News

అరుణాచలేశ్వర క్షేత్రంలో అపూర్వ ఘట్టం

242views

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని శ్రీరమణ సేవాశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీఅపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానంలో జులై 7న ఓ అపూర్వ ఘట్టానికి వేదిక కానుంది. మహాశివ భక్తులైన 63 నాయనార్ల విగ్రహాలను ఆలయంలోని మండపంలో జులై 7న ప్రతిష్ఠించనున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త అరుణాచల మాధవి ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు జరుగనుంది. ఆంధ్రా అరుణాచలంగా, ఆసియాలోనే రెండో అరుణాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో నాయనార్ల ప్రతిష్ఠకు పెద్దసంఖ్యలోనే భక్తజనం విచ్చేయనున్నందున ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాయనార్ల విగ్రహాలతో పాటు దక్షిణామూర్తి, హయగ్రీవుడు, సూర్యభగవానుడు, కాల భైరవుడు, గంగామాత విగ్రహాలను ప్రతిష్ఠిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా జులై 4న గోపూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం నిర్వహిస్తారు. 5న తీర్థ సంగ్రహణం, అగ్నిసంగ్రహణం, దిశా హోమం, శాంతిహోమం, మూర్తి హోమం అనంతరం రక్ష్నోఘ్నం, గ్రామశాంతి, ప్రవేశ బలి, 6న స్వామి అనుజ్ఞ, అంకురార్పణం, యాగశాల నిర్మాణం, అశ్వపూజ జరుగుతాయి. 7న నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ, అనంతరం కుంభాభిషేకం జరుగుతుంది.

ప్రతిష్ఠించనున్న నాయనార్ల విగ్రహాలు
నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠకు సంబంధించిన ఏర్పాట్లను రెండు నెలలుగా అరుణాచల మాధవి, శ్రీరమణసేవాశ్రమం వ్యవస్థాపకులు స్వామి రామానందతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప రాచపల్లిలోని అరుణాచలేశ్వర దేవస్థానాన్ని, ఆశ్రమాన్ని ఆదివారం సందర్శించి ఏర్పాట్లపై చర్చించారు.