News

పాక్ టూ భారత్ వయా నేపాల్ – యూపీలో హై అలర్ట్

164views

వివాదస్పద అయోధ్య అంశంపై తుదితీర్పు వెలువడే నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సైనిక, పోలీసు దళాలను మోహరింప జేశారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌లోకి పాకిస్థానీ ఉగ్రవాదులు ప్రవేశించారనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో యూపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాంతో యూపీ ప్రభుత్వం ఉగ్రవాదుల కదలికలపై దృష్టిపెట్టింది.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ నుంచి నేపాల్ ద్వారా యూపీలోకి ఏడుగురు టెర్రరిస్టులు ప్రవేశించారు. వారు అయోధ్య, ఫైజాబాద్, గోరఖ్‌పూర్‌లో తలదాచుకొన్నారు. అనుమానిత ఉగ్రవాదుల్లో ఐదుగురిని మహ్మద్ యాకూబ్, అబు హమ్జా, మహ్మద్ షాబాజ్, నిసార్ అహ్మద్, మహ్మద్ క్వామీ చౌదరీగా గుర్తించారు.

అయోధ్య వివాదంపై తుది తీర్పు తర్వాత యూపీలో అల్లర్లు, మారణ హోమం సృష్టించే అవకాశాలు ఉండటంతో ఉగ్రవాదుల చొరబాటును భద్రతా దళాలు సీరియస్‌గా పరిగణిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రజలకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఆదేశాలను జారీ చేసింది. మత, కమ్యూనిటీ పరమైన వ్యాఖ్యలు, ఇతర వర్గాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. అలాగే రామజన్మభూమి, బాబ్రీ మశీద్ వివాదానికి సంబంధించిన విషయాలపై చర్చలు, డిబేట్లు చేపట్టవద్దని  అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.