News

మతమార్పిడికి పాల్పడుతున్న పాస్టర్ పై కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన మత్స్యకారులు.

712views

మ గ్రామంలోని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి, ప్రలోభపెట్టి, భయపెట్టి మతం మార్చడమే కాకుండా గ్రామంలోని హిందువులపై దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్న పాస్టర్ కొక్కిలిగట్టె యోనాపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా శింగరాయకొండ సమీపంలోని ఊళ్ళపాళెం శివారు దేవళ్ళ పల్లెపాలెం గ్రామస్తులు సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో సుమారు ఏడు వందల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, ప్రతినిత్యం సముద్రంలో వేటకు వెళ్లి చేపలు పట్టి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. పురాతన కాలం నుంచి తమ గ్రామంలో ఉన్న రామాలయం పాతబడిపోయిన నందున గ్రామస్తులు అందరం కలిసి రెండెకరాల పొలం కొనుగోలు చేసి అందులో కొత్త రామాలయాన్ని నిర్మించుకుని నిత్యం పూజలు నిర్వహిస్తున్నామని, అయితే గత కొంతకాలంగా వేరే గ్రామం నుంచి వచ్చిన యోనా అనే పాస్టర్ రామాలయానికి, ఇండ్లకు సమీపంలో ఎలాంటి అనుమతి లేకుండా ఒక చర్చి నిర్మించి ఆ చర్చి కేంద్రంగా అమాయకులను తన మాయ మాటలతో ప్రలోభ పెట్టి, భయపెట్టి మతం మారుస్తున్నారని తెలిపారు. ఈ పాస్టర్ తో సన్నిహితంగా ఉండే గోవిందమ్మ, పాస్టర్ కుమారుడు దయాకర్ లు మతం మారని వారిపై చేతబడి చేస్తామని గ్రామస్తులను బెదిరిస్తున్నారని కూడా వారు తెలిపారు. పాస్టర్ యోనా గ్రామంలోని కొందరు స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వారి ద్వారా గ్రామంలోని ఇతర స్త్రీలను మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద పెద్ద మైకులు పెట్టి హిందూ దేవుళ్లను తిడుతూ ఇండ్ల లో ఉండే పిల్లలు చదువుకోకుండా ఆటంకం కలిగిస్తున్నాడని వివరించారు.

గ్రామ పెద్దలు సమావేశం ఏర్పాటు చేసి అతని వైఖరిని ప్రశ్నించగా “ నా ఇష్టం, నా చర్చి అడగడానికి మీరెవరు? ” అంటూ వారిమీదికి దౌర్జన్యానికి కూడా దిగాడని గ్రామస్తులు తెలిపారు. అంతేగాక “ నేను క్రైస్తవ పెద్దలను పిలిచి మీ అంతు చూస్తాను” అంటూ వారిని బెదిరించాడని కూడా తెలిపారు. అంతేగాక గ్రామస్తులపై తప్పుడు కేసులు బనాయించి అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు వాపోయారు. తమకు న్యాయం చేస్తానని చెప్పిన శింగరాయకొండ ఎస్ఐని కూడా ఖాతరు చేయక మరింత రెచ్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. భర్తను వదిలి మతం మార్చుకున్న గోవిందమ్మ వితంతు పెన్షన్ వంటి రాయితీలు పొందుతోందని ఆమె వాటికి ఎలా అర్హురాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.  ఓసారి గ్రామాన్ని సందర్శించి,  పాస్టర్ వలన గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కలెక్టర్ ని అభ్యర్థించారు.

Source : పెన్ పవర్, తెలుగు దినపత్రిక.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VAT ఆంధ్రప్రదేశ్ యాప్ ను డౌన్    లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.