
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్‌లో భాగంగా జూన్ 8న ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి -ISS పయనం కానున్నారు. ఈ మేరకు యాక్సియం స్పేస్, నాసా ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. వాస్తవానికి మే 29వ తేదీకే ఈ మిషన్‌ను షెడ్యూల్ చేయగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో వచ్చే నెలలో ప్రయోగం చేపట్టనున్నారు.
భారత కాలమానం ప్రకారం జూన్ 8వ తేదీ సాయంత్రం 6.41 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు) ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు రోదసిలోకి దూసుకెళ్లనున్నారు. ఈ యాత్రలో శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) కూడా వెళ్లనున్నారు. వీరు రెండు వారాల పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండి పరిశోధనలు చేయనున్నారు.
భారత్‌కు చెందిన ఓ వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి వెళ్తుండటం నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడే. 1984లో మన వ్యోమగామి రాకేశ్ శర్మ.. రష్యా వ్యోమనౌకలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ఇక, తాజాగా శుభాంశు శుక్లా పాల్గొంటున్న మిషన్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత రోదసి పరిశోధన సంస్థ-ISROలు సంయుక్తంగా చేపడుతున్నాయి.
రోదసిలో శుభాంశు శుక్లా ఏడు ప్రయోగాల్లో పాల్గొంటారు. అంతరిక్షంలో పంటల సాగు, టార్డిగ్రేడ్ (నీటి ఎలుగుబంటి)ల గురించి అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా భారతీయ ఆహారంతో ముడిపడిన పంటలపై ప్రయోగాలను చేపట్టడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధంచేసింది. మెంతి, పెసల మొలకలపై పరిశీలన వంటివి ఇందులో ఉంటాయి. వాటిని భూమికి తీసుకొచ్చి.. నేలపై ఎలా ఎదుగుతాయన్నది పరిశీలిస్తారు.




