
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశసేవ లక్ష్యంగా సాగుతున్నారని, వారి కార్యం భారతదేశానికి ఆశాకిరణమని ప్రముఖ చలనచిత్ర గాయని ఆశా భోస్లే కొనియాడారు. గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్త వికాస వర్గ ముగింపు వేడుకలో పాల్గొనలేకపోయినందుకు చింతిస్తూ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారికి ఆమె రాసిన లేఖలో తమ ఆకాంక్షలను వ్యక్తం చేశారు. ఆశా భోస్లే లేఖ యథాతథంగా…
“మాన్యశ్రీ డాక్టర్ మోహన్ జీ భాగవత్,
ఆర్ఎస్ఎస్ పూజ్య సర్‌సంఘ్‌చాలక్ గారికి
సాదర నమస్కారములతో…
మా ఇంటికి వచ్చి, నన్ను వ్యక్తిగతంగా కలిసి సంఘ శిక్షా వర్గం II ముగింపు కార్యక్రమానికి నన్ను వ్యక్తిగతంగా, అధికారికంగా ఆహ్వానించినందుకు నేను మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని, దేశసేవకోసం తమను తాము అంకితం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ పొందుతున్న స్వయంసేవకులను కలవాలని, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలని నాకు బలమైన కోరిక ఉంది. దీని కోసం నేను మా కుటుంబంతో కలిసి రావాలని అనుకున్నాను. అయితే, ఇటీవల అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్య కారణాల వల్ల నా ఆరోగ్యం ప్రయాణానికి అనుకూలం కాదని డాక్టర్ నాకు సలహా ఇచ్చారు. అందువల్ల, అవసరమైన అన్ని సన్నాహాలు చేసినప్పటికీ, నేను అక్కడికి రావడాన్ని బరువెక్కిన హృదయంతో రద్దు చేసుకుంటున్నాను. మీ మొత్తం కార్యకలాపాల పట్ల నాకున్న సద్భావనను నేను ఇప్పటికే తెలిపాను.
సంఘ్ స్వయంసేవకులు, వారి కార్యం మన దేశ ఉజ్వల భవిష్యత్తుకు గొప్ప మద్దతు, ఆశాకిరణం. సంఘ్ చేసే ఈ పనికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నా సామర్థ్యం మేరకు నా సహకారాన్ని కూడా అందిస్తానని హామీ ఇస్తున్నాను. నా ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అది నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను.
ధన్యవాదములు
ఆశా భోంస్లే
దర్శనాభిలాషి





