
ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర చాలా పెద్దదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని కూడా తుత్తునీయలు చేశారని,ప్రజాస్వామ్యాన్ని అణచివేశారన్నారు. అయితే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో సంఘ్, దాని నుంచి ప్రేరణ పొందిన సంస్థలు చాలా కీలక భూమిక పోషించాయన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆరెస్సెస్ కార్యకర్తలు అండర్ గ్రౌండ్ లో వుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి చాలా పోరాటం సలిపారన్నారు.
ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో అత్యవసర పరిస్థితిపై ప్రముఖ జర్నలిస్ట్ రామబహదూర్ రాయ్ రచించిన గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. నేటి యువత అప్పటి ఎమర్జెన్సీ గురించి, దాని భయంకర పరిస్థితుల గురించి తప్పకుండా తెలుసుకోవాలని సూచించారు. అప్పటి ప్రధాని ఇందిర తన అధికారాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం ప్రాథమిక స్ఫూర్తినే పూర్తిగా మార్చేశారని, పత్రికా వ్యవస్థ, పార్లమెంట్, న్యాయ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. ఆ సమయంలో ప్రజలు తమ హక్కుల కోసం తీవ్రంగా పరిశ్రమించారని, కనీసం తమ గొంతుకను కూడా వినిపించలేనంత భయానక పరిస్థితులు వుండేవన్నారు.
gadkari2
ఈ సందర్భంగా అత్యయిక పరిస్థితి సమయంలో తన అనుభవాల్ని నితిన్ గడ్కరీ వివరిస్తూ ‘‘1975 లో నేను మెట్రిక్యులేషన్ విద్యార్థిని. అత్యవసర పరిస్థితి విధించిన ఉదయాన వార్తా పత్రికలు కూడా అచ్చు కాలేదు. వేలాది మంది అమాయకులను జైళ్లల్లో కుక్కారు. ప్రాథమిక హక్కులను కూడా రద్దు చేసేశారు. న్యాయం చేయమని కోరే హక్కులు కూడా లేవు.’’ అని గుర్తు చేసుకున్నారు.
రాయ్‌బరేలీ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు, రాజీనామా చేయడానికి బదులుగా, ఆమె దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారని గడ్కరీ అన్నారు. అలాగే ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర అన్న నినాదాల ద్వారా కీర్తి ప్రతిష్ఠలను పరాకాష్టకు తీసుకెళ్లారని విమర్శించారు.





