News

ఆదివాసీ సామూహిక వివాహాలు

238views

మన్యం వీరుడు అల్లూరి నడయాడిన ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆదివాసీ సామూహిక వివాహాలు జరగడం చాలా ఆనందంగా ఉందని త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు. వికాస తరంగణి–దానధర్మ సంస్థ ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట గ్రామంలో 108 ఆదివాసీ గిరిజన జంటలకు సామూహిక వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 10 వేలమంది పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ నామజపంతో కృష్ణదేవిపేట గ్రామం మార్మోగింది.

చినజీయర్‌ స్వామి నూతన వధూవరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఏనాడూ ఎవరి పెళ్లికి వెళ్లలేదని, ఇలా ఆదివాసీ సామూహిక వివాహాలకు హాజరుకావడం మొదటిసారని చెప్పారు. ఈరోజు శ్రీరాముడు జన్మించిన పునర్వసు నక్షత్రమని, మీరంతా సీతారాముల్లా ఆదర్శంగా దాంపత్య జీవితం గడపాలని ఆశీర్వదించారు. మీ బిడ్డలను దేశానికి, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. వికాస తరంగణి– దానధర్మ సంస్థ ప్రతి జంటకు మూడు గ్రాముల బంగారు మంగళ సూత్రాలు ఉచితంగా ఇవ్వడంలో సంస్థ మాజీ అధ్యక్షులు రమేష్‌గుప్త, మల్లయ్య కృషి ఎంతో ఉందని తెలిపారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన 10 వేలమందికి భోజనాలు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ రేవతమ్మ, గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్‌ఐలు రామారావు, తారకేశ్వర్రావు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.