
పూరీ జగన్నాథునికి రథయాత్రకు ముందు అంటే.. ఈ నెల 11న జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానోత్సవం నిర్వహించటం ఆనవాయితీ. శ్రీమందిరం రత్న వేదిక నుంచి సుదర్శన, బలభద్ర, సుభద్ర, శ్రీజగన్నాథ మూర్తులను స్నాన మండపానికి తరలిస్తారు. ఈ పొహండి కార్యక్రమంలో మూల విరాట్లకు 108 కలశాలతో సుగంధ జలాభిషేకం చేసి, గజానన అలంకారంతో ముస్తాబు చేస్తారు. స్వామివారు బహిరంగ వేదికపై భక్తులకు దర్శనం ఇవ్వడం స్నానోత్సవ విశిష్టత. 15వ శతాబ్దంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక గణపతి భక్తుని అభీష్టం మేరకు జగన్నాథస్వామి గజానన అలంకారంలో దర్శనం ఇస్తున్నట్లు పండితులు చెబుతారు.
స్నానోత్సవంలో స్వామిని చీకటి మండపానికి తరలించి.. పక్షం రోజులు అక్కడే సేవలు నిర్వహిస్తారు. మూలిక ఔషధాలు, తైల మర్దన, పత్యపు నైవేద్యాలు, కషాయసేవనం వంటి ఉపచారాలతో పండ్లు, తేలికపాటి పొడి పదార్థాల్ని నివేదిస్తారు. ఆ 15 రోజులూ జగన్నాథుని మూల విరాట్ రూపం కనుమరుగై.. ప్రతినిధి దేవుళ్ల చిత్ర పటాలు దర్శనమిస్తాయి. అనంతరం స్నాన మండపం నుంచి శ్రీ మందిరం లోనికి మూల విరాట్టును తరలిస్తారు. పక్షం తర్వాత కలిగే స్వామి దర్శనాన్ని నవ యవ్వన ఉత్సవం పేరుతో వేడుక చేస్తారు. ఆరోగ్యమే మహా భాగ్యం అనే సందేశం జగన్నాథుని స్నానోత్సవం వెల్లడిస్తుంది. ఈ కాలంలో వచ్చే వర్షాల వల్ల కలిగే అనారోగ్యాలకు తీసుకోవలసిన జాగ్రత్తలను జగన్నాథుని గోప్య సేవలు, ప్రత్యేక నైవేద్యాలు మానవాళికి సూచిస్తాయి. రాఘవ దాసు మఠం, గోపాల తీర్థ మఠం స్వామివారి ఉత్సవాల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.





