News

అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్ల జోరు

258views

అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో యాత్రికుల ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం జమ్మూలోని సరస్వతి ధామ్ టోకెన్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యాత్ర సజావుగా సాగడం కోసం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 38 రోజుల పాటు జరిగే ఈ యాత్ర జూలై 3న ప్రారంభం కానుంది. కాగా, జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికుల మొదటి బృందం జూలై 3న కశ్మీర్ కు బయలుదేరుతుంది. అదే విధంగా రేపటి నుండి మరో మూడు కేంద్రాలలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

పహల్గాం ఉగ్రదాడి నీలినీడలు అమర్‌నాథ్‌ యాత్రపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈ సంవత్సరం నిర్వహించనున్న యాత్రలో పాల్గొనేందుకు తమ పేరు నమోదు చేసుకునే నిమిత్తం తొలిరోజే వందల మంది బారులు తీరడం ఇందుకు నిదర్శనం. ‘‘బుల్లెట్లు, బాంబులు శివ(బాబా బర్ఫానీ) దర్శనం చేసుకోకుండా మమ్మల్ని నిరోధించలేవు’’ అని ముంబయికి చెందిన దివాకర్‌ కదం పేర్కొన్నారు. ఆయన అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనడం ఇది పదకొండోసారి. జమ్మూ రైల్వే స్టేషన్‌ పరిధిలోని సరస్వతీ ధామ్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రం వద్ద తమ పేరును నమోదు చేసుకునేందుకు తొలిరోజే అసాధారణ సంఖ్యలో జనం గుమిగూడారు. పహల్గాంలో 26 మందిని, ప్రధానంగా పర్యాటకుల్ని, కాల్చి చంపిన పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇది దీటైన సమాధానమని పరిశీలకులు భావిస్తున్నారు. ‘‘బంబం బోలే’’, ‘‘జై బాబా బర్ఫానీ’’ అన్న నినాదాలతో రిజిస్ట్రేషన్‌ కేంద్రం మార్మోగింది. ఉగ్రదాడిలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళిగా తాము పహల్గాం మీదుగా యాత్రకు వెళ్లనున్నట్టు క్యూలో నిలుచున్న పలువురు వ్యాఖ్యానించారు. ‘‘ఏం జరిగినా అమర్‌నాథ్‌ యాత్ర పట్ల దేశ ప్రజల ఉత్సాహాన్ని ఎవరూ నీరుగార్చలేరు’’ అని దివాకర్‌ కదం అన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని సందర్శించేందుకు జరిగే 38 రోజుల యాత్ర జులై 3న ప్రారంభమవుతుంది. రెండు మార్గాల ద్వారా సాగే ఈ యాత్రకు అధికారులు విస్తృత భద్రతా ఏర్పాటు చేశారు.