News

బంగ్లాదేశ్‌లో యూనస్‌ విధానాలపై ఆగ్రహం

246views

బంగ్లాదేశ్‌లో మహమ్మద్‌ యూనస్‌ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలను ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాయుధ దళాల సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దుష్ప్రవర్తన పేరుతో ప్రభుత్వాధికారులను సులువుగా బర్తరఫ్‌ చేయడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉద్యోగులు, అధికారులు నిరసిస్తున్నారు. సోమవారం వారు సచివాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. ప్రజా సేవల చట్టాన్ని సవరిస్తూ యూనస్‌ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ సిబ్బంది మూడు రోజుల నుంచీ పనులు మానేసి ధర్నా చేస్తున్నారు. అన్ని మంత్రిత్వశాఖలు, ముఖ్యమైన ప్రభుత్వ విభాగాలు కొలువై ఉండే సచివాలయ ద్వారాన్ని మూసివేశారు. మరోవైపు కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఢాకా దక్షిణ నగర కార్పొరేషన్‌ మేయర్‌గా బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీకి చెందిన ఇష్రాక్‌ హుసేన్‌ను నియమించాలంటూ కార్పొరేషన్‌ ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. కోర్టు తీర్పును ఎన్నికల కమిషన్‌ వ్యతిరేకించకపోయినా యూనస్‌ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. హుసేన్‌ మేయరు పదవి చేపట్టకుండా అడ్డుకుని పాలనాధికారిని నియమించింది.

యూనస్‌ ప్రభుత్వ విధానాలపై బంగ్లాదేశ్‌ వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య కూడా ఆదివారం పాత్రికేయుల సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 1971 బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధ సమయంలో మేధావులను హతమార్చినట్లే నేడు వ్యాపారులను చంపుతున్నారని ప్రముఖ వ్యాపారవేత్త షౌకత్‌ అజీజ్‌ రసెల్‌ తెలిపారు. బంగ్లాకన్నా వియత్నాంలో వ్యాపారం చేయడం లాభదాయకమని భావించి విదేశీయులు అక్కడే పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. బంగ్లా పౌరులకు ఉద్యోగాలు లేక.. కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని బంగ్లా జౌళి మిల్లుల సంఘం అధ్యక్షుడు కూడా అయిన రసెల్‌ వివరించారు. ఈద్‌ ఉల్‌ అధా పండగకు కార్మికులకు జీతాలు ఎలా చెల్లించాలో తమకు అర్థం కావడం లేదని వాపోయారు.

ఈ డిసెంబరుకల్లా దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిపించాలని గతవారం యూనస్‌ను కలిసిన త్రివిధ దళాధిపతులు డిమాండు చేశారు. రాఖైన్‌ కారిడార్‌ ఏర్పాటుపైనా అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ ప్రధాన రేవు అయిన ఛట్టోగ్రామ్‌ రేవు నిర్వహణను విదేశీ సంస్థకు అప్పగించాలనే యోచనపైనా, ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ సర్వీసుపైనా బంగ్లా ప్రధాన సైన్యాధికారి వకారుజ్‌ జమాన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టార్‌ లింక్‌తో బంగ్లా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.