News

విజయనగరానికి ఎన్‌ఐఏ బృందం

320views

ఉగ్రవాద మూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. లోతుగా దర్యాప్తు చేస్తోంది. పేలుళ్ల కుట్రకు వ్యూహం పన్నిన విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌(29), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ సమీర్‌ (28)పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, బీఎన్‌ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. నిందితులకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో సోమవారం విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. వారిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ వేశారు. సాంకేతిక అంశాలపై న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

సామాజిక మాధ్యమాల వేదికగా పరిచయాలు
విశ్వసనీయ కథనం ప్రకారం.. విజయనగరం నుంచి హైదరాబాద్‌ వెళ్లిన సిరాజ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ సహా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు పరిచయమయ్యారు. సమాజంలోని ఓ వర్గానికి అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం జరగాలంటే ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత వారు హైదరాబాద్, ముంబయి, దిల్లీ సహా పలు ముఖ్య పట్టణాలకు వెళ్లి కొందరిని కలిసి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ కార్యకలాపాలు బయటకు పొక్కకుండా సిగ్నల్‌ యాప్‌లో సిరాజ్‌ బృందం ప్రత్యేకంగా ఒక గ్రూపును ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అందులో మాట్లాడుకుంటూ ఏడాదిగా కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ప్రత్యేక నిఘాతో అరెస్టు చేసిన తర్వాత వీరిద్దరి సెల్‌ఫోన్లనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ద్వారా మూలాలు తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఎవరెవరు ఉన్నారు? వారెక్కడి వారు? వీరితో లింకు ఎలా కలిసిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

విలువైన సమాచారం రాబట్టేలా..
ఎన్‌ఐఏ అధికారుల బృందం సోమవారం విజయనగరం చేరుకుంది. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావుతో చర్చించింది. సిరాజ్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత జరిపిన విచారణలో వెల్లడైన అంశాలు, రిమాండు రిపోర్టును పరిశీలించింది. ఉగ్ర మూలాలు విదేశాల వరకూ ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు. వీరికి ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందిందో నిర్ధారించుకునేందుకు వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించారు.నిందితుల కస్టడీ లభిస్తే విచారణ అనంతరం ఈ కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది.

పరిచయాలతో పక్కదారి..
సిరాజ్‌ తండ్రి పోలీసు శాఖలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తన కుమారులిద్దరినీ కూడా పోలీసు అధికారులుగా చూడాలనుకున్నారు. అయితే ఏడేళ్ల క్రితం ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన సిరాజ్‌ విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని ఓ కంపెనీలో నాలుగు నెలలు పనిచేశాడు. తర్వాత హైదరాబాద్‌ వెళ్లి 2018 నుంచి 2022 వరకు ఎస్సై కావాలని శిక్షణ పొందాడు. కానీ ఎంపిక కాలేకపోయాడు. గ్రూప్‌-2 కోసం రెండు సార్లు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలోనే హైదరాబాద్‌ బోయగూడకు చెందిన సమీర్, అతడి ద్వారా వరంగల్‌కు చెందిన ఫర్హాన్‌ మొయినుద్దీన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బాదర్‌తో పరిచయం ఏర్పడింది. వీరు పలుసార్లు ఖిలావత్, జిహాదీపై చర్చించుకున్నారు. అల్‌-హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లమీన్‌ (ఏహెచ్‌ఐఎం) పేరుతో దేశవ్యాప్తంగా గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా 2024 నవంబరు 22న ముంబయి వెళ్లి సుమారు 10 మందిని సిరాజ్‌ కలిసి చర్చించాడు. ఈ ఏడాది జనవరి 26న దిల్లీలో పలువురిని కలిసేందుకు వెళ్లినా వారు అందుబాటులో లేకపోవడంతో తిరిగొచ్చేశాడు. మరుసటి రోజు మండోలి వెళ్లి సల్మాన్‌ఖాన్‌ అనే వ్యక్తిని కలిసి హైదరాబాద్‌ చేరుకున్నాడు. సౌదీలో ఉండే బిహారుకు చెందిన అబు ముసాబ్‌తో సమీర్, సిరాజ్‌లు సిగ్నల్‌ యాప్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి బాంబులు తయారు చేయాలని నిర్ణయించాడు. వాటిని జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతంలో పేల్చాలని భావించాడు. ఈ ప్రయత్నంలోనే పోలీసులకు పట్టుబట్టాడు. ఒక ట్యాబ్, అల్యూమినియం పొడి, పొటాషియం నైట్రేట్, సల్ఫర్‌ పొడి, పీవీసీ గమ్‌ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.