
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక పర్యటన సందర్భంగా స్లొవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఆమెకు స్లోవాక్ భాషలోకి అనువందించిన ఉపనిషత్తుల ప్రతిని బహూకరించారు. స్లోవాక్ భాషావేత్త రాబర్ట్ గాఫ్రిక్ ఐదేళ్లపాటు శ్రమించి 10 ఉపనిషత్తుల్ని నేరుగా సంస్కృతం నుంచి తమ భాషలోకి అనువదించారు. భారత్-స్లొవేకియాల మధ్య దృఢమైన సాంస్కృతిక సంబంధానికి ఇది తార్కాణమని విదేశాంగ శాఖ కార్యదర్శి తన్మయ లాల్ అన్నారు. సంస్కృతం, స్లోవాక్ భాషలు రెండూ ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి స్లొవేకియా పూర్తి మద్దతు ప్రకటించింది. రెండు రోజుల అధికారిక పర్యటనపై తమదేశానికి బుధవారం విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసిన అనంతరం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో స్లొవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకు ముందు పెల్లెగ్రిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ స్వాగత సత్కార కార్యక్రమంలో భాగంగా స్లొవేకియా సాంప్రదాయ దుస్తులు ధరించిన ఒక స్థానిక స్త్రీ పురుషుల జంట రాష్ట్రపతికి రొట్టె, ఉప్పు (బ్రెడ్ అండ్ సాల్ట్) అందించి స్వాగతం పలికింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ తాను 140 కోట్ల మంది భారతీయ ప్రజల శుభాకాంక్షలను తీసుకొచ్చానని ప్రకటించారు. స్లొవేకియాలో రాష్ట్రపతి ముర్ముకు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం లభించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము అనేక అంశాలపై ద్వైపాక్షిక సంప్రదింపుల్లో పాల్గొంటారు. స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో, జాతీయ కౌన్సిల్ స్పీకర్ రిచర్డ్ రాసిలతో కూడా ఆమె భేటీ అవుతారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై ఇరుదేశాలూ సంతకాలు చేయనున్నాయి. రాష్ట్రపతి తన పర్యటనలో స్లొవేకియాలో టాటా మోటార్స్ ఏర్పాటు చేసిన జాగ్వార్ లాండ్ రోవర్ కర్మాగారాన్ని దర్శిస్తారు. ఈ కర్మాగారం భారత స్లొవేకియాల పారిశ్రామిక అనుబంధానికి ప్రతీకగా నిలిచింది.





