News

బంగ్లా నిరసనల్లో పాక్‌ ఉగ్రవాదులు?

282views

బంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్‌ హసీనా పదవీచ్యుతికి దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో తమ సంస్థ పాలుపంచుకుందని ముంబయి ఉగ్రదాడి సూత్రధారి హాఫిజ్‌ సయీద్‌కు చెందిన జమాత్‌-ఉద్‌-దవా (జేయూడీ) సంస్థ నేతలు పేర్కొన్నారు. జేయూడీ నేతలు సైఫుల్లా కసూరీ, ఐరాస తీవ్రవాదిగా ప్రకటించిన ముజమ్మిల్‌ హాష్మిలు గత వారం చేసిన ప్రసంగాల్లో ఈ విషయం వెల్లడించారు. ‘‘1971లో పాకిస్థాన్‌ను రెండుగా విడగొట్టిన నాటికి నాకు నాలుగేళ్లు. ద్విజాతి సిద్ధాంతాన్ని బంగాళాఖాతంలో కలుపుతానని నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు. 1971 ఘటనలకు నేను మే 10న ప్రతీకారం తీర్చుకున్నాను’’ అని కసూరీ పాక్‌లోని అలహాబాద్‌లో తన అనుయాయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నాడు. ‘‘పహల్గాం ఘటన జరిగినప్పుడు నేను నా నియోజకవర్గంలో ప్రజల్ని కలుస్తున్నాను. భారత్‌ ఆ దాడికి నన్ను సూత్రధారిని చేసింది. నా జన్మస్థలమైన కసూర్‌ పట్టణానికి ప్రపంచ ప్రసిద్ధి కల్పించింది’’ అని కసూరీ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలాలో ప్రసంగించిన ముజమ్మిల్‌ హాష్మీ ‘‘గత సంవత్సరం మేం బంగ్లాదేశ్‌లో మిమ్మల్ని ఓడించాం’’ అని భారత్‌ను ఉద్దేశించి అన్నాడు.