ArticlesNews

వేంకటేశుని సేవలో వెంగమాంబ

54views

( మే 11 – తరిగొండ వెంగమాంబ జయంతి )

శ్రీవేంకటేశ్వరుని పాదసేవకే జీవితాన్ని అంకితం చేసుకున్న భక్తశిరోమణి తరిగొండ వెంగమాంబ. అన్నమయ్య మార్గాన్ని అనుసరించి ఆపదమొక్కులవాడిని అద్భుత సంకీర్తనలతో అర్చించిన విదుషీమణి ఆమె. చితూర్తు జిల్లా వాయల్పాడు సమీపాన తరిగొండలో జన్మించిన వెంగమాంబలో చిన్నతనంలోనే భక్తి బీజం నాటుకుంది. అలా ఆమె నరసింహ స్వామి భక్తురాలైంది. బాల వితంతువుగా మారాక ఆమె పారమార్థిక మార్గాన్ని ఎంచుకుంది. ఆధ్యాత్మిక సాధనలతో విశిష్ట యోగినిగా పరిణమించింది. వైధవ్యం వల్ల స్వగ్రామంలో ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేక తరిగొండ నుంచి అరణ్యమార్గంలో తిరుమల చేరుకుంది. ఆనందనిలయంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని దర్శించి పులకించిపోయింది. ఆ తన్మయంతో ‘వేంకటాచల మాహాత్మ్యం’ రచించింది. స్వామి సేవ, భక్తిరచనలతో కాలం గడపసాగింది. శ్రీనివాసుని భక్తుడైన హాథీరామ్‌బాబా శిష్యులు తిరుమల కొండపై ఆలయానికి సమీపంలోనే ఆమెకి నివాసస్థలం ఏర్పాటుచేశారు. అక్కడ వెంగమాంబ పూలమొక్కలను పెంచింది. నిత్యం పూలమాలలు, తులసిదండలు తీసుకెళ్లి స్వామికి సమర్పించేది.

ఒకరోజు వెంగమాంబ తులసికోట తిన్నెపై ఒంటికాలిపై నిలబడి, ఆనందనిలయ శిఖరాన్ని చూస్తూ తన్మయురాలైంది. శ్రీనివాసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడిగా భావిస్తూ ఆశువుగా ‘శ్రీవేంకటేశ్వర కృష్ణమంజరి’ అనే స్తోత్రాన్ని గానం చేసింది. అలాగే విష్ణుపారిజాతం తదితర యక్షగానాలు, అష్టాంగయోగం, వాశిష్ఠ రామాయణ ద్విపదకావ్యం, తత్త్వకీర్తనలు రచించింది. గానంతో, రచనలతో, యోగధ్యానాది సాధనలతో ఆధ్యాత్మికోన్నతి కోసం ప్రయత్నించింది. వెంగమాంబ ప్రాభవం అన్నమయ్య వంశీకుల వరకూ వెళ్లింది. ఆమె భక్తితత్పరతను గుర్తించి వాళ్లు వెంగమాంబను ఆహ్వానించి తిరుమలలో వరాహస్వామి ఆలయం వెనుక తమ నివాసంలో కొంతభాగాన్ని ఆమెకు కేటాయించారు. వెంగమాంబ తిరుమల వచ్చినప్పటి నుంచి, రోజూ సాయంకాలం స్వామి ఏకాంతసేవ సమయానికి ఆనంద నిలయానికి చేరుకునేది. శ్రీనివాసుడికి స్వయంగా కర్పూరహారతి ఇచ్చేది. దీన్నే ముత్యాలహారతి, తరిగొండవారి హారతి అంటారు. తిరుమలలో నేటికీ రాత్రి చిట్టచివరగా ఏకాంతసేవలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు జోలపాటలు పాడుతుండగా, తరిగొండ వెంగమాంబ ఆరంభించిన ముత్యాల హారతిని స్వామివారికి సమర్పిస్తారు. తర్వాత ఆనందనిలయ బంగారు వాకిళ్లు మూసేస్తారు. అందుకే ‘తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి’ అనే నానుడి ఏర్పడింది.