ArticlesNews

శ్రీలక్ష్మీ చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు

354views

దక్షిణ భారతదేశంలో ప్రత్యేకతను సంతరించుకున్న వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. 7 శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. శ్రీపాంచరాత్రాగమశాస్త్ర ప్రకారం 14 రోజులపాటు అత్యంత వైభవంగా సాగే ఈ ఆధ్మాత్మిక వేడుక భక్తులకు ఓ మరుపురాని కానుక. ఆలయంలో అబ్బురపరిచే శిల్ప సంపద విజయనగర చక్రవర్తుల కళాతృష్ణకు తార్కాణంగా నిలుస్తుంది.

బ్రహ్మోత్సవాలు ఇలా..
శుక్రవారం అంకురార్పణ, శనివారం ఉదయం ధ్వజారోహణం, రాత్రికి రాయబారం, ఎదురుకోలు, సూర్యవాహనం, స్వామి వారి కల్యాణం(తెల్లవారితే ఆదివారం), 13న చంద్రవాహనం, 14న సింహ, 15న శేష, 16న వ్యాళి, 17వ తేదీ నుంచి పగలు ఉత్సవంగా పొన్న, 18న హనుమంత, 19న గరుడ, 20న గజ వాహనం, 21న సాయంత్రం 4.30 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. 22న అశ్వవాహనం, 23న హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 28న స్వామివారికి వసంతోత్సవం, ఊంజల్‌ సేవ, 29న 16 రోజుల పండగ నిర్వహించనున్నారు.

ఉత్సవ ఏర్పాట్లు పూర్తి
శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. మార్కాపురంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామి వారిని దర్శించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాం.– శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ