News

సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం

237views

యోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వినిపించిన తీర్పు సంతృప్తికరంగా లేదని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వెల్లడించిన విషయం తెలిసిందే. సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించడానికి ప్రతిపాదించిన అయిదు ఎకరాల స్థలానికి ఎలాంటి విలువ లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తమకు గౌరవం ఉన్నప్పటికీ పున:సమీక్షకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు మొదట్లో ఆయన తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. సాయంత్రానికి సున్నీ వక్ఫ్ బోర్డు పెద్దలు తమ మనసు మార్చుకున్నారు.

అయోధ్యలోనే ప్రత్యామ్నాయంగా అయిదు ఎకరాల స్థలాన్ని తమకు కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ స్థలాన్ని రాబట్టుకుని అక్కడే మసీదును పునర్నిర్మించాలని సున్నీ వక్ఫ్ బోర్డు సభ్యులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో- సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలని వారు నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయిదు ఎకరాల స్థలంలో మసీదును నిర్మించి దానికి బాబ్రీ పేరు పెట్టాలనే అంశంపై ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.

తీర్పును స్వాగతించిన అయోధ్య జామా మసీదు షాహీ ఇమామ్

సుప్రీంకోర్టు తీర్పును అయోధ్యలోని ప్రముఖ జామా మసీదు షాహీ ఇమామ్ సైతం స్వాగతించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ముస్లిం కూడా స్వాగతించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆలయం ఉన్న ప్రదేశంలో బాబ్రీ మసీదును నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు లభించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని సూచించారు. బాబ్రీ మసీదు భూమికి ప్రత్యామ్నాయంగా అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, దాన్ని స్వీకరించి, మసీదును నిర్మించుకోవాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై ఉందని చెప్పారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.