News

పహల్గాం ఉగ్ర దాడి.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఉసిగొల్పారా..?

300views

ప్రస్తుత పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ భారత్‌పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది. ఆయన ప్రకటనలు కూడా ఉగ్రదాడికి పురిగొల్పే అవకాశం ఉంది. దీనికి తోడు జమ్మూకశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకొంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండటం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భారత్‌లో పర్యటన కొనసాగుతున్న సమయంలో పహల్గాం దాడి చోటుచేసుకోవడం గమనార్హం.

పుల్వామా దాడి వేళ మునీరే ఐఎస్‌ఐ అధిపతి..!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనక పాక్‌ కోణాన్ని విస్మరించలేము. ఇటీవల ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ఆసీమ్‌ మునీర్‌ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలు బలపర్చే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓవర్సీస్‌ పాకిస్థాన్ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ ‘మన ఉద్దేశం స్పష్టం. కశ్మీర్‌ గతంలోనూ మన గొంతులోని రక్తనాళంలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. దానిని మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరుల పోరాటంలో.. వారిని ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్‌ కథ చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు. మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవి. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనవి రెండు దేశాలు’ అని మునీర్‌ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే పహల్గాం దాడి చోటుచేసుకొంది. అదే సమయంలో పాక్‌ వాయుసేనకు చెందిన రవాణ, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్‌, రావల్పిండి బేస్‌లకు తరలించడం అనుమానాలను బలపరుస్తోంది. 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్‌ పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అధిపతి. ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్‌ కావడంతో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రమూకను ఉసిగొల్పుతున్నారు.

ప్రచారంలోకి ఖలీద్‌ పేరు..
ఇక పాక్‌ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తుందని పేరున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ హస్తం ఈ దాడి వెనక ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన కమాండర్‌ సైఫుల్లా కుసురీ అలియాస్ ఖలీద్‌ ఈ దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు. ఇతడితోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఇద్దరు ఆపరేటీవ్‌లు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ఇక దాడిలో పాల్గొన్న వారు లష్కరే ముసుగు సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌’కు చెందినవారు. వారు ఈ మారణ హోమం మొత్తాన్ని కెమెరాల్లో చిత్రీకరించినట్లు కూడా వార్తలొస్తున్నాయి.

అంతర్జాతీయం చేయడానికి.. నాడు క్లింటన్‌ పర్యటన సమయంలో..
20 మార్చి 2000లో అనంత్‌నాగ్‌ జిల్లాలో ఛత్తీసింగ్‌పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకొన్నారు. నాడు సిక్కువర్గంలోని వారే ఉగ్రమూక లక్ష్యంగా మారారు. వాస్తవానికి అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూదిల్లీ పర్యటనలో ఉన్నారు. నాడు జమ్మూకశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే పాక్‌ ఈ దాడికి పాల్పడినట్లు భావించారు.

నాడు ఉగ్రవాదులు భారీ తుపాకులు, రెండు సైనిక వాహనాల్లో ఛత్తీసింగ్‌పొర గ్రామంలోకి వచ్చారు. వారు ఇంటింటికీ తిరిగి తమను సైనిక సిబ్బందిగా చెప్పుకొని.. తనిఖీల నిమిత్తం పురుషులు బయటకు రావాలని ఆదేశించారు. ఆ తర్వాత వారందరినీ గురుద్వారా వద్ద ఉంచి కాల్చి చంపేశారు. సైన్యమే ఆ పని చేసిందన్నట్లు అక్కడిని వారిని నమ్మించేలా నినాదాలు చేశారు. చివరికి దర్యాప్తు సంస్థలు పాక్‌ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు గుర్తించాయి.

జేడీ వాన్స్‌ సందర్శన సందర్భంగా..
పహల్గాం ఉగ్ర దాడికి.. గతంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి దగ్గరి సంబంధాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీసమేతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. అదే సమయంలో పహల్గామ్‌లో పర్యటకులపై ఉగ్రవాదులు దాడి చేసినవారు భద్రతా దళాల దుస్తుల్లో వచ్చారు. పర్యటకుల ఐడీలను పరిశీలించి మరీ దాడి చేశారు. ఇక్కడా పురుషులనే లక్ష్యం చేసుకోవడం గమనార్హం.