎదగాలి. అదే ఈ అచ్ఛమైన, స్వచ్ఛమైన జాతీయ కవికి మనం అందించే నిజమైన నివాళి.