విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియం నందు జరుగుతున్న సేవా సంగమం కార్యక్రమంలో రెండవ రోజు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నూజివీడు సీడ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మండవ ప్రభాకర్ , విశిష్ట అతిథిగా రిటైర్డ్ కమాండర్ శ్రీ వేట కొమ్మ కృష్ణ, రాష్ట్రీయ సేవా భారతి ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రావణ్ కుమార్ , ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ సహ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ కొండా రెడ్డి లు పాల్గొన్నారు. ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ సహ ప్రాంతం ప్రచారక్ శ్రీ విజయాదిత్య ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.
శ్రీ మండవ ప్రభాకర్, మేనేజింగ్ డైరెక్టర్, నూజివీడు సీడ్స్ లిమిటెడ్
మొదటగా ముఖ్య అతిథి శ్రీ మండవ ప్రభాకర్ మాట్లాడుతూ సేవాభారతి కార్యక్రమాలు అత్యంత ప్రేరణ దాయకంగా కొనసాగుతున్నాయని భవిష్యత్తులో తాను కూడా సేవా భారతి కార్యకలాపాలలో క్రియా శీలకంగా పాలుపంచుకుంటానని తెలిపారు.
శ్రీ కృష్ణ, రిటైర్డ్ కమాండర్
విశిష్ట అతిథి శ్రీ కమాండర్ కృష్ణ మాట్లాడుతూ తాను ఆర్మీకి, నేవీకి కలిపి శిక్షణ ఇచ్చే సంస్థలో పని చేశానని, “ సేవా హి పరమో ధర్మః” అనే నినాదంతో సాయుధ దళాలు సరిహద్దులను రక్షిస్తున్నాయని సేవా భారతి కూడా అదే నినాదంతో పని చేస్తూ ఉండడం గమనార్హం అని పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటుగా సేవా భారతి వంటి సంస్థలు కూడా నిశ్శబ్దంగా చేస్తున్న కృషి కారణంగానే దేశం ప్రశాంతంగా ఉన్నదని ఆయన తెలిపారు. “సరిహద్దులలో సాయుధ సైనికులు దేశానికి కాపలా… సరిహద్దుల లోపల నిరాయుధ సేవకులు సమాజానికి కాపలా….” అని పేర్కొన్నారు.
శ్రీ కొండా రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ సహ ప్రాంత సేవా ప్రముఖ్
అనంతరం ఆంధ్ర ప్రదేశ్ సహ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ కొండా రెడ్డి మాట్లాడుతూ 1989లో ప్రారంభమైన సేవా భారతి దేశవ్యాప్తంగా 150000 సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, అలాగే రాష్ట్రంలో 1300 సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. సేవ, త్యాగం అనే సహజమైన భారతీయ లక్షణాలను ఆధారం చేసుకుని సేవా భారతి ప్రజలకు విద్య, వైద్యం, సామాజిక, స్వావలంబన రంగాలలో తన సేవలను అందిస్తున్నదని తెలిపారు.
సేవా భారతి రాష్ట్ర వ్యాప్తంగా 300 అభ్యాసికలను నిర్వహిస్తున్నదని, అలాగే ప్రొద్దుటూరు, నూతక్కి, సంఘమిత్ర, నెల్లూరు వంటి వివిధ కేంద్రాలలో నిర్వాసిత ఆవాస విద్యాలయాలను నిర్వహిస్తున్నదని తెలిపారు.
అలాగే పాడేరులో విద్యా మిత్ర, ఆరోగ్య మిత్రల పేరుతో అక్కడి ప్రజలకు విద్య, వైద్య సహకారాలను అందిస్తున్నదన్నారు.
వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం పేరుతో ఒక కుష్టు రోగుల వైద్యాలయాన్ని, నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ వంటి వాటిని సేవా భారతి నిర్వహిస్తున్నదని శ్రీ కొండా రెడ్డి వివరించారు.
అలాగే కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహిస్తున్న సంఘమిత్ర విద్యాలయం, కర్నూలు జిల్లా గోకవరంలో చెంచు విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఆవాస విద్యాలయాల గురించి వివరించారు.
అనంతపురం జిల్లాలోని కదిరి తాలూకాలో 350 గ్రామాలలో భజన కేంద్రాలు, హోమియో శిక్షణ కేంద్రాలు, నిరాశ్రిత బాలల కోసం నిర్వహిస్తున్న మాధవ గురుకులం గురించి వివరిస్తూ అనంతపురం జిల్లాలో 60 గ్రామాలలో అందిస్తున్న పశుగ్రాసం, మంచినీటి సరఫరా, మహిళల స్వావలంబన కోసం నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాలు, కంప్యూటర్ శిక్షణ కేంద్రాల గురించి వివరించారు.
ఉంగుటూరులోని నాచుగుంట వద్దగల గోశాల మరియు సేంద్రీయ వ్యవసాయ క్షేత్రం నిర్వాహకులు శ్రీ రామకృష్ణ గారిని ప్రభుత్వం ఆహ్వానించి వారి అనుభవాలను ఐఏఎస్ అధికారులకు సైతం తెలియజేస్తూ ఉన్నదని శ్రీ కొండా రెడ్డి వివరించారు.
డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జయభారత్ హాస్పిటల్, నెల్లూరు
అనంతరం నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 1982 విజయదశమి నాడు జయభారత్ హాస్పిటల్ ప్రారంభమైందని తెలిపారు. జయభారత్ హాస్పిటల్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం పేదలకు అందిస్తున్నామని శ్రీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
ఉచిత కంటి ఆపరేషన్లు, ఎనిమిది వందల రూపాయలకే డయాలసిస్, నిరుపేద ఎస్ టి లకు ఉచిత వైద్యం, గిరిజన గర్భిణీలకు సీమంతం, బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమం జై భారత్ హాస్పిటల్ నిర్వహిస్తున్నదని తెలిపారు. యానాదుల సమారాధన ద్వారా ప్రతి ఏడాది 10, 12 వేల మంది యానాదులు గోవింద దీక్షను స్వీకరించి తమ ఆచారం ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనలో పాలు పంచుకుంటున్న కార్యక్రమాన్ని జయభారత్ హాస్పిటల్ నిర్వహిస్తున్నదని, అంతే కాక జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ మల్లెల రామయ్య మెమోరియల్ నర్సింగ్ కాలేజ్ నందు ఎస్టీ విద్యార్థులకు వసతితో కూడిన ఉచిత శిక్షణను అందజేస్తున్నామని తెలిపారు.
శ్రీ శ్రీనివాస్, సంఘమిత్ర ఆవాస విద్యాలయం, నంద్యాల
అనంతరం నంద్యాలకు చెందిన శ్రీ శ్రీనివాస్ నంద్యాలలోని సంఘమిత్ర ఆవాస విద్యాలయం వివరాలను అందజేశారు. 1994లో నలుగురు పిల్లలతో స్థాపించబడిన సంఘమిత్ర ఆవాస విద్యాలయం నేడు 25 మంది పిల్లలతో నడుస్తున్నదని, అందులో విద్యనభ్యసించిన పిల్లలు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో నేడు పని చేస్తున్నారని తెలిపారు. సంఘమిత్ర ఆధారంగా 38 చెంచు గూడేలలో మొబైల్ వ్యాన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని, దేశ నాయకుల, మహాత్ముల జయంతులు, వర్ధంతులు నిర్వహించడం ద్వారా పిల్లలకు దేశభక్తి అలవడుతోందని తెలిపారు.
శ్రీ మజ్జి ఈశ్వరరావు, గ్రామీణ వికాసం
అనంతరం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము గ్రామం కేంద్రంగా జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలను గూర్చి శ్రీ మజ్జి ఈశ్వరరావు వివరించారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త శ్రీ కె రాజేంద్ర గారి కృషితో కడుము గ్రామం బయట స్థిరపడిన కడుము వాసుల సహకారంతో విద్యార్థి వికాస కేంద్రాలు నిర్వహిస్తున్నామని, వాటి ద్వారా దాదాపు 1500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పోషకాహారం అందించడం, మరుగుదొడ్లు నిర్మించడం, శుద్ధ జలాన్ని అందించడం, గోసేవ అలవాటు చేయడం, సంప్రదాయబద్ధంగా, కలివిడిగా, కోలాహలంగా పండుగలు నిర్వహించుకునేలా చూడడం మొదలైంది. గో ఆధారిత వ్యవసాయం తదితరాలు అలవాటు చేయడం ద్వారా కడుము సమీప గ్రామమైన ఘన సురలో 170 మరుగుదొడ్లు నిర్మించామని, ఘనసుర గ్రామంలో ఏర్పాటుచేసిన ఆర్ వో ప్లాంట్ ద్వారా 16 గ్రామాల ప్రజలు తాగునీటిని అందుకొంటున్నారని తెలిపారు. గ్రామస్తుల సహాయంతో ఆరు కంప్యూటర్లతో కూడిన ఒక కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని కడుములో ఏర్పాటు చేశామని, పండుగలలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా గ్రామస్తులందరూ ఆనందోత్సాహాల మధ్య కలివిడిగా, కోలాహలంగా ఉత్సవాలు నిర్వహించుకుంటారని ఆయన తెలిపారు.
సన్మానం
అనంతరం దివ్యాంగులకు సేవ చేయడం కోసం ఆదరణ వికలాంగుల సంక్షేమ సంఘం, అమ్మ ప్రశాంతి నిలయం పేరుతో వృద్ధాశ్రమం వంటి సేవా ప్రకల్పాలను నిర్వహిస్తున్న అనంతపురం జిల్లా కదిరికి చెందిన శ్రీ నాగేష్ గారిని, దివ్యాంగులకు విద్య, వైద్యం అందించడం కోసం కృషి చేస్తున్న కాకినాడకు చెందిన ఉమ మానసిక వికాస కేంద్రం నిర్వాహకుడు శ్రీ యస్ పెద్దిరెడ్డిని పెద్దలు సత్కరించారు.
శ్రీ విజయాదిత్య, ఆర్ ఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ సహ ప్రాంత ప్రచారక్
అనంతరం ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ ఎస్ ఎస్ సహ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య మాట్లాడుతూ సేవా సంగమం ఒక పవిత్ర యజ్ఞం వంటిదని తెలిపారు. సహజసిద్ధమైన మానవీయ ఆంతరంగిక గుణాల కారణంగా సేవాగుణం ఏర్పడుతుందని, మానవ సహజమైన దయ, కరుణ లే సేవా కార్యానికి ప్రేరణ అని, అయితే కొందరికి మాత్రం కీర్తి, ధనం, ప్రచారం కూడా సేవకు ప్రేరణగా ఉన్నాయన్నారు. అయితే ఈ లక్ష్యంతో సేవ చేయడం అంటే సమాజం మీద అత్యాచారం చేయడమేనని, అలా చెయ్యడం పాపమని, ఆంతరంగిక సంవేదన శీలతతో కూడుకున్న సేవ పుణ్య ప్రాప్తికి కారణం అవుతుందని ఆయన పేర్కొన్నారు. మనదేశంలో 31 లక్షల ఎన్జీవోలు రిజిస్టర్ అయి ఉన్నాయని, ఇవి మన దేశంలోని స్కూల్స్ కి రెట్టింపు సంఖ్య అని, అలాగే ఆసుపత్రులకు నాలుగు రెట్లు అని తెలిపారు. “అయితే వీటిలో నిజంగా సేవా దృక్పథం కలిగిన సంస్థలు ఎన్ని?” అని ఆయన ప్రశ్నించారు. కొన్ని ఎన్జీవోల వల్ల నష్టం జరుగుతోందని ప్రభుత్వాలు వాటిని నిషేధిస్తూ ఉన్నాయని ఆయన అన్నారు. ఏవో కొన్ని సేవా సంస్థల వల్ల దేశంలో ఉన్న ప్రజలందరి అవసరాలు తీరిపోవని, అయితే ప్రస్తుతం మనం నిర్వహిస్తున్న సేవా సంస్థల కారణంగా ఇతరులకు ప్రేరణ లభించాలని ఆయన తెలిపారు.
అనంతరం వివిధ సేవా సంస్థల ప్రతినిధులకు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు.
రెండవ కాలాంశం
శ్రీ చలసాని బలరామయ్య , ప్రముఖ సామాజిక కార్యకర్త
సేవా సంగమం రెండవ రోజు రెండవ కాలాంశంలో విజయవాడకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ చలసాని బలరామయ్య మాట్లాడుతూ నిస్వార్ధంగా సేవ చేయాలని సంకల్పిస్తే ఉదారంగా సహకరించే దాతలకు సమాజంలో కొదవలేదని తనకు ఎదురైన వివిధ అనుభవాలను ఉదాహరణలుగా పేర్కొంటూ వివరించారు.
శ్రీమతి చంద్రికా చౌహాన్, రాష్ట్రీయ సేవా భారతి
సేవా భారతి కృషి కారణంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో మతమార్పిడులు తగ్గుముఖం పట్టాయని, పూనాలోని రెడ్ లైట్ ఏరియాలో గల బాలబాలికలకు బాల సంస్కార కేంద్రాలు నిర్వహించడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపగలిగామని, జైలులోని ఖైదీలతో రక్షాబంధన్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం మరియు ఆధ్యాత్మిక ఉపన్యాసాల ద్వారా వారిలో పరివర్తన తీసుకురావడంలో సేవా భారతి కృషి ఎనలేనిదని శ్రీమతి చంద్రికా చౌహాన్ వివరించారు.
శ్రీ సత్య గోపాల్ రెడ్డి, అనంతపురం, RAISE సంస్థ నిర్వాహకులు
శ్రీ సత్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కా బంగారం కంటే విలువైనదని, నీటిని భద్ర పరుచుకుంటేనే భావితరాలకు నీటి వనరులు అందుతాయని తెలుపుతూ గత నలభై సంవత్సరాలుగా నీటిని భద్ర పరుచుకోవడానికి, నీటి సక్రమ వినియోగానికి RAISE సంస్థ ద్వారా తాము చేసిన కృషిని వివరించారు.
శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, గుంటూరు విభాగ్ ప్రచార ప్రముఖ్
అనంతరం గుంటూరు విభాగ్ ప్రచార ప్రముఖ్ శ్రీ అవ్వారు శ్రీనివాసరావు మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా అత్యధిక సాయాన్ని పొందే అవకాశముందని, కనుక సరైన విషయాలపై, నిజాయితీగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించి కూడా సేవా కార్యక్రమాలకు నిధులను సమీకరించ వచ్చని తెలిపారు.
ఏకలవ్య ఫౌండేషన్
అనంతరం “గ్రామ వైభవమే భారత వైభవం” అనే నినాదంతో ప్రారంభించబడిన ఏకలవ్య ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతాలలో బాలబాలికల విద్య , వైద్య అవసరాల కోసం కొనసాగిస్తున్న కృషిని ఆ సంస్థ ప్రతినిధి వివరించారు.
వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం
మహా రోగి ఆరోగ్య కేంద్రం ద్వారా కుష్టు రోగుల కోసం వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం అందిస్తున్న సేవలను కూడా ఆ సంస్థ ప్రతినిధి వివరించారు.
శ్రీ జి రాఘవాచార్యులు, సమరసత సేవా పౌండేషన్ (SSF)
అనంతరం సేవా బస్తీలలో ధార్మిక జాగరణ కోసం 2015 విజయదశమి నాడు ఆవిర్భవించిన సమరసత సేవా పౌండేషన్ ఆంధ్ర ప్రదేశ్లోని వివిధ దళిత వాడలలో నిర్మించిన 500 పైచిలుకు దేవాలయాల ద్వారా ఆయా వాడలలో సాధిస్తున్న ధార్మిక, సామాజిక పరివర్తనను గూర్చి ఆ సంస్థ ప్రతినిధి శ్రీ జి రాఘవాచార్యులు వివరించారు.
శ్రీ యుగంధర్, ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ సహ ప్రాంత కార్యవాహ
అనంతరం ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ సహ ప్రాంత కార్యవాహ శ్రీ యుగంధర్ మాట్లాడుతూ సేవ చేయడానికి సంవేదన, సంకల్పం ప్రధానమని , భగవంతుని చేరడానికి సేవ ప్రధాన సాధనమని వివరించారు. కొత్తగా వివాహమైన జంట వీధులలో ఒంటరిగా సంచరిస్తున్న ఒక మతి చలించిన యువతిని చూసి ఆమెను తమ ఇంటికి తీసుకుని వచ్చి పరిచర్యలు చేయడం, అనంతరం ఆ ఇల్లు 50 మంది మానసిక, శారీరిక వికలాంగులకు ఆవాసంగా మారడం, వారి సేవ కోసం ఆ దంపతులు సంతానాన్ని కనకపోవడం గూర్చి చెప్పి అందరినీ కదిలించారు. సేవ ద్వారా అట్టడుగు స్థాయిలోని వ్యక్తులు, పీడితులు, బాధితులు, దివ్యాంగుల జీవితాలలో, సమాజంలో పరివర్తన తీసుకురాగలగాలని శ్రీ యుగంధర్ వివరించారు.
సమారోప్
శ్రీ శ్రావణ్ కుమార్, రాష్ట్రీయ సేవా భారతి ప్రధాన కార్యదర్శి
అనంతరం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్రీయ సేవా భారతి ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మన దేశీయుల రక్తంలోనే సేవాగుణం ఉన్నదని, సరి అయిన దిశలో ప్రయత్నిస్తే అవసరమైన వారందరికీ సమర్థవంతంగా సేవలు అందించవచ్చని తెలిపారు.
డాక్టర్ చదలవాడ సుధ, సేవా సంగమం ఆహ్వాన కమిటీ సభ్యులు
సేవా సంగమం ఆహ్వాన కమిటీ సభ్యులు డాక్టర్ చదలవాడ సుధ మాట్లాడుతూ భారతీయ సమాజంలో భావ కాలుష్యం పెరిగిపోయిందని దానిని తొలగించడానికి సత్సంగం అవసరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు భావ కాలుష్య నివారణకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. సేవ ఎవరినో ఉద్ధరించడానికి కాదని, సేవ ద్వారా మనకు అనంతమైన ఆనందము, తృప్తి లభిస్తాయని ఆమె తెలిపారు.
శ్రీ ఎక్కా చంద్రశేఖర్, క్షేత్ర సేవా ప్రముఖ్
అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ సేవా సంగమంలో అట్టడుగు స్థాయిలో అవసరమైనవారికి సేవలందించే కార్యకర్తలందరూ కలవడం అభినందనీయమని పేర్కొన్నారు. వ్యక్తిగతంగానూ, సంస్థల ద్వారాను సేవలందిస్తున్న వారు మరింత శక్తివంతం కావడానికి సేవా సంగమం దోహదపడుతుందని తెలిపారు. భారతదేశం అగ్ర స్థానంలో నిలవాలనే మన ప్రాచీన ఋషి మునుల సంకల్పము, ఆకాంక్ష అతి త్వరలో నెరవేరబోతోందని ఆయన పేర్కొన్నారు. ఏ సత్కార్యం చేయడానికైనా అవధులు లేని ఆకాంక్ష, కఠోర శ్రమ అవసరమవుతాయని, ఆ కారణంగానే మహారాష్ట్ర కు చెందిన సింధు తాయి నేడు 1400 మంది బాలబాలికలకు తల్లి కాగలిగిందని, అతి తక్కువ వయసులో ఒక పిల్లవాడు ఎనిమిది వందల మంది బాలబాలికలకు ట్యూషన్లు చెబుతూ ప్రిన్సిపాల్ కాగలిగాడని, 18 పాఠశాలలు నడుపుతున్న తొంభై తొమ్మిది సంవత్సరాల విశ్వాస్ అతి పెద్ద వయసున్న ఉపాధ్యాయుడుగా గుర్తింపు పొందాడని తెలిపారు. సేవ చేయడానికి గొప్ప సామర్థ్యము, మేధస్సు అవసరం లేదని, కేవలం ఎదుటివారి కష్టాలకు స్పందించే హృదయము, సేవ చేయాలని సంకల్పము ఉంటే సరిపోతుందని, సేవా కార్యానికి నిధులను సమీకరించడం, లెక్కలు చూపడం ప్రధానం కాదని సేవా గుణమే సేవా కార్యానికి ఆధారమని శ్రీ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో ఇంకా కూటికి, గూటికి, గుడ్డకు, నోచుకోని పేదలు, అనాధలు, అభాగ్యులు అనేకులు ఉన్నారని, వారందరి జీవితాలలో పరివర్తన సాధించడం కోసం సేవా సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరమున్నదని తెలిపారు. సృష్టిలోని ప్రతిదీ భగవత్ ప్రసాదమేనని స్వామి రామతీర్ధ చెప్పారని, కనుక సృష్టిలో ఏదీ ఎవరికీ శాశ్వతము, స్వంతము కాదని, కనుక మనకు లభించిన ప్రతిదీ పదుగురికి పంచడం అలవాటు చేసుకోవాలని, అదే నిజమైన దేవతార్చన అని శ్రీ చంద్రశేఖర్ తెలిపారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.