
ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన బాదామీ చాళుక్యుల శిల్పాలను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించే కార్యక్రమంలో భాగంగా కర్నూలుకు సమీపంలోని పంచలింగాల గ్రామంలోని పంచలింగేశ్వర ఆలయ సముదాయాన్ని ఆయన సందర్శించారు. బాదామీ చాళుక్యుల (7వ శతాబ్ది) కాలపు రెండంతస్తుల మండపం, మహిషాసురమర్ధిని, పంచ లింగేశ్వర ఆలయాలు అలనాటి ఆలయ వాస్తుకు అద్దం పడుతున్నాయని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
తుంగభద్రా నది ఎడమ గట్టునున్న ఈ ఆలయ సముదాయం, భూమట్టం కంటే నాలుగు అడుగుల లోతున ఉందని, ఆలయం ముందు ఐదు లింగాలు చెక్కిన శాసనం, అమ్మతల్లి, గణేశ విగ్రహాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో లింగం వెనుక ఒక మూలన గణేశ, సప్తమాత్రకులు, సూర్య, మహిషాసురమర్ధిని విగ్రహాలు ఒక గుట్టగా ఉన్నాయని వెల్లడించారు. 1300 సంవత్సరాల నాటి ఈ అపురూప శిల్పాలను ఆలయం బయటకు తెచ్చి పీఠాలపై నిలబెట్టి చారిత్రక వివరాలు ఉన్న పేరు పలకలను ఏర్పాటు చేసి భద్రపరిచి భవిష్యత్తు తరాలకు అందించాలని ఆలయ అధికారులు, గ్రామస్థులను కోరారు.





