
(మే 11 – మాతృదినోత్సవం)
పొత్తిళ్లలోని పసిపాప సైతం నోరారా పిలవగలిగేంత లలితమైన పదం అమ్మ. ఇంత సరళమైన పదం అనంత మమకారాన్ని తనలో ఇముడ్చుకుంది. పాలకడలిలో శేషతల్పంపై పవళించే జగదేకప్రభువు కూడా అమ్మకోసం బాలుడై తరలి రావాల్సిందే. అమ్మ ఒడిలో దొరికే చల్లదనం, ఆమె ప్రేమ మాధుర్యంలో ఉండే మహిమ, ఆమె తినిపించే గోరుముద్దలో దాగిన అమృతం అంత మహత్తరమైనవి. అడగకుండానే పిల్లల అవసరాలను తీర్చగలిగే అమ్మ.. వారి మనసులోని వేదనకు స్వాంతన చేకూర్చగలదు, లాలించగలదు. గత జ్ఞాపకాలే మెట్లుగా బంగారు భవితే లక్ష్యంగా వర్తమానపు వారధిగా చిటికెన వేలు ఊతమిచ్చి తోడు నడిచేదే అమ్మ.
భువనభాండాలను పొట్టలో మోసే దామోదరుణ్ణి సైతం రోటికి కట్టేయగలిగింది యశోదమ్మ. అనసూయగా సృష్టికర్తకు జోలపాడి లాలించింది. బెజ్జమహాదేవిగా శివుణ్ణి తన బిడ్డగా భావించి, ఆయన ప్రతిమను చేయించింది. ఆ ముక్కంటికే లాలపోసి ముక్కొత్తి, కన్నొత్తి ముక్కన్ను పులిమింది. (నుదుటి మీద మూడో కంటిని దిద్దింది) కంటేనే అమ్మ అని అనలేం. పెంచినా, ప్రేమ పంచినా అపురూపమైన అమ్మే మరి.
పుత్రకామేష్టి యాగం సఫలమైంది. దశరథునికి పుత్రోదయమైంది. ఒక్కొక్కరు వారి వారి విలక్షణ విశిష్టతలతో రాజమందిరాన్ని పులకింపచేస్తున్నారు. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు అన్యోన్యంగా పరస్పర ప్రేమాదరాలతో మెలగటంలో సుమిత్ర పాత్ర అద్వితీయం. మంధర మాయలో పడి రాముడి వనవాసాన్ని కాంక్షించింది కైక. సీతారాముల శ్రేయస్సుకై లక్ష్మణుని తోడు పంపింది సుమిత్ర. తప్పొప్పులను ఎంచుకోవటంలో, బంధాలను నిలబెట్టుకోవటంలో తన పిల్లలకు మార్గనిర్దేశం చేసింది. కుటుంబ మాలికకు తల్లి పాత్ర దారం వంటిదని నిరూపించింది.
ధర్మాన్ని ప్రబోధించిన కుంతీదేవి
ధర్మ పరిరక్షణ, ఔదార్యం, సచ్ఛీలత, శౌర్యం, విద్య, వినయం, ఐక్యత.. ఇలా అన్నింటిలో పంచపాండవులకు వేరెవరూ సాటిరారు. ఆనాటి సమాజ నీతీరీతులకు అనుగుణంగా వారినలా పెంచగలగటం లోకజ్ఞురాలైన కుంతికే చెల్లింది. అజ్ఞాతవాసం వంటి బలహీన పరిస్థితుల్లో సైతం ధైర్యస్థైర్యాలతో ధర్మమార్గంలోనే ముందడుగు వేసేలా వారిని ప్రేరేపించింది.
విఫలమైన గాంధారి
శతసుతదాయినిగా వరం పొందిన గాంధారిని కురుసామ్రాజ్యం కోడలిని చేసుకుంది. తద్వారా వంశం వృద్ధి చెందింది. ఆ సంతానం పట్ల అవ్యాజ ప్రేమ ధృతరాష్ట్రుణ్ణి మరింత అంధుణ్ణి చేయగా.. గాంధారి మాత్రం సుయోధనుడితో యుద్ధం విరమింపచేయాలని, దుష్టసహవాసం మాన్పించాలని ప్రయత్నింది. అంతేతప్ప పుత్రుడేం చేసినా సమర్థించలేదు. కొడుకు అయినా, సామ్రాట్టు అయినా ధర్మం తప్పకూడదనే తాపత్రయం ఆమెది.
ధీరమాత సీత
సీత, సహనశీలి. రాజ్య శ్రేయస్సు కోసం తాను ఒంటరై, తనను ఒంటరిగా మార్చిన రాముడి ఆజ్ఞను మన్నించిన ధీరవనిత. లవకుశులకు వాల్మీకి మహాముని సాయంతో సకల శాస్త్రాలూ, యుద్ధవిద్యలూ నేర్పించగలిగింది. వాటితోపాటు విచక్షణతో కూడిన ప్రశ్నించే తత్వాన్నీ అలవరచింది. ్చతద్వారా లోక శ్రేయస్సుకు బీజం వేసింది.
భంగపాటు కుంగుబాటుల్ని జయించింది కణ్వమహర్షి ఆశ్రమంలో పెరిగిన అందాల భరిణ శకుంతల. ప్రకృతే అమ్మగా మారి లాలించిందామెని. కాలం గిర్రున తిరిగింది. యవ్వనవతిగా మారిన శకుంతలను ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకున్నాడు దుష్యంత మహారాజు. గర్భం దాల్చిన శకుంతలను భర్త చెంతకు చేర్చాలనుకున్నాడు కణ్వమహర్షి. కానీ దూర్వాస మహర్షి శాప ఫలితంగా సర్వం మరిచాడు రాజు. నిస్సహాయస్థితిలో తిరిగి రుష్యాశ్రమానికి చేరిన ఆమె కుంగుబాటు నుంచి బయటపడి పుత్రుడు భరతుణ్ణి సర్వశ్రేష్టుడిగా మలచటంలో సఫలీకృతురాలైంది.
శపించిన తండ్రిని బతికించిన పుత్రుడు
ఉద్దాలక మహర్షి పుత్రిక సుజాతకు, తన శిష్యుడు కహోధరునితో వివాహం చేశాడు. ఆమె గర్భంలోని శిశువు మహా చురుకైనవాడు. ఆ దశలోనే తండ్రి నోట వచ్చే అపస్వరాలను నిరసించేవాడు. ఆ ప్రతిఘటనను ఓర్వలేని తండ్రి- గర్భస్థ శిశువును అష్ట వంకరలతో పుట్టమని శపించాడు. జనక మహారాజు తరచూ విద్వత్సభలు నిర్వహించేవాడు. జ్ఞానార్జనే కాకుండా దక్షిణ కూడా లభించేదక్కడ. కుటుంబ అవసరాలు తీరే మార్గం కోసం జనకుడి వద్దకు చేరాడు కహోధరుడు. ఆ సమయంలో దుష్టత్వానికి ప్రతిరూపమైన భండుడనే విద్వాంసుడు- తన చేతిలో ఓడిన పండితులను వరుణుడికి దానమివ్వసాగాడు. విధివశాత్తూ కహోధరుడు ఓటమిపాలయ్యాడు. భర్త తిరిగి రాని లోకానికి వెళ్లాడని తెలిసిన సుజాత తనయుడి వద్ద బేలగా మారక నిబ్బరంగా వ్యవహరించింది. పుట్టిల్లు చేరి.. పుత్రునికి వేదశాస్త్రాలను అందించింది. తండ్రి గతించిన విషయం పొరపాటున కూడా తనయునికి తెలియనివ్వలేదు. పెరిగి పెద్దవాడైన అష్టావక్రుడు భండుని ఓడించి ప్రతిగా వరుణుని చేరిన అందరినీ తిరిగి బతికించాడు. అష్టావక్రుడి విద్వత్తుకు మెచ్చిన భండుడు- ఒకసారి నదిలో మునగమన్నాడు. ఆ వెంటనే పరిపూర్ణ ఆరోగ్య యవ్వనవంతుడయ్యాడు. ఘోర కష్టాలకు సైతం చలించని సుజాత మనోనిబ్బరం తమ వంశోద్ధరణకే కాక మరెందరో పునర్జీవులవడానికి దోహదపడింది.
గర్భస్థ శిశువులు కూడా అన్నిటినీ ఆకళింపు చేసుకోగలరని అభిమన్యుడి పద్మవ్యూహం వంటి ఉదంతాలు పురాణాల్లో ఉన్నాయి. అందుకే సీమంతం వేడుకతో కాబోయే తల్లి పరిసరాలను ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంచాలని సూచించారు పెద్దలు. పిల్లలకు తల్లే తొలి గురువు. ఉన్నత వ్యక్తిత్వంతో శివాజీని తీర్చిదిద్దిన జిజియాబాయి ఎన్నటికీ చిరస్మరణీయురాలే. ‘నా ప్రియమైన సోదర సోదరీమణులారా..’ అంటూ విదేశీయుల్ని సైతం తన భ్రాత్రుత్వ భావనలో ఓలలాడించిన నరేంద్రుని పెంచిన భువనేశ్వరీదేవి ధన్యజీవి. అలాంటి అమ్మలు మనకు ఆదర్శం. అలాంటివారిని ఆదర్శంగా భావిస్తూ ఇటు కుటుంబ, అటు సమాజ హితం కోరుతున్న తల్లులకు మాతృదినోత్సవ శుభాభినందనలు.