ArticlesNews

సామాజిక జాగృతికే కోజాగిరి

459views

కోజాగిరి – కోన్ జాగిరి – ఎవరు మేల్కొంటారు? – విదేశీ దండయాత్రలు, ముస్లిం మూకల దాడుల సమయంలో గ్రామాలలోని యువకులు వంతులవారీగా మేల్కొని గ్రామానికి కాపలా కాసేవారు. ఎవరైనా ముష్కరులు ఊర్లోకి వస్తున్నారంటే వారితో కలబడేవారు. ఊరిలోని వారిని మేల్కొల్పే వారు. అలా మొదలైంది ఈ కోజాగిరి.

– దానికి గుర్తుగా పవిత్ర కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులో ఆటపాటలతో ఉత్సాహంగా కార్యక్రమాలు జరుపుకునే ఆనవాయితీ ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపిస్తుంది.

– కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులో పాలని కాచుకుని సేవిస్తే చంద్రుని కిరణాలు తాకిన ఆ పాల కారణంగా దివ్యమైన శక్తి, తేజస్సు లభిస్తాయని విశ్వాసం.

– సమాజ రక్షణ కోసం అందరం జాగరూకులై ఉండాలన్న సందేశాన్ని ఇస్తుంది కోజాగిరి. అందుకే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆ సామాజిక ఉత్సవాన్ని స్వీకరించింది.

– పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా లాంటి పొరుగు దేశాలు అదను కోసం కాచుక్కూర్చున్నాయ్. సరిహద్దుల ఆవల నుంచే కాదు మన సరిహద్దుల లోపల కూడా అశాంతిని రగిలిస్తున్నాయి. నిరంతరం కంటికి కనిపించని యుద్ధం చేస్తున్నాయి.

– వాసిలో తక్కువైన తన ఉత్పత్తులను భారత విపణిలో వదలడం ద్వారా భారతీయ పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వ్యవస్థలను కబళించాలని చూస్తున్నది చైనా.

– Regional comprehensive economic partnership (RCEP) ప్రాంతీయ దేశాల సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా అతి తక్కువ దిగుమతి సుంకంతో  చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల ఉత్పత్తులను భారత్లోకి దిగుమతి చేసుకోవాలని కొందరు భారత అధికారులు ప్రయత్నించారు.

– అయితే దీనివల్ల పాడి పరిశ్రమపై ఆధారపడిన 10 కోట్ల మంది భారతీయులు ఉపాధి కోల్పోతారని, దేశీయ ఉత్పత్తులను దెబ్బతీసి 90 శాతం చైనా ఉత్పత్తులే భారత విపణిని ఆక్రమిస్తాయనీ, తద్వారా దేశీయ పారిశ్రామిక సంస్థలను మూసివేయవలసి వస్తుందని, విదేశీ మారక నిల్వలు పడిపోతాయని, తద్వారా చిన్న మదుపరుల పెట్టుబడులతో నడుస్తున్న మన దేశ ఆర్థిక వ్యవస్థ కుంటు పడుతుందనీ స్వదేశీ జాగరణ్ మంచ్ దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించడంతో ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ఒప్పందం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంది.

– బంగ్లాదేశ్… రోహింగ్యాలు / అక్రమ చొరబాటుదారుల ముసుగులో మన దేశంలోకి తీవ్రవాదులను చొప్పిస్తోంది. అక్రమ చొరబాటుదారుల ముసుగులో జమాత్ – ఉల్ – ముజాహిదీన్(JUM) అనే తీవ్రవాద సంస్థ కార్యకర్తలు మనదేశంలో చొరబడుతున్నారని ఎన్ఐఏ తన నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే బీహార్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలలో JUM తన కార్యకలాపాలను విస్తరించిందని కూడా ఎన్ఐఏ తన నివేదికలో పేర్కొంది.

– చొరబాట్ల ద్వారా అయితేనేమి, అధిక సంతానం ద్వారా అయితేనేమి తమ ప్రాబల్యాన్ని, సంఖ్యను పెంచుకోవడం, అనంతరం స్థానికులపై దాడులు చేయడం, భయ బ్రాంతులకు గురి చేయడం, వారి ఆస్తులను ఆక్రమించడం వారికి రివాజు.

– అనేక పాశ్చాత్య దేశాలు కూడా ప్రస్తుతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మనదేశంలో కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ఇలా అనేక రాష్ట్రాలలో ముస్లిములు అధిక సంఖ్యాకులైన చోట్ల హిందువులు ఈ సమస్యను అనుభవిస్తున్నారు.

– ఇక పాకిస్థాన్ సంగతి చెప్పనక్కర్లేదు. దేశంలో ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ అలజడులు సృష్టించేందుకు సదా సిద్ధం.

– దొంగనోట్ల ముద్రణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం. మన దేశంలోని వారికి డబ్బులు ఇచ్చి మన దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం, అయిన దానికీ కాని దానికీ ఉద్యమాలు చేయించడం, మన సైన్యం, పోలీసుల పైననే రాళ్లు వేయించడం వంటి ఎన్నో అకృత్యాలకు పాక్ పాల్పడుతోంది.

– కాశ్మీర్లో అల్లర్లను ప్రేరేపించి, నడిపించే వేర్పాటువాద నాయకులకు పాక్ హై కమిషన్ నుంచి నిధులు అందుతున్నాయన్న విషయాన్ని NIA ధృవీకరించింది.

– ఇక పర్యావరణ పరిరక్షణ ముసుగులోనో, మూఢాచారాల ముసుగులోనో, ఆధునీకరణ, స్త్రీల హక్కుల పరిరక్షణ తదితర పేర్లతో హిందూ సంస్కృతి, ఆచారాలపై, హిందూ కుటుంబ వ్యవస్థపై, సమాజంపై జరుగుతున్న నిరంతర విష ప్రచారం, దాడి ఇంకో ఎత్తు.

-“గోవు మాకు తల్లి” అని మనమంటాం. అంటే మీ నాన్న ఎద్దా? అంటాడొకడు. “అతి చిన్న అణువులో, పరమాణువులో అంతర్గతంగా చైతన్య శక్తి దాగి ఉంటుంది” అని సైన్సు కూడా అంగీకరిస్తుంది. మనం కూడా రాయిలో, రప్పలో దాగివున్న అనంత చైతన్య శక్తే విశ్వమంతా నిండి ఉన్నదని నమ్ముతున్నాం. ఒక చిన్న పరమాణువులో ఏ స్వరూపము (కేంద్రకము, దీర్ఘ వృత్తాకార కక్ష్యలు) ఉంటుందో విశ్వమంతా అదే స్వరూపము, ఆకృతితో ఉంది. దానినే అండ, పిండ, బ్రహ్మాండములు అన్నారు మన పెద్దలు. అందుకే మనం రాతిలో ఇమిడివున్న చైతన్య శక్తిని (జీవాత్మని) ఆరాధిస్తాం. కానీ మీరు రాళ్ళను పూజించే అనాగరికులంటాడొకడు.

– ఏడాదికొకసారి మన పండగొస్తుంది. మీ పండగ వల్లే పర్యావరణం నాశనమైపోతోందంటూ రోదన మొదలు. అరె ఏడాది పొడవునా పరిశ్రమల ద్వారా, వాహనాల ద్వారా, మన ఇళ్ళ నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల జరిగే కాలుష్యం మాటేమిటి? ప్రకృతి హితాన్ని మరచి మనం విచ్చలవిడిగా పోగేస్తున్న వ్యర్ధాల మాటేమిటి? మన పండుగ నాడే ప్రకృతి హితం గుర్తుకొస్తుంది కొందరికి. దానికి కోర్టులు, చట్టాలు అబ్బో ఎన్ని దెబ్బలు కొట్టారో?

– కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు, జల్లి కట్టు ఇవన్నీ హైందవ సంస్కృతిలో భాగాలు. వీటిపై జంతు ప్రేమికులకి ఎన్నో అభ్యంతరాలు. కానీ వందల, వేల సంఖ్యలో కసాయి అంగళ్ళలో హతమైపోతున్న మూగజీవాల గురించి ఎవరికీ ఆందోళన లేదు.  ఎవరూ దాని గూర్చి పల్లెత్తు మాటనరు. అదే కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు, జల్లి కట్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. సినిమాల్లో, టీవీల్లో ఇదంతా అనాగరికమని పని గట్టుకుని ప్రచారం చేస్తారు. మళ్ళీ కోర్టుల ప్రవేశం. న్యాయమూర్తుల ఏకపక్ష తీర్పులు. దీని వెనుక హిందూత్వాన్ని క్షీణింపజేసి, క్రైస్తవాన్ని బలోపేతం చేసే అంతర్జాతీయ కుట్ర దాగివున్నది. తెలిసో, తెలియకో ఆ ప్రచారంలో పాలు పంచుకున్న, పంచుకుంటున్న వారందరూ ఆ కుట్రలో భాగాస్వాములే. కమ్యూనిష్టులందరూ ఈ కుట్రలో భాగాస్వాములవుతున్నారు. కళాశాలల్లో, విశ్వ విద్యాలయాలలో, సినిమాలలో, టీవీలలో పనిగట్టుకుని హిందూత్వంపై బురదజల్లి యువతను పెడత్రోవ పట్టిస్తున్నారు. హిందూ ఆచారాలను, మూఢాచారాలంటూ విమర్శించే కమ్యూనిష్టులు క్రైస్తవుల స్వస్థత కూటములపై నోరు మెదపరు.

– ఇలా ఇంటా బయటా హిందూత్వానికి, భారత దేశానికి పొంచి ఉన్న ప్రమాదాలెన్నో. ఇలాంటి విచ్చిన్నకర శక్తులను ఎదుర్కోవాలంటే హిందువు నిరంతరం జాగరూకుడై ఉండాలి. దేశ విద్రోహ శక్తుల పన్నాగాలను చిత్తు చెయ్యాలి. మనలోని కుల, వర్గ, ప్రాంత, భాషా భేదాలను, వైషమ్యాలను తొలగించుకుని గుండె గుండెలో భారతమాత గుడి కట్టాలి.

– అయోధ్య తీర్పు తర్వాత ప. పూ సర్ సంఘచాలక్ జీ ఒక మాటన్నారు. సంఘం వ్యక్తులను నిర్మాణం చేస్తుంది అని. అవును సంఘం గత 94 సంవత్సరాలుగా వ్యక్తి నిర్మాణం చేస్తోంది. సంఘలో తయారైన వ్యక్తులు నేడు వివిధ రంగాలలో దేశాభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. దేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడానికై అహర్నిశలూ కృషి చేస్తున్న ఆ ఆధునిక ఋషి పుంగవులను సంఘం నిర్మించింది. అందుకు సంఘం చేసిన పని అతి సామాన్యమైనది. ఆట పాటల ద్వారా వారి గుండెలలో భారతమాతకు గుడి కట్టింది.

– మన చరిత్రను వక్రీకరించారు. మన ఆచారాలను అపహాస్యం చేశారు. మనల్ని ఆత్మ న్యూనతలోకి నెట్టారు. మానసికంగా వారికి కట్టు బానిసలమయ్యేలా చేసుకున్నారు. మనం మేలుకోవాలి. మన చుట్టూ మన అంతం కోసం జరుగుతున్న కుట్రలను తెలుసుకోవాలి. మన నైపుణ్యంతో, విజ్ఞానంతో, సాహసంతో వాటిని ఛేదించాలి.

మన చరిత్ర మరుగున పడుతుంటే – మేధో సమరం జరుగుతు ఉంటే

నిజాల నిగ్గును తెల్చేదెవరు? – జగాన సత్యం నిలిపేదెవరు?

మన విజ్ఞానమె ఆయుధమై – సాంకేతికతే సాధనమై

శత్రు మూకలను ఎదిరించే – సైనికుడై నువు కదలాలి.

– కోజాగిరి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. కార్తీక పున్నమి నాడు ఆ పున్నమి వెన్నెల వెలుగులో భారత్ మాతాకీ జై నినాదాలతో స్వయంసేవకులందరూ అలసే దాకా ఆటలాడి, పాటలు పాడి ఆనక ఆ వెన్నెలలో పాలు కాచుకుని,  కార్తీక చంద్రుని కిరణాలు తాకిన ఆ పాలని సేవిస్తారు. ఆ ఆటపాటలలో వారి చదువుల, పదవుల, ఆర్ధిక స్థితిగతుల, కుల, వర్గ అంతరాలేవీ కానరావు. అసలవేవీ వారికి గుర్తు రావు. అసలవేవీ వారిలో లేవు. ఉన్నదొక్కటే మనమంతా తల్లి భారతి సంతానం. మనమంతా అన్నదమ్ములం. అదే సంఘం చేసే వ్యక్తి నిర్మాణం. అదే సంఘం వ్యక్తులలో నింపే సంస్కారం. అదే సామాన్యుణ్ణి సైతం అసామాన్యుడిగా తీర్చిదిద్దే సంఘ తంత్రం.

రండి పల్లె పల్లెకూ పరిగెడదాం. గుండె గుండెనూ తట్టి లేపి, ప్రతి గుండెలో తల్లి భారతి గుడి కడదాం.

భారత మాతకు ధర్మ దేవతకు గుండె గుండెలో గుడి కడదాం.

పవిత్ర హైందవ ధర్మ రక్షణకు పల్లె పల్లెకూ పరుగెడదాం…..

– శ్రీరాంసాగర్

గమనిక:  ఈ వ్యాసంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.