
తిరుమలలోని పలు ప్రాంతాలు, కాటేజీల్లో శుభ్రత పెంచేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించి, వచ్చే ఫిర్యాదులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేయాలని టిటిడి ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. భక్తులు తితిదే వసతి గదులు ఎన్ని గంటలకు ఖాళీ చేస్తున్నారు.. తిరిగి ఎన్ని గంటలకు గదులు కేటాయిస్తున్నారనే సమగ్ర సమాచారం తెలిసేలా యాప్ రూపొందించి గదుల కేటాయింపులో ఆలస్యం కాకుండా చూడాలన్నారు. తిరుపతిలోని దేవస్థానం పరిపాలన భవనంలో ఈవో శుక్రవారం అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఇందులో ప్రధానంగా తిరుమలలో భక్తులకు శీఘ్రదర్శనం, గదుల కేటాయింపు, శుభ్రత తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ… శ్రీవారి భక్తులకు కల్పించే సౌకర్యాలు సంతృప్తికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లలో అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీలో భక్తుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి సమగ్ర విశ్లేషణాత్మక నివేదిక రూపొందించాలన్నారు. లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద ఆలస్యం చేయకుండా లడ్డూల పంపిణీ జరగాలన్నారు. తిరుమలలో రాత్రివేళల్లో ఉచిత బస్సుల సంఖ్య పెంచాలని సూచించారు. భక్తులు లగేజీని డిపాజిట్ చేసిన తర్వాత తిరుమలకు సకాలంలో చేర్చాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, ఇన్‌ఛార్జి సీవీఎస్వో వి.హర్షవర్ధన్‌రాజు, తితిదే సీఈ టి.వి.సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.





