
శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించాలని దేవాదాయశాఖ, దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఆర్జిత సేవలకు ఇబ్బందులు లేకుండా మధ్యాహ్నం వేళల్లో ఈ అవకాశం కల్పించనున్నారు. త్వరలో తేదీ ఖరారు చేయనున్నారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైల క్షేత్రం ఒకటి. ఇక్కడ కొలువుదీరిన మల్లికార్జునస్వామిని భక్తులు తమ చేతులతో తాకుతూ స్పర్శ దర్శనం చేసుకొనే సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో గతంలో స్పర్శ దర్శనాన్ని ఉదయం, సాయంత్రం కల్పించేవారు. ఆర్జిత సేవలకు డిమాండ్ పెరగడంతో నిర్దిష్ట వేళల్లోనే ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనాన్ని అమలు చేశారు. దీనివల్ల సామాన్య భక్తులు సంప్రదాయ వస్త్రాల్లో వచ్చి ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఉచిత స్పర్శ దర్శనం చేసుకునేవారు. దేవస్థానం ఏఈవో, పర్యవేక్షకులు, హోంగార్డు, సెక్యూరిటీ సిబ్బంది సమన్వయం చేసుకొని సామాన్య భక్తులను స్పర్శ దర్శనానికి అనుమతించేవారు.
ఆరు నెలల కిందట నిలుపుదల
సామాన్య భక్తులకు 10 నుంచి 20 నిమిషాల్లోనే దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో ఆరు నెలల కిందట దేవస్థానం అధికారులు శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు రద్దు చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం వేళల్లో ఉచిత సర్శ దర్శనాన్నీ నిలుపుదల చేశారు. సత్వరం స్వామివారి అలంకార దర్శనం చేసుకున్నప్పటికీ స్పర్శ దర్శనం కాలేదన్న అసంతృప్తి సామాన్య భక్తుల్లో నెలకొంది.
నిత్యం వెయ్యి మందికి
ఉచిత స్పర్శ దర్శనాన్ని పునరుద్ధరించాలని భక్తుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యలో ప్రస్తుత ఈవో ఎం.శ్రీనివాసరావు ఉచిత స్పర్శ దర్శనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనాన్ని అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకు 1000 నుంచి 1200 మంది భక్తులకు అవకాశం కల్పించడానికి చర్యలు తీసుకోనున్నారు. ఉత్సవాలు, పర్వదినాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఈ అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
ప్రత్యేక టోకెన్ల జారీ
గతంలో ఉచిత స్పర్శ దర్శనానికి ఎలాంటి టోకెన్ విధానం లేదు. భక్తులు నేరుగా వచ్చి నిర్దిష్ట వేళల్లో క్యూలైన్లో ప్రవేశించి స్పర్శ దర్శనం చేసుకునేవారు. అప్పట్లో టోకెన్ విధానం లేకపోవడంతో ఆలస్యంగా వచ్చిన భక్తులతో సెక్యూరిటీ, దేవస్థానం సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రత్యేకంగా టోకెన్లను జారీ చేయాలని ఈవో నిర్ణయించారు. స్థానికంగానే కౌంటర్ ఏర్పాటు చేసి భక్తులకు ప్రత్యేక టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుడి పేరు, ఆధార్, ఫోన్ నంబరును కంప్యూటర్‌లో నమోదు చేసి క్యూ.ఆర్ కోడ్ కలిగిన టోకెన్‌ను ఇవ్వాలని భావిస్తున్నారు.
ప్రచారం అవసరం





