News

వైదిక గ్రామం దగ్ధంపై విచారణ చేపట్టాలి

225views

శ్రీకాకుళం జిల్లా హిరమండలం కూర్మ వైదిక గ్రామంలో ఇస్కాన్‌ ఆశ్రమం అగ్నిప్రమాదంలో దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రధాన ఆశ్రమం కాలిబూడిదైంది. 2018లో ఇక్కడ వైదిక గ్రామం ఏర్పాటైంది. విద్యుత్‌ వంటి ఆధునిక సదుపాయాలకు దూరంగా.. సనాతన ధర్మంతో పాటు ప్రాచీన సాగు విధానంతో ఇక్కడ కూర్మ గ్రామం గత ఏడేళ్లుగా విరాజిల్లుతోంది. ఈ క్రమంలో ఇక్కడ అగ్నిప్రమాదం సంభవించి ప్రధాన ఆశ్రమం దహనం కావడం సంచలనంగా మారింది. దీనిపై ఆశ్రమ నిర్వాహకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూర్మ ఆధ్యాత్మిక గ్రామాన్ని పరిరక్షించాలని పోలీస్‌ యంత్రాంగాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని కొత్తూరు సీఐ ప్రసాద్‌, హిరమండలం ఎస్‌ఐ మహ్మద్‌ యాసిన్‌ పరిశీలించారు. విశ్వహిందూ పరిషత్‌తో పాటు ధార్మిక సంఘాల ప్రతినిధు లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజానిజాలను బయటకు వెలికితీయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.