
కృష్ణాజిల్లా తాడిగడపకు చెందిన పునుకొల్లు సూర్యనారాయణ. విద్య, వృత్తి రీత్యా అమెరికాలో 17 ఏళ్ల పాటు నివాసం ఉన్న ఆయన.. స్వదేశంపై మమకారంతో 2016లో తిరిగి వచ్చారు. సమీప విజయవాడలో కాలుష్య బెడదను గుర్తించారు. మితిమీరిన ఎరువులు, పురుగుమందుల వినియోగంతో భూములు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయని తెలుసుకున్నారు. వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ముందుగా తాను ఆచరించాలనే తలంపుతో 2018లో కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో తనకున్న మూడున్నర ఎకరాల్లో కొంత భాగాన్ని ప్రకృతి జీవనానికి కేటాయించారు.
బాతుల జలకాలాట
సుమారు రూ.12 లక్షలతో సూర్యనారాయణ నివాసం ఉండే ఎంఎన్‌ఆర్ వీధిలో రెండు వైపులా భారీగా మొక్కలు నాటించి సంరక్షిస్తున్నారు. పచ్చదనం-పరిశుభ్రత నిర్వహణకు నెలకు రూ.10 వేలు వెచ్చిస్తున్నారు. గిన్ని, నాటు, టర్కీ జాతి కోళ్లు బాతులు 130 వరకు పెంచుతున్నారు. 35 దేశవాళీ, పుంగనూరు, ఒంగోలు, అరుదైన ‘రాకీ’ జాతి ఆవులు, కోడెల సంరక్షణకు ఫ్యాన్లు, దోమ తెరలు వంటి వసతులు కల్పించారు. పొట్టి జాతి గొర్రెలు, మేకలు, కుందేళ్లతో ప్రకృతి కుటీరం ఏర్పాటు చేశారు.
కూరగాయల పెంపకాన్ని పూర్తిగా సేంద్రియ విధానంలో చేపట్టి బంధుమిత్రులు, పరిసర నివాసులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా బొప్పాయి తోట, పశుగ్రాసం సాగు చేస్తున్నారు. పక్షులు, జంతువులను విక్రయించకుండా వాటి సంతతిని అభివృద్ధి చేస్తున్నారు. పశువుల కొట్టం నుంచి విడుదలైన మూత్రాన్ని సేకరించి సేంద్రియ ఎరువుగా మార్చుతున్నారు.
బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చే ఎరువును పొలానికి, వంట గ్యాస్‌ను అక్కడ పనిచేసే వారికి ఉచితంగా సరఫరా చేస్తున్నారు. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
బహుళ ప్రయోజనం
‘వాయు, జల, భూ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఆహారం విషతుల్యమవుతోంది. శారీరక, మానసిన రుగ్మతలు అధికమవుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారం ప్రకృతి జీవనమేనని నమ్ముతున్నా. మొక్కలు, పెంపుడు జంతులు, పక్షులతో సహజీవనం చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయని స్వయంగా తెలుసుకున్నా. ఇతరులకు చెప్పే ముందు ఆచరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టాను’అని పునుకొల్లు సూర్యనారాయణ తెలిపారు.





