News

తీర్థయాత్రల ద్వారా ధార్మిక భావన : ప్రధానమంత్రి

236views

తీర్థయాత్రలు క్రమశిక్షణను, పరస్పర ప్రేమని, సోదర భావాన్ని నేర్పిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్.. మనసులోని మాట కార్యక్రమం 123వ సంచికలో తీర్థయాత్రలపై ఆయన ప్రసంగిస్తూ, ఎవరైనా తీర్థయాత్రలకు బయలుదేరే ముందు ఎవరైన కూడా “ఇన్నాళ్లకి అక్కడ నుంచి పిలుపు వచ్చింది” అనుకుంటూ ఉంటారు. ఇదే భావం మన తీర్థయాత్రలకు ఆత్మ లాంటిది. ఈ యాత్రలు శరీరానికి క్రమశిక్షణను, మనసుకు శుధ్ధిని, పరస్పర ప్రేమని, సోదర భావాన్ని నేర్పిస్తాయి. ఇవే భగవంతుడిని చేరేందుకు మార్గాలు. ఇవి కాకుండా, ఈ యాత్రలకు మరొక దృష్టికోణం ఉంది. ఈ ధార్మికమైన యాత్రలు సేవా కార్యక్రమాలను చేసుకునేందుకు గొప్ప అవకాశాలు. ఏదైనా యాత్ర జరిగినప్పుడు, ఆ యాత్రకు వెళ్ళిన ప్రజల కంటే ఎక్కువమంది ప్రజలు తీర్థయాత్రలకు వెళ్ళిన యాత్రికులకు సేవ చేసే పనిలో నిమగ్నమవుతారు. ప్రతి చోటా సామూహిక వంట కార్యక్రమాలు, అన్నదానాలు ఏర్పాటవుతాయి. ప్రజలు రోడ్డు పక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. సేవాభావంతోనే మెడికల్ క్యాంప్ లు, ఇతర సదుపాయాల ఏర్పాట్లు జరుగుతాయి. ఎందరో ప్రజలు తమ సొంత ఖర్చులతో తీర్థయాత్రికుల కోసం ధర్మశాలల ఏర్పాట్లు, నివాస సదుపాయాలు కల్పిస్తారు. చాలా కాలం తర్వాత కైలాస ,మానస సరోవరం యాత్రలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. కైలాస మానస సరోవరం అంటే భగవంతుడైన శివుడి నివాసస్థలం. హిందూ, భౌధ్ధ, జైన, ప్రతి సంప్రదాయంలోనూ కైలాశాన్ని శ్రధ్ధా,భక్తుల కేంద్రంగా భావిస్తారు. జూలై మూడవ తేది నుండీ పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. పవిత్రమైన శ్రావణమాసం కూడా కొద్ది రోజుల్లో మొదలవబోతుందన్నారు. ఉత్తరం నుండి దక్షిణం వరకూ, తూర్పు నుంచీ పడమర వరకూ చేసే ఈ యాత్రలు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ భావానికి ప్రతిబింబాలని తెలిపారు.

రెండు రోజుల క్రితమే మనం జగన్నాధుడి రథ యాత్రను కూడా తిలకించాము. ఒరిస్సా అయినా, గుజరాత్ అయినా, దేశంలోని ఏ ప్రాంతమైనా లక్షల కొద్దీ ప్రజలు ఇందులో పాల్గొంటారు. శ్రధ్ధా భావంతో, పూర్తి సమర్పణా భావంతో, పూర్తి క్రమశిక్షణతో మన ధార్మిక యాత్రలను పూర్తిచేసినప్పుడు దాని ఫలితం కూడా మనకి లభిస్తుంది. యాత్రలకు వెళ్తున్న అదృష్టవంతులైన భక్తులందరికీ నేను నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సేవాభావంతో ఈ తీర్థయాత్రలను సురక్షితంగా, విజయవంతం చేసే ప్రయత్నంలో ఉన్న వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ధార్మిక యాత్రలు సేవా కార్యక్రమాలను చేసుకునేందుకు గొప్ప అవకాశాలను కల్పిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.