
అయోధ్య రామాలయ మొదటి అంతస్తులో సీత, లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమాన్ సమేతుడైన శ్రీరాముని పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రసిద్ధ శిల్పి ప్రశాంత్ పాండేతో పాటు 20 మంది శిల్పకళా నిపుణులు ఈ విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వచ్చేనెలలో జరగనున్న భవ్యమైన కార్యక్రమంలో ‘శ్రీరామ దర్బారు’ను ప్రతిష్ఠించనున్నారని తెలిసింది. ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాదికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
ఆలయంలో స్థాపించడానికి సప్తర్షి విగ్రహాలతోపాటు సూర్య, గణేశ, హనుమాన్, దుర్గామాత, అన్నపూర్ణా దేవి విగ్రహాలూ ఇక్కడే రూపుదిద్దుకుంటున్నాయి. ‘‘విగ్రహాలన్నీ చివరి దశలో ఉన్నాయి. వాటిని ఆయోధ్య రామాలయానికి తీసుకెళ్తాం. మా దృష్టిలో ఇవి కేవలం కళాకృతులు మాత్రమే కాదు, ఇవి మా పవిత్రమైన బాధ్యత’’ అని శిల్పి ప్రశాంత్ పాండే అన్నారు. ‘‘శిల్పాలను చెక్కే క్రమంలో రాతిపై వేసే ప్రతి ఉలి దెబ్బలో ఎంతో భక్తి దాగి ఉంటుంది. మేము కేవలం విగ్రహాలను మాత్రమే రూపొందించడం లేదు, శ్రీరాముని కథను, ఆయన పాటించిన విలువలను ప్రపంచానికి చాటుతున్నాం’’ అని పాండే అన్నారు. అయోధ్యలో ఏర్పాటు కానున్న శీరామ దర్బారు రామ మందిరానికి హృదయంలాంటిదని ఆయన తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న ప్రతిష్ఠాపన బాల రాముడు, రాజారామునిగా పరివర్తన చెందడానికి ప్రతీకగా నిలవనుంది.





