News

గిరిజన గ్రామ ప్రజలకు కోసం గిరి బజార్

263views

పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన, మారుమూల గ్రామ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సరుకులను అందించేందుకు గిరి బజార్ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ వాహనాల ద్వారా నాణ్యమైన సరుకులను విక్రయించడంతో పాటు ఖాళీ సమయాల్లో డిజిటల్ స్క్రీన్ల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్య పరచనున్నట్లు తెలిపారు. సి.యస్.ఆర్ నిధులతో రూపొందించిన గిరి చైతన్య వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని గిరి బజార్లను ప్రారంభించి, పచ్చ జెండా ఊపి గిరి చైతన్య వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు రెండు గిరి బజార్ వాహనాలను ప్రారంభించుకోవడం జరిగిందని వీటిని పార్వతీపురం, సీతంపేట ఐటీడిఏలకు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఈ వాహనాలను పార్వతీపురం జిల్లా మహిళా సమాఖ్య నిర్వహిస్తారన్నారు. ఇవి జిల్లాలో నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారం, ముఖ్యంగా గిరిజన సంతలు, మారుమూల గ్రామాలను కలుపుకుంటూ సంచరిస్తాయని తెలిపారు. ఈ వాహనాలలో ప్రముఖ కంపెనీల వస్తువులు, నిత్యావసర సరుకులు, వస్త్రాలు, ఫ్యాన్సీ సామాన్లు మొదలైనవి అందుబాటు ధరలలో లభిస్తాయని పేర్కొన్నారు.

గిరిజన, మారుమూల గ్రామాల్లోని ప్రజలు నాసిరకం వస్తువుల కొనుగోలు చేసి మోసపోకుండా, నాణ్యమైన వస్తువులను అందించాలనే ఉద్దేశ్యంతో వీటిని ప్రారంభించినట్లు చెప్పారు. కావున అందరూ వీటిని వినియోగించుకోవాలని, ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంత ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ బజార్ల నిర్వహణకు ముందుకు వచ్చిన జిల్లా సమాఖ్యకు కలెక్టర్ అభినందలు తెలిపారు. ముందుగా గిరి బజార్ వాహనాల్లోని వస్తువులను ఆసక్తితో తిలకించిన ఆయన మొదటి కోనుగోలు చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.