
ప్రపంచంలోనే నాలుగో ‘అష్టాంగ విమాన’ ఆలయం అమెరికాలోని ఒహాయో రాష్ట్ర రాజధాని కొలంబస్‌లో సిద్ధమవుతోంది. ఈ ఆలయాన్ని మూడు అంతస్తులుగా నిర్మిస్తున్నారు. సహజంగా ఆలయాల నిర్మాణం పూర్తయ్యాక విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ మాత్రం రెండు, మూడు అంతస్తులు నిర్మించడానికి ముందే అందులో విగ్రహాలను ప్రతిష్ఠించారు. మొదటి అంతస్తులో ఇప్పటికే వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా… రెండో అంతస్తులో యోగా నృసింహస్వామి (కృష్ణా జిల్లా వేదాద్రిలో ఉన్నట్లుగా) విగ్రహాన్ని, మూడో అంతస్తులో రంగనాథ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసినట్లు అక్కడి అర్చకులు రామకృష్ణ రామానుజం తెలిపారు. ఆలయాన్ని 2027 నాటికి పూర్తి చేసి మహాకుంబాభిషేకం చేస్తామని వెల్లడించారు. యోగా నృసింహస్వామి విగ్రహం బరువు 2 టన్నులు, రంగనాథ స్వామి విగ్రహం పడగతో కలిపి 9.5 టన్నులు ఉంది. ఈ విగ్రహాలను భారత్‌లో తయారు చేయించి అమెరికాకు తీసుకెళ్లారు.
హోమంలో పాల్గొన్న అర్చకులు
రామకృష్ణ రామానుజంతో పాటు అర్చకులు వేణుగోపాల్ వేదగిరి, విష్ణు, అమెరికాలోని పలు ఆలయాలకు చెందిన అర్చకులు వచ్చి మూడు రోజుల క్రతువు నిర్వహించారు. విగ్రహాలకు అంకురార్పణం, హోమం, పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం చేసి విగ్రహాలను పెద్ద క్రేన్‌తో రెండు, మూడు అంతస్తుల్లో స్థాపన చేశారు. వేల మంది భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డెలావేర్ కౌంటీ అధికారులు హాజరయ్యారు. మరో మూడు అష్టాంగ విమాన దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయని, వాటిని వేల ఏళ్ల కిందట నిర్మించారని రామకృష్ణ రామానుజం వివరించారు.





