
గోసేవే గోవిందుని సేవగా తిరుమల తిరుపతి దేవస్థానం- టిటిడి గోశాలలు నిర్వహిస్తోంది. దాతలు స్వామివారికి మొక్కుగా సమర్పించిన గోవులను సంరక్షిస్తూ వాటికి మెరుగైన సేవలు అందిస్తోంది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని విమర్శలు, అపవాదులు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇటువంటి వాటికి తావులేకుండా మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక వైద్య బృందం సిఫార్సులకు అనుగుణంగా వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది.
తిరుపతి నగరంలోని ఎస్వీ గోసంరక్షణశాలతోపాటు, తిరుమల, తిరుచానూరు, పలమనేరు, కమలయ్యగారిపల్లెలో టిటిడి గోశాలలు నిర్వహిస్తోంది. వాటిలో 2500-3000 వరకు ఆవులు, దూడలు, ఆబోతులు ఉన్నాయి. వీటి సంరక్షణకు తితిదే ప్రత్యేకంగా పశువైద్యులను నియమించి సేవలందిస్తోంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మరింత పక్కాగా నిర్వహించడానికి టిటిడి ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు ఎస్వీ వెటర్నరీ వర్సిటీలోని అధికారులను సంప్రదించారు. వర్సిటీలోని ఎనిమిది విభాగాల వైద్య నిపుణుల బృందంతో కమిటీ ఏర్పాటు చేయగా ఇటీవల ఈ బృందం ఆయా గోశాలల్లో పర్యటించింది. గోవుల్లో ఎటువంటి ప్రమాదకర వ్యాధులు లేవని, పర్యవేక్షణ బాగుందని తేల్చి కొన్ని సూచనలు చేసింది.
సిఫార్సుల అమలు
గోశాలలోని పశుసంపదకు వందశాతం ట్యాగ్ చేసి వివరాలు కంప్యూటరీకరించన్నాం. దీంతో ఏ సమస్య వచ్చినా పక్కాగా గుర్తించడానికి వీలుంటుంది. దాతలు ఇచ్చే ఆవులకు వ్యాధులు ఉండే అవకాశం ఉంది. ముందుగా పరీక్షించి బ్రూసిల్లోసిస్ లేనివాటినే స్వీకరిస్తాం. అలాగే ఏనుగులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నాం. ఏటా వయసుమీరిన, అనారోగ్యం పూర్తిగా క్షీణించిన పశువులను మంద నుంచి 15 శాతం వరకు వేరు (కల్లింగ్) చేయడం మంచిదని వైద్య బృందం సిఫార్సు చేసింది. -శ్రీనివాసులు, ఎస్వీ గోశాల ఇన్‌ఛార్జి సంచాకులు





