News

ఒంగోలులో అహల్యా బాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకలు

312views

దేశాభివృద్దికి అహల్యా బాయ్ హోల్కర్ చేసిన సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివనారాయణ అన్నారు. అహల్యా బాయ్ హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 500 మంది మహిళలు, బీజేపీ కార్యకర్తలు, వివిధ కళాశాలల విద్యార్దులు ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ నుంచి ప్రారంభమై ర్యాలీ బస్టాండ్ సెంటర్, లంబాడీ డొంక మీదుగా ఆంధ్రకేసరి కళాశాల వరకు సాగింది. అనంతరం ఆంధ్రకేసరి కళాశాలలో అహల్యా బాయ్ హోల్కర్ 300వ జయంతి సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివనారాయణ విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీన అహల్యా బాయ్ హోల్కర్ 300వ జయంతి సందర్భంగా గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇండోర్ మహారాణి అహల్యా బాయ్ హోల్కర్ పాలనా దక్షత, మహిళా సాధికారతకు తీసుకున్న చర్యలు, హిందూ ధర్మ పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమాలు వంటి విషయాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ప్రకాశం జిల్లాలో అహల్యా బాయ్ హోల్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ రమాదేవి మాట్లాడుతూ, మహిళల కోసం 300 సంవత్సరాల కిందటే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన అహల్యా బాయ్ గురించి మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత పది రోజులుగా జిల్లావ్యాప్తంగా అహల్యా బాయ్ హోల్కర్ 300వ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.