ArticlesNews

ఉద్యమ జ్వాల… దుగ్గిరాల

336views

( జూన్ 10 – దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వర్ధంతి )

బ్రిటిష్‌వారి దాస్య శృంఖలాల నుంచి భరతమాతను విడిపించడానికి జరిగిన స్వాతంత్ర్యోద్యమ ఘట్టంలో ఆంధ్రుల పాత్ర మరువలేనిది. ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన తెలుగువీరులు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ఒకరు. స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యఘట్టం చీరాల పేరాల ఉద్యమం తలుచుకుంటే గుర్తుకు వచ్చేది దుగ్గిరాల గోపాల కృష్ణయ్యే.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో పెనుగంచిప్రోలు ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో కోదండరామస్వామి, సీతమ్మ దంపతులకు 1889 జూన్ 2వ తేదీన ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డే రానున్న రోజుల్లో దుష్టపాలకులను దేశం నుంచి తరిమివేసేందుకు జరిగే పోరాటంలో భాగస్వామి అవుతాడని తల్లిదండ్రులు అప్పుడు ఊహించలేదు. అప్పుడే కాదు… తర్వాత కూడా వారు తమ పుత్రుడి ఎదుగుదలను చూడలేదు. ఎందుకంటే కుమారుడు పుట్టిన మూడోరోజే తల్లి, మూడో యేటే తండ్రి ఈ లోకాన్ని విడిచిపోయారు. అయినా… తనను ఆదరించి, అక్కున చేర్చుకున్న వారి అండదండలతో ఆ బిడ్డడు మంచి వక్త అయ్యాడు. కవి అయ్యాడు. గాయకుడయ్యాడు…అన్నిటినీ మించి ఉద్యమకారుడయ్యాడు. అతడే మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.

ఊహతెలియక ముందే తల్లిదండ్రులను పోగొట్టుకున్న దుగ్గిరాల నాయనమ్మ, పినతండ్రి సంరక్షణలో పెరిగారు. రేపల్లె తాలూకా కూచినపూడి, గుంటూరులో ప్రాథమిక విద్య అభ్యసించారు. అరవిందులు, తిలక్ రచనలు దుగ్గిరాలలో దేశభక్తి, స్వాతంత్య్రపోరాట పటిమను పెంపొందించాయి. హైస్కూల్లో చదివే రోజుల్లోనే జాతీయ నాట్యమండలిని స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించేవారు. 1906లో బాపట్లలో మెట్రిక్యులేషన్ చదివి ఉత్తీర్ణులై కొంతకాలం బాపట్ల తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేశారు. అక్కడి తహసీల్దార్ వైఖరి నచ్చక, రాజీపడి ఉద్యోగం చేయలేక ‘ఈ సర్కారీ నౌకరీ చేయడం కంటే, వీధివీధి ఇల్లుఇల్లూ తిరిగి బిచ్చమెత్తుకోవడం మంచిది’ అని ఇంటికి ఉత్తరం రాసి రాజీనామా చేశారు. గుంటూరు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే సమయంలో సహపాఠి అయిన నడింపల్లి నరసింహారావు ఈయనకు ప్రాణస్నేహితులయ్యారు. ఆయన ఉన్నత విద్యకు ఇంగ్లండు వెళుతూ తనతో గోపాల కృష్ణయ్యను కూడా తీసుకువెళ్లారు. 1916లో అక్కడ డిగ్రీ అందుకుని, స్వదేశం వచ్చిన దుగ్గిరాల రాజమండ్రి, బందరు కళాశాలల్లో అధ్యాపకునిగా, ప్రిన్సిపాలుగా పనిచేశారు. స్వతంత్ర భావాలు కలిగిన ఈయనకు అక్కడి అధికారులతో సరిపడేది కాదు. బందరు జాతీయ కళాశాలలో పనిచేసేటప్పుడే కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్యగార్ల సహచర్యం ఈయనకు లభించింది. 1918లో ఉద్యోగం చాలించి, స్వేచ్చాజీవి అయిన దుగ్గిరాల సమాజ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. ఈయన మధుర గాయకుడు. ప్రతి సభలోనూ శ్రీకృష్ణ కర్ణామృతం, గీత గోవిందం, అష్టపదులను గానం చేసేవారు. అంతేకాదు, ఆంధ్రుల ప్రాచీన వైభవాన్ని కీర్తిస్తూ, కర్తవ్యాన్ని బోధిస్తూ రాయప్రోలు వారి కలం నుంచి జాలువారిన రచనను శ్రావ్యంగా గానం చేసి తెలుగువారి గుండెల్లో ఆంధ్రరాష్ట్ర వాంఛను రగిలించారు. ఆంధ్రమహాసభను వేదికగా చేసుకుని మాంటేగ్-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలను తీవ్రంగా విమర్శించిన దుగ్గిరాల తన పోరాటాలను కొనసాగించేందుకు చీరాలలో ‘రామదండు’ను స్థాపించారు. ఎర్రని చొక్కా, ఎర్రని తలగడ, ఎర్రని కుంకుమబొట్టు ధరించి ‘రెడ్‌షర్ట్స్’గా పిలువబడిన రామదండు సైన్యం త్యాగాలకు మారుపేరుగా నిలిచింది. మహాత్మాగాంధీ సహా పలువురి ప్రశంసలు పొందింది రామదండు.

అది 1919వ సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసింది. ఈ నిర్ణయానికి ప్రజానీకం భగ్గుమంది. ఇందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించారు. ఈ ఉద్యమ౦ స్వాతంత్రోద్యమ పోరాటంలో మరో ఘట్టమే అయింది. ఆంధ్రదేశం అంతటా తిరిగి బ్రిటిష్ ప్రభుత్వ దుర్నీతిపై ఎలుగెత్తి చాటారు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేస్తున్నారని దుగ్గిరాలను అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదల అయ్యాకా తాను జైలులో పొందిన అనుభవాలను ఎన్నో ఉపన్యాసాలలో ఆయన చెప్పేవారు. 1921లో గుంటూరు సభలో ఆయనకు ‘ఆంధ్రరత్న’ అనే బిరుదును ఇచ్చారు. తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి ఎంతో కృషి చేసిన దుగ్గిరాల సాధన అనే పత్రికను కూడా నడిపారు. ‘నవీన ఉపనిషత్తుకు స్వరాజ్యం ఒక సేద్యం’ అన్న వీరి నినాదం స్వాతంత్రోద్యమానికి ఆజ్యమే అయింది. తన మాటతో, పాటతో, బాటతో తెల్లవారి గుండెల్లో అగ్గిపుట్టించిన దుగ్గిరాల 1928వ సంవత్సరం జూన్ 10న అస్తమించారు. ఆయన జీవించింది 38 సంవత్సరాలే…అయితేనేం ఎందరికో ఆదర్శంగా నిలిచారు…తెలుగువారికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు.