
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌లో షాహీ జామా మసీదు-హరిహర దేవాలయ వివాదానికి సంబంధించి మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టాలంటూ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన రివిజన్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. మసీదు స్థలంపై భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ)తో సర్వే చేయించాలని సివిల్ కోర్టు గతంలో ఆదేశించింది. సంభల్‌లో విష్ణు అవతారమైన కల్కి ఆలయం ఉండేదనీ, మొగల్ చక్రవర్తి బాబర్ కాలంలో అంటే క్రీ.శ 1526లో దాన్ని కూలగొట్టి జామా మసీదును నిర్మించారని హరిశంకర్ జైన్ అనే న్యాయవాదితోపాటు మరి ఏడుగురు సంభల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టులో దావా వేశారు. అప్పట్లో ఏఎస్‌ఐ సర్వేకి కోర్టు ఆదేశించింది. సర్వేని వ్యతిరేకిస్తూ నిరుడు నవంబర్ 24న స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ అల్లర్లలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో సివిల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సర్వేకి వ్యతిరేకంగా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చేవరకు సివిల్ కోర్టు కేసు విచారణలో ముందుకు సాగకూడదని తేల్చింది. చివరకు హైకోర్టు మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సంభల్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.





