News

అల్లూరి సీతారామరాజు జిల్లాలో బోల్‌ భం కావడి యాత్ర

233views

పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఒడిశా రాష్ట్ర భక్తులు బోల్‌ భం కావడి యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం జులై,ఆగస్టు నెలల్లో శివ భక్తులు ఐదు రోజుల పాటు దీక్ష చేపట్టి, కావడి యాత్రలో పాల్గొంటారు. దీక్షలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదబయలు సమీపంలోని ఆంధ్ర,ఒడిశా సరిహద్దులో గల మత్స్యగెడ్డ తీరానికి సూర్యోదయానికి ముందే కాషాయ రంగు దుస్తులు ధరించిన భక్తులు చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం మత్స్యగెడ్డ నుంచి జలాన్ని కలశాలలోకి సేకరించారు. వాటిని కావడిలో పెట్టి భుజాన వేసుకుని శివ నామస్మరణతో పెదబయలుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడువ శివాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా బోల్‌ భం నామస్మరణతో ఈ ప్రాంతం మార్మోగింది. కావడిని నేలపై మోపకుండా యాత్ర కొనసాగిస్తామని భక్తులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న అనంతరం భక్తిశ్రద్ధలతో ఈ జలాలతో శివుడికి అభిషేకం చేస్తామని పాడువకు చెందిన బోల్‌ భమ్‌ భక్తులు సాక్షికి తెలిపారు.ప్రతి ఏడాది ఒడిశా క్యాలెండర్‌ ప్రకారం ప్రతి శ్రావణ మాసం కావడి యాత్ర ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తామని చెప్పారు.