ArticlesNews

నరహరీ…భయహారీ

52views

( మే 11 – నృసింహ జయంతి )

శ్రీమహావిష్ణువు దశావతార క్రమంలో నాలుగోది నృసింహ అవతారం. ప్రహ్లాద రక్షణ, హిరణ్యకశిపుని శిక్షణ లక్ష్యాలుగా ఆ దేవదేవుడు నరసింహుడిగా దిగివచ్చాడు. ఆయన అవతారమూర్తే కాదు మంత్రమూర్తి కూడా! పురాణాలతో పాటు ఉపనిషత్తుల్లోనూ నరసింహస్వామి ప్రస్తావన కనిపిస్తుంది. శ్రీవేంకటేశ్వరుడు చతుర్ముఖ బ్రహ్మతో ‘నేనే అహోబిలంలో నరసింహుడిగా ఉన్నాను’ అని ప్రకటించినట్లు పురాణ కథనం. అందుకే తిరుమల కొండపై కొలువైన యోగనరసింహమూర్తికి అర్చనలు, ఆరాధనలు చేస్తారని చెబుతారు. వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం తిరుమల శ్రీనివాసునికి ఇలవేల్పు శ్రీలక్ష్మీనరసింహస్వామి. శ్రీవారి ఆలయంలోనూ ‘సన్నిధి నృసింహస్వామి’గా ఆయన పూజలందుకుంటున్నాడు. అలిపిరి మార్గమధ్యంలో ‘త్రోవ నరసింహస్వామి’గా భక్తులు ఏడుకొండలపైకి అనాయాసంగా నడచివెళ్లే శక్తిని ప్రసాదిస్తున్నాడు.

కారుణ్యం, వీరత్వం మూర్తీభవించిన నరహరి ఆకారం ఎంత భీకరమో, మనసు అంత భక్తవశీకరం. నృసింహ ఆరాధన, నామస్మరణలు శక్తిమంతమైనవి. పురాణాల్లోని ప్రహ్లాదుడే కాదు చారిత్రక పురుషులైన శంకరాచార్యులు, రాఘవేంద్రులు, నారాయణ తీర్థులు, భక్తజయదేవుడు, అన్నమయ్య, త్యాగయ్య తదితర భక్తపుంగవులు కూడా నరసింహమూర్తిని ఉపాసించి విశేష ఫలితాల్ని పొందారు. శేషప్పకవి ఆ స్వామిని ఆరాధించి ప్రాప్తించిన కవితాశక్తితో నృసింహశతకం రచించాడు. నృసింహ గాయత్రి, నృసింహ మంత్రాలు, స్తోత్రాలు మానసిక, శారీరక రోగాలను నివారిస్తాయని భక్తుల విశ్వాసం. కనుకనే తెలుగునేల నలుదిశలా నరసింహాలయాలు వెలసాయి.

నరసింహస్వామి కొలువైన కొండలను వేదగిరి, వేదాద్రి అని పిలవటం పరిపాటి. వేదాలను ఉద్ధరించిన అవతారం నరసింహ మూర్తి కాదు. ఈ అవతారంలో హిరణ్యకశిపుడి వధ, ప్రహ్లాద రక్షణ ప్రధానమైనవి. అయితే ఆ స్వామి అభయాన్ని అనుగ్రహిస్తాడు. కర్మ విమోచన మార్గాన్ని తెలిపి ‘అభయ ప్రదానం’ చేసేది వేదం. కనుక ఒకే పనిని నిర్వహిస్తున్న వేదానికి, నరసింహునికి అభేదం అనుకోవచ్చని నృసింహ ఉపాసకులు చెబుతారు. ‘నరసింహ స్వామి కథను విన్నా, చదివినా భయాలు లేని లోకం ప్రాప్తిస్తుంది’ అని నారదుడు ధర్మరాజుతో చెప్పాడు. నరసింహకథ, ప్రహ్లాద చరితాలను స్మరిస్తే పునర్జన్మ ఉండదని భాగవతంలో స్వామే స్వయంగా అభయమిచ్చాడు. వైశాఖమాస శుక్లపక్ష చతుర్దశి నృసింహ జయంతి.