News

145 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల మనోరంజితం విద్యాలయం పునరుద్దరణ

278views

విద్యార్థులకు విద్యా విజ్ఞానాలతోపాటు సాంస్కృతిక, నైతిక విలువలను ప్రబోధించి, వారిని దేశభక్తులుగా, సమాజ సేవకులుగా తీర్చిదిద్దడం విద్యాలయాల లక్ష్యం కావాలని హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అన్నారు.

జూన్ 18న భాగ్యనగర్, తిలక్ రోడ్ కేశవమెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 145 సంవత్సరాల నాటి మనోరంజితం మెమోరియల్ హైస్కూలులో ఇంగ్లీషు మీడియం తరగతులను ప్రారంభిస్తూ విద్య, వైద్యం ఈ రెండూ వ్యాపారంలా మారకూడదని, విలువలను, సేవాభావాన్ని పెంపొందించే విధంగా ఆ వ్యవస్థలు పనిచేయాలని చెప్తూ 1940లో ప్రారంభమైన కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అటువంటి విలువలకే కట్టుబడి ఉందని అందుకే 1883లో ప్రారంభమైన మనోరంజితం ఎడ్యుకేషనల్ సొసైటీ నడిపిస్తున్న తెలుగు మీడియం పాఠశాల మూతబడే స్థితికి వచ్చిన సందర్భంలో ఆ సమితివారు ఈ పాఠశాలను కేశవమెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీకి అప్పగించారని, ఇది ఎంతో శుభపరిణామ మని, విద్యారంగంలో పనిచేస్తున్న ఈ సంస్థకిది ఒక చారిత్రాత్మక ఘట్టమని నరసింహారెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న గోషామహల్ ఎం.ఎల్.ఏ రాజాసింగ్ మాట్లాడుతూ నా నియోజకవర్గంలో సేవా దృక్పథం గలిగిన ఒక గొప్ప విద్యా సంస్థ ఈ విద్యాలయాన్ని నడపడం నాకెంతో గర్వకారణంగా ఉందని, పేద ప్రజానీకం నేటి కార్పొరేట్ విద్యాలయాల్లో ఫీజులు చెల్లించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న వారందరికీ తక్కువ ఫీజుతోనే మెరుగైన విద్యను అందించడానికి ముందుకు వచ్చిన కేశవ మెమోరియల్ సొసైటీని మనసారా అభినందిస్తున్నానని అన్నారు.

మనోరంజితం విద్యాలయాన్ని రాజాకిషన్ ప్రసాద్ 1883లో ప్రారంభించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కుముద్్బన్జోషి, దామోదరం సంజీవయ్య మొదలుగు ప్రముఖులెందరో ఈ పాఠశాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీకీ కేశవ మెమోరియల్ విద్యాసంస్థలు తెలంగాణ ప్రాంతంలోనే ఒక రికార్డును సృష్టిస్తున్నాయి. సంస్కృతి, విలువలతో కూడిన విద్యను బోధించడమే లక్ష్యంగా నడుస్తున్నాయి. మనోరంజితం పాఠశాలను కూడా ఆ దిశలోనే నడిపిస్తామనే విశ్వాసాన్ని సొసైటి అధ్యక్షులు వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ డా. సురేఖ, సొసైటీ కార్యదర్శి డా. అన్నదానం సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు జె. నరసింహారావు, సొసైటీ సహ కార్యదర్శి శ్రీధరరెడ్డి, మనోరంజితం మెమోరియల్ హైస్కూలు అధ్యక్షులు శ్యాంరాజ్, కరస్పాండెంట్ జ్యోతి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ సుందర్రెడ్డి, నగర ప్రముఖులు పాల్గొన్నారు.