ArticlesNews

దాసబోధ ప్రబోధకులు సద్గురు సమర్థ రామదాసు

392views

( ఏప్రిల్ 6 – సమర్థ రామదాసు జయంతి )

సమర్థ రామదాసు శివాజీ మహారాజు గారి గురువు. వీరు నేటి మహారాష్ట్రలోని పవిత్ర గోదావరి తీరాన ఉన్న జంబ అనే గ్రామములో రాణు భాయి, సూర్యాజీ పంత్ అనే పుణ్య దంపతులకు 1530 చైత్ర మాసం శ్రీ రామ నవమి రోజున జన్మించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 6 శ్రీరామ నవమి నాడు ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. సమర్థ రామదాసు అసలు పేరు నారాయణ.. వీరికి గంగాధర అని సోదరుడు కూడా ఉండేవారు. చాల చురుకుగా, దృడ శరీరం కలిగి నారాయణ , చిన్నతనము నుండే రామ హనుమానుల భక్తులు అయ్యారు. 11 ఏళ్ళ పిన్న ప్రాయములోనే జ్ఞాసిద్ధి కలిగి, ఆధ్యాత్మికభావంతో ఉండేవారు. తమ కుమారుడికి వివాహం చేస్తే అన్నీ సర్దుకుంటాయని ఆయన తల్లి తండ్రులు భావించారు. కానీ నారాయణ రాత్రికి రాత్రే ఇంటిని తల్లిదండ్రులను వదలి అడవులకు వెళ్లి ఆయన తపస్సు చేస్తూ.. యోగులతో కలసి జ్ఞాన విద్యను అభ్యసించారు.

నారాయణ ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే లేచి సూర్య నమస్కారాలు తప్పకుండా చేసేవారు. ఆ తర్వాత ‘శ్రీ రామ జయరామ’ రామ నామాన్ని మధ్యాహ్నం వరకు జపించి తరువాత దగ్గరలోని శ్రీరామ ఆలయాన్ని సందర్శించేవారు. ఆయన ఎక్కువ సమయాన్ని యోగులతో, జ్ఞానులతో చర్చలు జరపడం, భజనలు వింటూ కాలం గడిపేవారు. ఇలా 12 ఏళ్ళ కాలం గడిచాక ఆయనకు శ్రీరామ సాక్షాత్కారం లభించింది. అప్పటి నుండీ ఆయన పేరు సమర్థ రామ దాసు అయింది.

సమర్థ రామదాసు కాలినడకన భారతదేశంలోని అనేక ప్రదేశాలను సందర్శించారు. సదాచార సంపన్నులు ఎందరో ఆనాటి మొఘల్ పాలకుల వల ఇక్కట్ల పాలవ్వడాన్ని చూసి కలత చెందారు. ప్రజలను పీడించి పాలిస్తున్న ఆనాటి పాలకులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కోసం వారు అన్వేషించ సాగారు. ఆయన 1566 సంవత్సరములో చఫల్ ఆనే గ్రాములో శ్రీరామ విగ్రహాన్ని ప్రతిష్టించి.. ప్రతి గ్రామ గ్రామాన రాముల వారి, హనుమంతుల వారి గుళ్ళను కట్టించి భక్తి ప్రచారం చేయసాగారు. అలాగే అనేక విద్యాలయాలు కూడా ప్రారంభించి ఆనాటి ప్రజలను విద్యావంతులను చేయడానికి కృషి చేశారు. ఆనాటి ప్రజలకు స్వామీ వారి బోధలన మీద అమిత నమ్మకం ఉండేది. కుటుంబంలో స్త్రీ ప్రాముఖ్యతను పెంపొందింపజేసే విధముగా స్త్రీలకు గౌరవ భావాలు కలిగేట్టు చేసి వారికి సమాజములో ఉన్నత స్థాయిని కలిగేట్టు చేసారు. స్త్రీ పురుషులందరూ సమానులని, పురుషులు స్త్రీ గర్భము నుండే జన్మించారు కాబట్టి వారికి అత్యంత ప్రాముఖ్యత నివ్వాలని నొక్కి వక్కాణించారు. స్త్రీలకూ తన విద్యా సంస్థల బాధ్యతలు అప్పగించి వారు వాటిని ధైర్యంగా నడిపే విధంగా ప్రోత్సహించారు. అలా ఆయన శిష్యురాళ్ళు అయిన వెన్నా బాయి, అక్కా బాయి సమర్థ రామదాసు వారి విద్యాలయాలను నడిపే వారు. కుల, వర్గ విభేదాలను ఖండించి హిందువుల ఐక్యత కోసం సమర్థ రామదాసు కృషి చేసారు. మానవులందరూ సమానమని బోధించారు.

శివాజీ మహారాజు హైందవి సామ్రాజ్య స్థాపనకు కృషి చేస్తుండగా సమర్థ రామదాసు వారికి వెన్ను దన్నుగా నిలిచి తన బోధనలతో అమిత చైతన్య వంతునిగా తీర్చి దిద్దారు. తద్వారా తాను అనుకున్న హైందవ సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ చేసారు. సమర్థ రామ దాసు గొప్ప కవి కూడా.. దశ బోధ, ఆత్మారాం, మన పంచకం, ఆనంద భువనం, శివ కళ్యాణ రాజ వంటి అనేక గ్రంథాలు రచించారు.

మహారాష్ట్రీయులను తన గొప్ప బోధనలతో గొప్ప ధార్మికులుగా, ధైర్య వంతులుగా, సాటి లేని దేశ భక్తులుగా తీర్చి దిద్ది సమర్థ రామదాసు చాలా శక్తి వంతమైన సమాజాన్ని సృష్టించారు. పేదరికం లేని సమానత్వం కలిగిన సమాజ స్థాపనలోనూ, మహారాజు శివాజీని ముందుండి నడిపించిన సమర్థ రామదాసు 1603వ సంవత్సరం మాఘ మాసములోని తొమ్మిదవ రోజున సజ్జన్‌గడ్‌లో ఆ శ్రీరాముడిలో ఐక్యం అయ్యారు. ఆ మహానుభావుడు రచించిన దాసబోధ నేటికీ మహారాష్ట్రలో ప్రతి ఇంటా ఉంటుంది. ఆయన బోధనలు నేటికీ మార్గదర్శనంగా నిలుస్తున్నాయి.