News

అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

238views

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆలయ సంప్రదాయాలను కాపాడేలా పలు కీలక నిర్ణయాలను ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో ఇకపై కల్యాణోత్సవాలు, క్షీరాభిషేక సేవలు, సూర్యనమస్కారాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఫ్యాషన్‌ దుస్తులు వేసుకుంటే అనుమతి నిరాకరణ తప్పదని, కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణ నియమాలను పాటించాల్సిందేనని వివరించారు. సేవల్లో పాల్గొనే భక్తుల్లో పురుషులు పంచె, చొక్కా స్త్రీలు చీర లేదా చుడీదార్‌లతో వస్తేనే ఈ సేవల్లో కూర్చునేందుకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. అలాగే ఈ ఆర్జిత సేవల టిక్కెట్లు ధరలు పెంచేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదించనున్నామని, ఈ మేరకు అనుమతి రాగానే కల్యాణ సేవ, క్షీరాభిషేక సేవలు, సూర్యనమ స్కారాల పూజల రుసుములు పెంచుతూ టిక్కెట్ల విక్రయాలు జరపనున్నట్లుగా ఆయన ప్రకటించారు. అలాగే ఆదిత్యుని అంతరాలయ దర్శనాల వేళలను ఇక మీదట సాయంత్రం వరకు ఉండేలా సమయం పెంపు చేస్తున్నామని, ఈ మేరకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో సంప్రదించే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని వివ రించారు.

సోమవారం నుంచి ఽశనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.100 టిక్కెట్లు కొను గోలు చేసుకుని ఆదిత్యుని అంతరాలయ దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రూ.300 దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తు లను ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారని, అలాగే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.300 టిక్కెట్ల ద్వారా అంతరాలయ దర్శనాలకు అవకాశం కల్పించనున్నట్లుగా ఈఓ ప్రకటించారు.