
( జూన్ 10 – పొణకా కనకమ్మ జయంతి )
ఈ తరానికి పెద్దగా పరిచయం లేని మహిళ అని చెప్పేకంటే..గొప్ప త్యాగం చేసి కూడా చరిత్రలో పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయిన మహిళ పొణకా కనకమ్మ అని చెప్పడం సమంజసంగా ఉంటుంది. స్వతంత్ర భారతావని కోసం కలలు కంటూ ఆ కలలు సాకారాం దాల్చడం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి భావితరాల కోసం పోరాటం చేసి తనది అనేది ఏమీ లేదు…తన ప్రాణమే దేశంగా జీవించిన త్యాగశీలి పొణకా కనకమ్మ. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొట్లపూడిలో అమ్మమ్మ గారి ఇంట 1892 జూన్ 10వ తేదీన జన్మించారు. తండ్రి పేరు మరుపూరు కొండారెడ్డి, తల్లి పేరు కావమ్మ.
ఆ రోజుల్లో బాల్య వివాహాలు విరివిగా ఉండేవి. నాటి పరిస్థితుల్లో కనకమ్మకు 9 ఏళ్ల ప్రాయంలోనే మేనమామ పొణకా సుబ్బిరామిరెడ్డితో వివాహం జరిగింది. వివాహం తర్వాత కనకమ్మ జీవితం పొట్లపూడికి మారింది. సుబ్బిరామిరెడ్డి ఆదర్శ భావాలతో మెలుగుతూ దీనజనుల కోసం తన వంతుగా అప్పటికే కృషి చేస్తున్నారు. అలా, భర్త అందించిన సహకారంతో కనకమ్మ 1906 నుండే సమాజ సేవలో భాగమయ్యారు. సామాజిక దురాచారాలు, స్త్రీ విద్య, జాతీయ సమైక్యత ఇలా వివిధ రంగాలలో కనకమ్మ అవిరాళ కృషి చేశారు.
వందేమాతరం ఉద్యమంలో భాగంగా తెలుగు ప్రాంతానికి వచ్చిన బిపిన్ చంద్రపాల్ స్వయంగా కనకమ్మను కలిసి అభినందించారు. ఆనాటి జాతీయోద్యమ పోరాటం బలపడాలంటే ఐక్యత తప్పనిసరి అని ఆమె భావించారు. మనలోనే ఐక్యత లేనప్పుడు దాస్య శృంఖలాలు దేశాన్ని మరింత పరాధీనత పాలు చేస్తాయని కనకమ్మ అభిప్రాయ పడడమే కాదు దేశంలో మనుషులంతా ఒక్కటే..ఒక్కటిగా ముందుకు కదిలితేనే బానిస సంకెళ్లు చేధించుకోగలమని ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే హరిజనుల కోసం 1913లో తన 21 ఏళ్ల వయసులో సుజన రంజని సమాజాన్ని స్థాపించారు. హరిజనులకు విద్య, వారితో సహపంక్తి భోజనం, హరిజనులకు ఆలయ ప్రవేశం ఇవి సుజన రంజని సమాజం ముఖ్య ఉద్దేశ్యాలు.
కనకమ్మ హరిజనుల కోసమే కాదు, ఆఢపిల్లల చదువు కోసం, వారి ఆర్థిక స్వాతంత్ర్యం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారు. బాలికల విద్య పై అవగాహనా తరగతులు నిర్వహిస్తూ, స్త్రీ విద్య ఆవశ్యకతను వివరిస్తూ సమాజంలో ఎంతో మార్పు తీసుకువచ్చారు. యువతను సైతం చైతన్యవంతం చేసేందుకు వారిలో జాతీయ భావాలు పెంపొందించేందుకు పొట్లపూడి గ్రామంలో వివేకానంద పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పలు గ్రామాల్లో సైతం నెలకొల్పారు. అలాగే, ప్రజలకు ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పలు గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బాలగంగాధర్ తిలక్ ప్రభావంతో కనకమ్మ రహస్య విప్లవోద్యమాన్ని నడిపారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ అనుచరురాలిగా మారి స్వాతంత్ర్యోద్యమంలో పాలు పంచుకున్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడమే కాక ఎందరో మహిళల్ని తన వెంట నడిపించారు. పొట్లపూడిలో కనకమ్మ ఇల్లు స్వాతంత్ర్య సమరయోధులకు, దేశభక్తులకు, సంఘ సంస్కర్తలకు, జాతీయ నాయకులకు, కవులకు, కళాకారులకు, విప్లవకారులకు, ఉద్యమ కేంద్ర బిందువుగా మారడం బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చలేదు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగం పై కనకమ్మను పోలీసులు రెండు సార్లు అరెస్టు చేసి జైలుకు పంపారు.
దేశ నాయకుల చేత విప్లవ కణికగా అభివర్ణించబడిన కనకమ్మ రైతులకు సైతం అండదండలు అందించారు. వారికి సంఘీభావంగా జమీందారీ రైతు పేరిట పత్రికను ప్రారంభింపజేశారు. ఈ పత్రికే ఆ తర్వాత జమీన్ రైతుగా మారింది. కనకమ్మ సాహిత్య రంగంలోనూ, ఆధ్యాత్మిక రంగంలోనూ కృషి చేశారు. ఆమె వంటి మహిళలు చాలా అరుదుగా ఉంటారు. దేశం కోసం, ప్రజల కోసం తన యావత యావదాస్తిని ధారపోసిన మహనీయురాలు కనకమ్మ. తన జీవితం చివరి వరకు ప్రజల యోగక్షేమాలే తన ఊపిరిగా బతికిన కనకమ్మ ……1963 సెప్టెంబర్ 15న తన తన 71 ఏట శాశ్వతంగా కన్నుమూసారు. ఒక తరం తారై రాలిపోయి, రేపటి తరానికి ఆదర్శమయ్యింది.





