News

రామజన్మ భూమి న్యాస్ కే వివాదస్పద భూమి: సుప్రీం తీర్పు

265views

వివాదాస్పద అయోధ్య భూమి విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వివాదాస్పద భూమి రామజన్మ భూమి న్యాస్ కే చెందుతుందని అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్ తేల్చి చెప్పింది. అదే సమయంలో మశీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది. మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీని ద్వారా 143 ఏళ్లుగా కొన సాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. తీర్పు సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది .రాజకీయాలు..విశ్వాసాలకు అతీతంగా న్యాయ సూత్రాలకు లోబడి తమ తీర్పు ఉంటుందని స్పష్టం చేసింది. అదే సమయంలో అయిదుగురు జడ్జీల ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఈ తీర్పు వెలువరంచింది.

రామజన్మ భూమి న్యాస్ కే వివాదాస్పద స్థలం..

సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దేశం మొత్తం ఆసక్తిగా తిలకించిన ఈ కేసు తీర్పు విషయంలో రాజ్యంగ ధర్మాసనం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంది. తీర్పు మొత్తం ఏకాభిప్రాయంతో వెలువరించారు. అదే సమయంలో.. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందినదని, వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కు కోరలేదని స్పష్టం చేశారు. ప్రార్థనా మందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని పరిరక్షిస్తుందని వెల్లడించారు.

వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందన్నారు. వివాదాస్పద స్థలంలో మశీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ విభాగం చెబుతోందన్నారు. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ఆధారంగా నిర్ణయిస్తామమని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేసారు.

రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశం:

అయోధ్యను రామజన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని, మందిరాన్ని కూలగొట్టి మశీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదన్నారు. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమన్నారు. మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు మతాల వారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిపేవారని చెప్పారు. మొఘులుల కాలం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్‌ బోర్డు నిరూపించలేపోయిందన్నారు. ఇదే తీర్పులో వాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. తీర్పుపై ఐదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

అన్ని అంశాలనూ పరిగణించాం – సీజే

చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పేర్కొన్నారు. మసీదు కింద భారీ నిర్మాణం ఉందని చెబుతూ బాబ్రీమసీదును ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ఆధారాలు లేవని అన్నారు. మశీదును ముస్లింలు ఎప్పుడూ వదలివేయలేదని అన్నారు. అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారు. వారి విశ్వాసాలను తప్పుపట్టలేమని పేర్కొన్నారు. అయితే అక్కడ దేవాలయం ఉందనేందుకు ఆధారాలు లేవని అన్నారు.

మూడు నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు చెయ్యాలి…

అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సూచించింది. ఆ స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వం సేకరించిన స్థలంలో భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని పేర్కొంది. అదే విధంగా మూడు నెలల కాలంలో ట్రస్ట్ కు ఇస్తూ…మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ కోర్టు తీర్పు మీద స్పందనలు రావాల్సి ఉంది.
Source : One India

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.